సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటోంది. సినీతారలు ఏదో ఒక సందర్భంలో అలాంటి అనుభవాన్ని ఎదుర్కొనే ఉంటారు. కొందరు వాటిని బహిరంగంగా మాట్లాడితే.. మరికొందరు బయటికి చెప్పలేక సతమతమవుతుంటారు. గతంలో చాలామంది హీరోయిన్స్ తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. తాజాగా మరో నటి తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసింది.
బాలీవుడ్ నటి, స్టార్ క్రికెటర్ దీపక్ చాహర్ సోదరి అయిన మాల్టీ చాహర్ ఇటీవలే సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ సీజన్-19లో కనిపించింది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన మాల్టీ చాహర్ తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడినట్లు తెలిపింది. కెరీర్ ప్రారంభంలో ఇలాంటి అనుభవం ఎదురైందని చెప్పుకొచ్చింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో పరిస్థితులు, క్యాస్టింగ్ కౌచ్ సంఘటనల గురించి మాట్లాడింది.
తనకు క్యాస్టింగ్ డైరెక్టర్లతో ఎలాంటి సమస్య రాలేదని మాల్టీ చాహర్ తెలిపింది. ఏ క్యాస్టింగ్ డైరెక్టర్ కూడా నాతో అసభ్యంగా ప్రవర్తించలేదని వెల్లడించింది. అయితే ఓ దర్శకుడు మాత్రం వర్క్ పరంగా మాట్లాడే సమయంలో అనుచితంగా ప్రవర్తించాడని వివరించింది. ఆ వేధింపులు ఎప్పుడూ ప్రత్యక్షంగా ఉండేవి కావని.. వారి ఉద్దేశ్యాన్ని బయటికి చెప్పకుండా అలాంటి హింట్స్ ఇస్తారని మాల్టీ తెలిపింది. ఓ దక్షిణాది నిర్మాతతో సమావేశమైనప్పుడు అతని హోటల్ రూమ్ గది నంబర్ తనకు ఇచ్చాడని ఆ అనుభవాన్ని పంచుకుంది. అలాంటి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. ఆ సమయంలో నేను అర్థం కానట్లు నటించానని.. ఆ తర్వాత మేము మళ్లీ కలుసుకోలేదని మాల్టీ చెప్పుకొచ్చింది.
మాల్టీ చాహర్ మాట్లాడూతూ..'ఒక ఆఫీస్ మీటింగ్‌లో వీడ్కోలు సమయంలో తనకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. సాధారణ ఆలింగనం అని భావించా. కానీ అతను నన్ను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. అది నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. వెంటనే అతన్ని అడ్డుకుని.. ఆ తర్వాత అతనితో అన్ని సంబంధాలను తెంచుకున్నా. అక్కడే అతన్ని నిలదీశా. అతన్ని నా తండ్రిలా భావించా. ఆ సంఘటన నాకు ఒక గుణపాఠం నేర్పింది. ఎవరినీ కూడా ఉన్నత స్థానంలో ఉంచొద్దు. 'అని అన్నారు. మహిళలు అవకాశాల కోసం ఇలాంటి వాటికి అంగీకరించవద్దని సూచించింది. మనపై మనకు నియంత్రణ ఉండాలని కోరింది.
కాగా.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఈ బ్యూటీ 2018లో అనిల్ శర్మ దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం జీనియస్ ద్వారా రూబీనా పాత్రను పోషించింది. అరవింద్ పాండే దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా ఇష్క్ పాష్మినా (2022)లో ఒమిషా పాత్రను పోషించి తన నటనా నైపుణ్యాలను మరింతగా ప్రదర్శించింది. అనేక బ్రాండ్లకు ప్రచారకర్తగా కూడా ఆమె పనిచేస్తోంది. ఇన్‌స్టాలో గ్లామరస్ ఫొటోలు, ఫ్యాషన్ పోస్ట్‌లతో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. 2018లో ఐపీఎల్ మ్యాచ్‌లో మిస్టరీ గర్ల్‌గా ఫేమస్ అయ్యింది. ఆ తరువాత ఆమె దీపక్ చాహర్ సోదరి అని ప్రపంచానికి తెలిసింది.


