‘‘చాంపియన్’ సినిమా కోసం మూడున్నరేళ్లు పట్టిందని రోషన్ చెప్పాడు. మేము కూడా కొన్ని సినిమాలకు మూడు, నాలుగైదేళ్లు ఉన్నాం. అయితే ఎన్ని రోజులు తీశాం అన్నది కాదు. ‘చాంపియన్’ ట్రైలర్ చూస్తుంటే సినిమా అద్భుతంగా వచ్చిందని తెలుస్తోంది. నా సెకండ్ ఫిల్మ్ ‘మగధీర’ ఎంత పెద్ద హిట్ అయిందో... రోషన్‌కి ‘చాంపియన్’ అంత పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని హీరో రామ్‌చరణ్ చెప్పారు. రోషన్, అనస్వరా రాజన్ జోడీగా నటించిన చిత్రం ‘చాంపియన్’. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. సి. అశ్వినీదత్, జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ బ్యానర్స్‌పై ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది.
గురువారం జరిగిన ‘చాంపియన్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్‌చరణ్ మాట్లాడుతూ– ‘‘ఎన్టీఆర్‌కి మొదటి సినిమా ‘స్టూడెంట్ నెంబర్ 1’, అల్లు అర్జున్‌కి తొలి చిత్రం ‘గంగోత్రి’, మహేశ్‌బాబుకి ‘రాజకుమారుడు’, నాకు ‘చిరుత’... ఇలా మాకు ముఖ్యమైన వ్యక్తి అశ్వినీదత్‌గారు. మేం కెరీర్ మొదలు పెట్టినప్పుడు అందరి నిర్మాతలకంటే ముందు ధైర్యంగా వచ్చి... అఫ్‌కోర్స్... మా వెనక ఫ్యామిలీ ఉండొచ్చు కానీ, మేం ఎలా యాక్ట్ చేస్తామో తెలీదు, మమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారో తెలియని టైమ్‌లో వచ్చి, నటుడిగా పరిచయం చేసి మరచిపోలేని జర్నీ ఇచ్చిన దత్‌గారికి, ఆయన ఫ్యామిలీకి థ్యాంక్స్.
ఇప్పుడు రోషన్ కూడా ‘చాంపియన్’తో వస్తున్నాడు. తను హాలీవుడ్ హీరోలా, యూరోపియన్ యాక్షన్ హీరోలా ఉన్నాడు... అందంగా ఉన్నాడు. ‘చాంపియన్’ చిత్ర నిర్మాతలు స్వప్న, ప్రియాంక ఇంత ప్యాషనేట్‌గా, హార్డ్ వర్క్‌తో పని చేస్తుండటం ఆశ్చర్యంగా లేదు. ఎందుకంటే దత్‌గారి ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి. నాగ్ అశ్విన్‌గారితో ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ (‘కల్కి 2898 ఏడీ’) మూవీ ఇచ్చారు. అవకాశం ఉంటే స్వప్న సినిమాస్‌లో ఓ సినిమా చేద్దామనుకుంటున్నాను. ఇంత ప్యాషనేట్ పీపుల్స్‌తో పని చేస్తే సరదాగా షూటింగ్‌కి వెళ్లి వచ్చేయొచ్చు. ఇక ‘చాంపియన్’కి ప్రదీప్ అద్వైతంగారి కష్టం కనిపిస్తోంది. రోషన్ పరిణతి ఉన్న నటుడిలా నటించాడంటే తనని పాత్ర కోసం చాలా బాగా తీర్చిదిద్దారు. అనస్వర మలయాళీ అయినా తెలుగు నేర్చుకుని, డబ్బింగ్ చెప్పడం చూసి ఇంప్రెస్ అయ్యాను. అన్ని విభాగాల వాళ్లు ఎంతో కష్టపడి పని చేశారు. ఈ సినిమాని ఈ నెల 25న చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని తెలిపారు.


