
పైరసీ.. చిత్ర పరిశ్రమను ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న చీడపురుగు. వేల మంది కష్టాన్ని మింగేస్తూ.. కోట్ల రూపాయాల వ్యాపారానికి నష్టాన్ని కలిగిస్తుంది. సినిమా విడుదలైన ఒకటి, రెండు రోజుల్లోనే సోషల్ మీడియాలో పైరసీ కాపీలు ప్రత్యక్షమవుతున్నాయి. కరోనా తర్వాత ఓటీటీ వాడకం పెరగడంతో కొన్నాళ్ల పాటు నివురు గప్పిన నిప్పులా ఉన్న పైరసీ భూతం ఇప్పుడు మళ్లీ జడలు విప్పింది. వందల కోట్లతో నిర్మించిన చిత్రాలు.. రిలీజైన రోజే పైరసీ వెబ్‌సైట్లలో ప్రత్యేక్షం అవుతున్నాయి. దీని వల్ల నిర్మాతలకు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. టాలీవుడ్‌లో ఇటీవల రిలీజైన మిరాయ్ చిత్రాన్ని సైతం ఈ పైరసీ బూతం వదల్లేదు. ఈ నేపథ్యంలో ఓటీటీ సంస్థ జియోస్టార్ పైరసీ అడ్డుకట్టకు వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. స్ట్రీమింగ్ రైట్స్‌తో పాటు అన్ని హక్కులను కొనుగోలు చేసిన ఓ బాలీవుడ్ మూవీని పైరసీ నుంచి కాపాడాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన ధర్మాసనం.. 72 గంటల్లోగా పైరసీ వెబ్‌సైట్లను బ్లాక్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
రిలీజ్‌కు ముందే..
బాలీవుడ్‌లో కామెడీ ఆధారంగా రూపొందిన కోర్ట్ రూమ్ డ్రామా జాలీ ఎల్ఎల్‌బీ, జాలీ ఎల్ఎల్‌బీ 2 చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఆ తర్వా త ఈ సిరీస్‌లో మూడో చిత్రంగా వస్తున్న చిత్రం జాలీ ఎల్ఎల్‌బీ 3. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, సీనియర్ నటుడు అర్హద్ వార్సీ, సౌరబ్ శుక్లా, అమృత రావు, హ్యుమా ఖురేషి, బోమన్ ఇరానీ, సీమా బిశ్వాస్, గజరాజ్ రావు, రామ్ కపూర్, అన్ను కపూర్ కీలక పాత్రలు పోషించారు. అలోక్ జైన్, అజిత్ అంధారి నిర్మించిన ఈ కామెడీ లీగల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి సుభాష్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆ మూవీ డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన జియోస్టార్..ఈ సినిమాని అక్రమంగా స్ట్రీమింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసింది. పైరసీ చేస్తున్న సుమారు 20 వెబ్‌సైట్లకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ..వాటిని బ్లాక్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
72 గంటల్లోగా బ్లాక్ చేయాలి
విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఆ 20 వెబ్‌సైట్లకు సంబంధించినడొమైన్ రిజిస్ట్రేషన్‌లను 72 గంటల్లోపు నిలిపివేయాలని డొమైన్ నేమ్ రిజిస్ట్రార్లు (DNRలు), ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, టెలికమ్యూనికేషన్స్ విభాగంతో పాటు ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించింది.
అంతేకాదు సినిమా విడుదలకు ముందు లేదా విడుదల సమయంలో కనుగొనబడిన అదనపు పైరసీ వెబ్‌సైట్‌ల వివరాలను తెలియజేయడానికి జియోస్టార్‌కు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని, వాటిని కోర్టు ఆదేశాలు లేకుండానే బ్లాక్ చేయొచ్చని తీర్పులో వెల్లడించింది. తప్పుగా బ్లాక్ చేస్తే..కోర్టును సంప్రదించి, సవరించుకోవచ్చుననని ఆదేశాలు జారీ చేసింది. పైరసీ వెబ్‌సైట్లలనో సినిమాను ప్రసారం చేయడం వల్ల నిర్మాతల ఆదాయం గణనీయంగా తగ్గుతుందని, కోలుకోలేని నష్టాన్ని నివారించడానికి త్వరిత జోక్యం అవసరమని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తు చేసింది. తదుపరి విచారణనను వచ్చే ఏడాది జనవరి 20కి వాయిదా వేసింది.