సినిమా పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (i-Bomma) నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలంగా కరేబియన్ దీవుల్లో ఉంటూనే ఐబొమ్మ వెబ్‌సైట్‌ను రవి నిర్వహిస్తున్నట్లు వారు గుర్తించారు. ఫ్రాన్స్ నుంచి తాజాగా అతను హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు సమాచారం రావడంతో పక్కా ప్లాన్‌తో కూకట్‌పల్లిలో రవిని అదుపులో తీసుకున్నారు. భార్యతో విడాకులు తీసుకుని ఇమ్మడి రవి ఒంటరిగానే ఉంటున్నట్లు తెలుస్తోంది.
సినీ పరిశ్రమకు సుమారు రూ. 3 వేల కోట్ల రూపాయల వరకు నష్టాన్ని చేకూర్చిన రవి అకౌంట్‌లో ఉన్న రూ. 3 కోట్లు ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ కాపీని ఐబొమ్మలో రిలీజ్ చేయడంతో సినీ పరిశ్రమ భారీగా నష్టపోతుందని నిర్మాతలు వాపోయిన విషయం తెలిసిందే.
సినిమాలతో పాటు ఓటీటీ కంటెంట్‌ను పైరసీ చేస్తున్న ఈ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు గట్టిగానే కొనసాగించారు. కొద్దిరోజుల క్రితం థియేటర్‌లో సినిమాను రికార్డ్ చేసే వారితో పాటు సర్వర్లు హ్యాక్ చేస్తున్న కొందరిని అరెస్టు చేశారు. అయితే, పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా ఐబొమ్మ వెబ్‌సైట్‌పై కూడా దృష్టి పెట్టారు. దీంతో ఐబొమ్మ నిర్వాహకులు పోలీసులకు సవాల్ విసిరారు. దానిని ఛాలెంజింగ్‌గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు.



