ముక్కు కొరికేశాడు | Kanpur Man Bites Off Society Secretary Nose Over Parking Dispute, More Details Inside | Sakshi
Sakshi News home page

ముక్కు కొరికేశాడు

May 29 2025 2:32 AM | Updated on May 29 2025 1:34 PM

Kanpur man bites off society secretary nose over parking dispute

పార్కింగ్‌ వివాదంలో సొసైటీ సెక్రటరీపై దాడిచేసిన అపార్ట్‌మెంట్‌వాసి

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘటన

కాన్పూర్‌: అపార్ట్‌మెంట్‌లో తనకు కేటాయించిన పార్కింగ్‌ స్థలంలో వేరెవరిదో కారు నిలిపి ఉండటం చూసి పట్టరాని కోపంతో ఓ వ్యక్తి ఆ అపార్ట్‌మెంట్‌ సొసైటీ సెక్రటరీ ముక్కును రక్తమోడేలా కొరికేశాడు. ఈ అనూహ్యపరిణామం ఆదివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ నగరంలో జరిగింది. 

బాధితుడు రూపేంద్ర సింగ్‌ యాదవ్‌ కుమారుడు ప్రశాంత్, కుమార్తె ప్రియాంక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కాన్పూర్‌ శివారు నారామవూ ప్రాంతంలోని రతన్‌ ప్లానెట్‌ అపార్ట్‌మెంట్‌లో క్షితిజ్‌ మిశ్రా ఉంటున్నారు. ఆయనకు కేటాయించిన పార్కింగ్‌ స్థలంలో ఆదివారం గుర్తు తెలియని కారు ఉండటంతో మిశ్రా వెంటనే సొసైటీకి ఫిర్యాదుచేశాడు. సొసైటీ సెక్రటరీగా పనిచేస్తున్న రిటైర్డ్‌ ఇంజనీర్‌ యాదవ్‌ అదేరోజు సాయంత్రం మిశ్రా దగ్గరకు వచ్చాడు. 

వాచ్‌మెన్, సెక్యూరిటీ గార్డులకు చెప్పానని, కారు ఎవరిదో ఆరాతీసి వెంటనే మీ స్థలం నుంచి తీయిస్తానని మిశ్రాకు నచ్చజెప్పారు. అయినాసరే ఏమాత్రం వినిపించుకోని మిశ్రా కోపంతో యాదవ్‌పై పలుమార్లు చేయిచేసుకున్నారు. తర్వాత యాదవ్‌ మెడను గట్టిగా పట్టుకుని ముక్కు కొరికేశాడు. దీంతో రక్తం ధారలా కారింది. రక్తమోడుతున్న యాదవ్‌ను ఆయన కుటుంబసభ్యులు దగ్గర్లోని రీజెన్సీ ఆస్పత్రికి తరలించారు. 

శస్త్రచికిత్స అవసరమని వెంటనే ఢిల్లీకి తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో ఆగమేఘాల మీద ఆయనను ఢిల్లీకి తరలించారు. ‘‘ ప్రస్తుతం యాదవ్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తే మిశ్రాపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదుచేస్తాం’’ అని కళ్యాణ్‌పూర్‌ ఏసీపీ అభిషేక్‌ పాండే చెప్పారు. ‘‘ రక్తమొచ్చేలా కొరికిన కోపిష్టిని పోలీసులు కొద్దిసేపు అదుపులోకి తీసుకుని వదిలేశారు’’ అని బాధితుడి కుమార్తె ప్రియాంక ఆగ్రహం వ్యక్తంచేశారు. ముందుగా ఎలాంటి ఫిర్యాదు అందని కారణంగానే మిశ్రాను విడిచిపెట్టామని, ఇకపై ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం నడుచుకుంటామని ఏసీపీ చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement