సాక్షి,హైదరాబాద్: దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకు భారీ నష్టం కలిగించిన పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ (iBomma) ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ఇమ్మడి రవి పోలీసుల రిమాండ్ రిపోర్టులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇమ్మడి రవి విడాకుల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో అతని భార్య పోలీసులకు సమాచారం ఇచ్చిందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, రిమాండ్ రిపోర్టులో మాత్రం ఈ విషయం ఖండించింది. రవిని పట్టించడంలో అతని భార్య పాత్ర లేదని, అతను వినియోగించిన రెండు డొమైన్ల ఆధారంగా పోలీసులు అతన్ని గుర్తించినట్లు తేలింది.
టెక్నికల్ ఆధారాలు, డొమైన్ల వివరాలు
రవి ‘ఐబొమ్మ’తో పాటు ‘బప్పం టీవీ’ పేరుతో 17 ప్రధాన వెబ్‌సైట్లు, అలాగే 65కు పైగా మిర్రర్ వెబ్‌సైట్లు నిర్వహించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ వెబ్‌సైట్లకు నెలకు సుమారు 3.7 మిలియన్ల యూజర్లు లాగిన్ అవుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ భారీ ట్రాఫిక్‌ను ఉపయోగించి, రవి బెట్టింగ్ సైట్లకు లింక్ చేసిన రెండు ట్రాఫిక్ డొమైన్లు ఏర్పాటు చేశాడు. వాటిలో ఒకటి అమెరికా నుంచి, మరొకటి అమీర్‌పేట నుంచి రిజిస్టర్ చేయించారని రిపోర్టులో ఉంది. ఈ రెండు డొమైన్లే రవిని పట్టించాయి.
నేరాన్ని అంగీకరించిన రవి
రిమాండ్ రిపోర్టులో రవి తానే సినిమాలను పైరసీ చేసినట్లు అంగీకరించాడని, ఏ విధంగా సైట్లు నడిపాడో వివరంగా పేర్కొన్నారు. పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీల ఆధారంగా సైబర్‌క్రైమ్ పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించారు. అంతేకాకుండా, రవి బెదిరింపులకు పాల్పడ్డ స్టేట్మెంట్లు, విదేశీ పౌరసత్వం తీసుకున్న వివరాలు కూడా రిపోర్టులో ఉన్నాయి.
పోలీసుల హెచ్చరిక
‘దేశ డిజిటల్ భద్రతకు ఇమ్మడి రవి లాంటి వ్యక్తులు హానికరం’ అని పోలీసులు వ్యాఖ్యానించారు. అతన్ని అరెస్ట్ చేయకపోతే, ఇలాంటి వెబ్‌సైట్లు మళ్లీ మళ్లీ సృష్టించే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు.


