తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్ మరో మూడు రోజుల్లో ముగియనుంది. టాప్ 5లో చోటు కోసం అలుపెరగని పోరాటం చేసిన హౌస్‌మేట్స్ దిల్ ఖుష్ చేసేందుకు జర్నీ వీడియోలు చూపిస్తున్నాడు. ఇప్పటికే ఇమ్మాన్యుయేల్ ఏవీ అయిపోయింది. తనూజ, పవన్ జర్నీ వీడియోలను ప్లే చేస్తూ భారీ ఎలివేషన్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఆ విశేషాలను గురువారం (డిసెంబర్ 18) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం...
నటనపై ప్రశంసలు
ముందుగా తనూజ టాలెంట్‌ను వర్ణించాడు బిగ్‌బాస్. తెరపై మీ నటన, మీరు పలికించిన భావాలతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు. మిమ్మల్ని వారింట్లో కూతురిగా మార్చారు. గొప్ప నటిగా పాత్రల్లో మీరు పరకాయ ప్రవేశం చేసే తీరుకు అది నిదర్శనం. కానీ, బిగ్‌బాస్ ఇల్లు మీకు పరిచయం లేని ప్రదేశం. నటనకు ఆస్కారం లేని చోటు.. మనుషుల్ని ఎలాంటి పరదా లేకుండా చూపించే వేదిక. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని టాప్ 5లో నిల్చుని మీరెంత చిచ్చరపిడుగో నిరూపించారు.
గేమ్ అంతా మీ చుట్టూనే..
నిజాన్ని ఎదుర్కోవడానికి భయపడని మీ తత్వం.. అందరితో కలిసి అల్లరిచేసే విధానం మీలోని అయస్కాంత శక్తికి ప్రేక్షకులతో సహా ఎవరూ అతీతులు కారని స్పష్టం చేశారు. ఈ ఇంట్లో ప్రతి విషయం మీ చుట్టే తిరిగిందంటే అతిశయోక్తి కాదు. ఈ ఇంట్లో అందరూ మీతో కలిసిపోయినవారు లేదా కలబడ్డవారు. భావోద్వేగాల గని మీరు. మనుషుల్ని మీవైపు తిప్పుకోవడంలో, ఆటను మీ నియమాలతో ఆడించడంలో నేర్పరి మీరు.
నిందలతో నొచ్చుకున్న మనసు
ఈ రణరంగంలో ఎంతమంది బలమైన, తెలివైన యోధులున్నా ఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు స్పష్టంగా తెలిసిన సేనాధిపతి మీరు. వంటగది నుంచే ఇంటిని గెలిచినతీరు ఆటలో ఎంత బలమైనవారో స్పష్టం చేస్తుంది. రీల్, రియల్ పర్సనాలిటీతో అందరినీ ప్రేమలో పడేలా చేశారు. బంధాలను, బాధ్యతలను సమంగా మోశారు. కేవలం బంధాల పునాదులపై ఆటాడుతారని, అందరి మద్దతు కోసం పాకులాడతారని నిందించినప్పుడు మీ మనసెంతగానో నొచ్చుకుంది.
అది మీ వ్యక్తిత్వం
బంధాలకు అతీతులెవరూ లేరని మీకనిపించింది. నాన్న అనే ఎమోషన్ మీకు నిజంగా ఉన్నా మనసును రాయి చేసుకుని అవసరమైనప్పుడు అది పక్కనపెట్టి ఆట ముందుకు తీసుకెళ్లారు. చిన్న విషయానికి మనసు నొచ్చుకునే దూది లాంటి సున్నితత్వం.. కదనరంగంలో విరుచుకుపడే శివంగిలాంటి ధీరత్వం.. కత్తికి రెండువైపులా పదునైనది మీ వ్యక్తిత్వం.
జర్నీ వీడియో
మిగతా వారి ఆట టాస్కులో మాత్రమే బయటకు వస్తే మీ ఆట ప్రతి నిమిషం కొత్త మలుపులతో మరింత బలంగా ముందుకు సాగుతూ వచ్చింది. ఈ ఇంట్లో, ప్రేక్షకుల మదిలో ఓ కుటుంబసభ్యురాలిగా మారి అందరి ప్రేమను పొందిన విధానమే తనూజను ఈరోజు ఇక్కడ నిలబెట్టింది. ఎన్నో భావాలతో, బంధాలతో నిండిన మీ ప్రయాణం ఓసారి చూద్దాం.. అంటూ జర్నీ వీడియో ప్లే చేశారు.
షాకైన తనూజ
అందులో భరణితో నాన్న బంధాన్ని చూపించారు. అలాగే కల్యాణ్‌తో స్నేహాన్ని లవ్‌ట్రాక్ అన్న లెవల్‌లో చూపించారు. ఇదంతా చూశాక తనూజ సంతోషం పట్టలేకపోయింది. ఇదంతా ఒక కలలా ఉంది. ఎక్కడో పుట్టిపెరిగిన నన్ను ఇక్కడ నిలబడేలా చేసిన నా ఆడియన్స్‌కు థాంక్యూ అంటూ స్టేజీని ముద్దాడింది. కల్యాణ్‌తో.. వీడియో మొత్తం మనిద్దరిదే ఉందిరా, షాకైపోయానంది. అది తాను ముందే ఊహించానన్నాడు ఇమ్మాన్యుయేల్. తర్వాత పవన్ జర్నీ వీడియో ప్లే చేశారు.


