నేటి ఆధునిక ప్రపంచంలో తమ పిల్లలకు విదేశాలలో అత్యున్నత విద్యను అందించాలని తల్లిదండ్రులు కలలు కంటున్నారు. అయితే, సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం, తొందరపాటు నిర్ణయాల వల్ల చాలా కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. విదేశీ విద్య కోసం భారీగా ఖర్చు చేసే క్రమంలో తల్లిదండ్రులు సాధారణంగా చేసే ఐదు ప్రధాన ఆర్థిక తప్పిదాలను, వాటిని ఎలా అధిగమించాలో విశ్లేషించే ప్రత్యేక కథనం ఇది.
ట్యూషన్ ఫీజును మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం
చాలా మంది తల్లిదండ్రులు కేవలం యూనివర్సిటీ ట్యూషన్ ఫీజును మాత్రమే ప్రధాన వ్యయంగా భావిస్తారు. కానీ నివాస వసతి, హెల్త్ ఇన్సూరెన్స్, వీసా ఛార్జీలు, ప్రయాణ ఖర్చులు, రోజువారీ జీవన వ్యయాలను అంచనా వేయడంలో విఫలమవుతుంటారు. విదేశీ మారకద్రవ్య రేట్ల హెచ్చుతగ్గుల వల్ల కూడా ఖర్చులు పెరుగుతాయి. అందుకే మొత్తం బడ్జెట్‌పై కనీసం 10 నుంచి 15 శాతం బఫర్ అమౌంట్‌ను ముందే సిద్ధం చేసుకోవడం సురక్షితం.
రిటైర్మెంట్ ఫండ్స్ దారి మళ్లించడం
పిల్లల విదేశీ చదువుల కోసం దశాబ్దాలుగా కూడబెట్టిన తమ రిటైర్మెంట్ నిధిని లేదా పీఎఫ్ సొమ్మును పూర్తిగా ఖర్చు చేయడం అతిపెద్ద తప్పు. ఇది మీ వృద్ధాప్య భద్రతను ప్రమాదంలో పడేస్తుంది. దీనికి బదులుగా విద్యా రుణాలు తీసుకోవడం ఉత్తమమైన మార్గం. చదువు పూర్తయ్యాక పిల్లలే ఆ లోన్ చెల్లించేలా బాధ్యత అప్పగించవచ్చు.
వడ్డీ రేట్లను మాత్రమే చూసి లోన్ ఎంచుకోవడం
ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేటప్పుడు కేవలం ప్రకటిత వడ్డీ రేటు (Headline Interest Rate) మాత్రమే చూసి మోసపోకూడదు. లోన్ ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీ-పేమెంట్ పెనాల్టీలు, మొరటోరియం కాల పరిమితి వంటి నిబంధనలను పరిశీలించాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులు సాధారణంగా స్థిరమైన తక్కువ ఫీజులు వసూలు చేస్తే ప్రైవేట్ లెండర్లు 0.8-1% వరకు ప్రాసెసింగ్ ఫీజులు వేస్తుంటారు.
ఎల్‌ఆర్‌ఎస్, టీసీఎస్ నిబంధనలపై అవగాహన లోపం
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) నిబంధనల ప్రకారం.. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 2.5 లక్షల యూఎస్ డాలర్ల వరకు విదేశాలకు పంపవచ్చు. అయితే సొంత నిధుల నుంచి రూ.7 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని పంపితే 5 శాతం టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) వర్తిస్తుంది. అదే ఎడ్యుకేషన్ లోన్ ద్వారా పంపితే ఈ పన్ను రేటు 0.5 శాతానికి తగ్గుతుంది. ఈ పన్ను వెసులుబాటును గమనించకపోతే భారీగా నష్టపోవాల్సి వస్తుంది.
కెరీర్ అవకాశాలను నిర్లక్ష్యం చేయడం
కోర్సు ఎంపికలో మార్కెట్ డిమాండ్, సదరు యూనివర్సిటీకి గల అంతర్జాతీయ గుర్తింపును పరిశీలించాలి. చదువు పూర్తయిన వెంటనే అక్కడ ఉద్యోగ అవకాశాలు లేకపోతే తీసుకున్న భారీ అప్పును తీర్చడం పిల్లలకు, తల్లిదండ్రులకు పెను భారంగా మారుతుంది.
ఇదీ చదవండి: హోమ్ లోన్ కడుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారా?


