హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన తాజా సినిమా ‘అఖండ 2: తాండవం’. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ఈ చిత్ర సంగీతదర్శకుడు తమన్ మాట్లాడుతూ– ‘‘అఖండ 2: తాండవం’ కథ విన్నప్పుడే కథలో హై మూమెంట్స్ ఉన్నాయనుకున్నాం. కమర్షియల్ పంథాలో సనాతన ధర్మాన్ని కరెక్ట్‌గా ఆడియన్స్‌కు చూపించడం, అదీ బాలకృష్ణగారిలాంటి స్టార్‌తో చేయడం చిన్న విషయం కాదు. ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం సవాలుగా అనిపించింది.
ఆడియన్స్‌ను ఎలా ‘అఖండ 2’ ట్రాన్స్‌లోకి తీసుకువెళ్లాలని ఆలోచించి, చాలా హార్డ్‌వర్క్ చేసి ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేశాం. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడానికి 73 రోజులు పట్టింది. శివుని, హనుమంతుని మంత్రాలను ఎలా చేయాలని ఆలోచిస్తూ, 20 రోజులు కసరత్తు చేశాం. కల్యాణ్ చక్రవర్తి, కాసర్ల శ్యామ్, శర్మగార్లు... ఇలా లిరిక్ రైటర్లు కూడా సంస్కృతంలో చాలా ఉన్నతమైన లిరిక్స్ రాశారు.
‘అఖండ’ సినిమాకు సంగీతం ఇవ్వడం స్కూల్‌కి వెళ్లినట్లు ఉంటే, ‘అఖండ 2: తాండవం’ చిత్రానికి కాలేజీకి వెళ్లడం అనే ఫీలింగ్ కలిగింది. ‘గేమ్ చేంజర్, డాకు మహారాజ్, అఖండ, ఓజీ’... ఇలా ఈ ఏడాది గ్రాండ్‌గా ముగిస్తున్నాను. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ‘ది రాజాసాబ్’ ఉంది. ఇక బాలకృష్ణగారి 111వ సినిమాకూ నేనే మ్యూజిక్ అందిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.


