పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ(iBomma ) నిర్వాహకుల్లో కీలక వ్యక్తి ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం కూకట్‌పల్లిలో రవి(Immadi Ravi)ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సాయంత్రం నాంపల్లి కోర్టుకి తరలించారు. రవి నుంచి వైరసీ వెబ్‌సైట్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. రవి ఆంధప్రదేశ్‌లోని వైజాగ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
కూకట్‌పల్లిలోని అపార్ట్‌మెంట్‌లో అతడి ఫ్లాట్ నుంచి హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్‌డీ ప్రింట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాల కంటెంట్‌ను హోల్డ్ చేసినట్టు సమాచారం.
రవిని అదుపులోకి తీసుకొని విచారించగా..సంచలన విషయాలు బయటపడ్డాయట. పైరసీ వెబ్‌సైట్‌ని రన్ చేస్తున్న మరికొంతమంది పేర్లు కూడా వెల్లడించినట్లు తెలుస్తోంది. త్వరలో మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
తెలుగు సినిమాలను పైరసీ చేయడంపై గతంలో ఐ-బొమ్మపై తెలుగు ఫిల్మ్ యాంటీ పైరసీ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ వెబ్‌సైట్ నిర్వాహకులు పోలీసులకు సవాలు విసిరారు. ఆ ఛాలెంజింగ్‌గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు వారిపై దృష్టిసారించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రవిని.. శనివారం ఉదయం కూకట్‌పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.


