నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘గుర్రంపాపిరెడ్డి’. మురళీ మనోహర్ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో నేను సౌధామిని అనే నర్సుపాత్ర చేశాను. డాక్టర్ కావాలనుకుంటున్న సౌదామిని జీవితంలోకి గుర్రంపాపిరెడ్డి (నరేశ్ అగస్త్య రోల్) వచ్చి, ఆమె జీవితాన్నే మార్చేస్తాడు. దీంతో ‘గుర్రంపాపిరెడ్డి’ గ్యాంగ్‌తో కలిసి సౌదామిని ఓ దొంగతనంలోపాల్గొనాల్సి వస్తుంది.
ఆ తర్వాత ఏం జరుగుతుందనేది? సినిమాలో చూడాలి. ఈ చిత్రంలో నేను డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తాను. ఈ చిత్రం కోసం ఓ ప్రమోషనల్ సాంగ్ చేశాను. ఈపాటకు నేనే కొరియోగ్రఫీ చేశాను. యాక్షన్ సైకో కిల్లర్, సీరియల్ కిల్లర్ తరహా రోల్స్ చేయాలని ఉంది. ‘భగవంతుడు’ సినిమాలో విలేజ్ గాళ్‌గా చేస్తున్నాను. ‘మత్తు వదలరా 3’ ఉంది. సందీప్ కిషన్ మూవీలో ఓ రోల్ చేస్తున్నాను. ‘గాయపడ్డ సింహం’ చిత్రంలో కీ రోల్ చేస్తున్నాను. నాకు దర్శకత్వం వహించాలని ఉంది. కొన్ని కథలు రాస్తున్నాను’’ అన్నారు.


