టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తోన్న పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ఛాంపియన్. ఈ మూవీకి ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం క్రిస్‌మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. వైజయంతీ మూవీస్ సంస్థతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మా దత్తు గారికి, వైజయంతి మూవీస్‌కి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. మమ్మల్ని బలంగా నమ్మి.. మాకు నటన వస్తుందో రాదో తెలియకపోయినా సినిమాలు ప్రొడ్యూస్ చేశారని అన్నారు. ఎన్టీఆర్‌కు స్టూడెంట్ నంబర్1, అల్లు అర్జున్‌కు గంగోత్రి, మహేశ్ బాబుకు రాజకుమారుడు, నాకు చిరుత.. ఇలా మా అందరికీ మోస్ట్ బ్యూటీఫుల్ పర్సన్ దత్తుగారేనని తెలిపారు. చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నా.. మాకు యాక్టింగ్ తెలియని టైమ్‌లో మమ్మల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారని రామ్ చరణ్ అన్నారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'గంగోత్రితో అల్లు అర్జున్‌ను, రాజకుమారుడుతో మహేశ్‌బాబును, చిరుతతో నన్ను హీరోగా పరిచయం చేశారు అశ్వనీదత్. ఆయనకు మరోసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మాది సినీ బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ కావొచ్చు. మేం యాక్టింగ్ చేస్తామో తెలియకపోయినా మాకు అవకాశం ఇచ్చిన వ్యక్తి. వైజయంతి మూవీస్ వారసత్వాన్ని ప్రియాంక, స్వప్న కొనసాగిస్తున్నారు. అంకిత భావంతో పని చేసే ఇలాంటి నిర్మాతలతో సినిమాలు చేయడం అదృష్టం. రోషన్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఈ మూవీ పోస్టర్లలో హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. నా రెండో సినిమా మగధీరలా.. రోషన్ రెండో చిత్రం ఛాంపియన్ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నారు. ఈ ఈవెంట్‌లో శ్రీకాంత్, దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా పాల్గొన్నారు.


