
ఘటనా స్థలంలో దర్యాప్తు అధికారులు
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లో మెడికల్ కాలేజీ స్టూడెంట్‌పై జరిగిన సామూహిక ఘటన దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. అయితే ఈ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాధితురాలు ఆనాడు ఏం జరిగిందో చెప్పిన విషయాలు ఓ జాతీయ మీడియా కథనం ద్వారా బయటకు వచ్చింది.
వాళ్లు తమ వాహనాల నుంచి దిగి మా వైపు నడుచుకుంటూ వచ్చారు. అది గమనించి మేం అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాం. వాళ్లలో ముగ్గురు నన్ను పట్టకుని దగ్గర్లోని అడవిలోకి లాక్కెళ్లారు. నా ఫ్రెండ్‌కు కాల్ చేయమని నాపై ఒత్తిడి చేశారు. అయితే అవతలి నుంచి స్పందన లేకపోవడంతో.. నన్ను అక్కడి నుంచి ఈడ్చుకెళ్లారు.
గట్టిగా అరిచేందుకు ప్రయత్నిస్తే.. అరిస్తే మరికొంత మందిని పిలిపిస్తామని బెదిరించి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డారు అని స్టేట్‌మెంట్‌లో బాధితురాలు పేర్కొంది. మరోవైపు ఒడిశా నుంచి వచ్చిన హక్కుల కమిషన్ బాధితురాలిని పరామర్శించి.. ఘటనపై నివేదికను సిద్ధం చేస్తోంది.
ఒడిశా జలేశ్వర్‌కు చెందిన యువతి.. పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతోంది. గత శుక్రవారం డిన్నర్ కోసం ఫ్రెండ్‌తో ఆమె బయటకు వెళ్లింది. ఆ సమయంలో.. సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో గ్యాంగ్‌రేప్‌కు గురైంది. ఈ కేసుకు సంబంధించిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు వాళ్లకు 10 రోజుల రిమాండ్ విధించింది.
మరోవైపు అర్దరాత్రి పూట ఆమె బయటకు వెళ్లాల్సిన అవసరం ఏంటని సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి. అయితే పోలీసుల నివేదిక ప్రకారం.. అత్యాచారం రాత్రి 9గం. ప్రాంతంలోనే జరిగింది.