కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో పట్టపగలే వృద్ధుడి దారుణ హత్య
టీ తాగి వెళ్తుండగా వెంబడించి గొడ్డలితో నరికి చంపిన తాగుబోతు
రెబ్బెన: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో శుక్రవారం పట్టపగలే దారుణం జరిగింది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఓ వృద్ధుడిని వెంట తెచ్చుకున్న గొడ్డలితో తలనరికి చంపాడు. అనంతరం హాహాకారాలు చేస్తూ అందరూ చూస్తుండగానే పారిపోయాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వకపోవడమే హత్యకు కారణమై ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.
కుమార్తెను రైలెక్కిద్దామని వచ్చి..
ఆసిఫాబాద్ మండలం పర్సనంబాలకు చెందిన మాసండి సోమయ్య (65) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఆయనకు భార్య కరుణబాయి, కుమార్తెలు లక్ష్మి, సుజాత, కుమారుడు భిక్కాజీ ఉన్నారు. పెద్ద కుమార్తె లక్ష్మి గురువారం హైదరాబాద్ నుంచి మండలంలోని నంబాలలో ఉన్న తన చెల్లెలు సుజాత ఇంటికి రావడంతో ఆమెను చూసేందుకు భార్యతో కలిసి సోమయ్య నంబాలకు వచ్చాడు. శుక్రవారం లక్ష్మి తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరుతుండటంతో రెబ్బెనలోని ఆసిఫాబాద్ రోడ్డు రైల్వేస్టేషన్ రైలెక్కించేందుకు భార్య, చిన్న కూతురుతో కలిసి సోమయ్య వచ్చారు.
రైలు వచ్చేలోగా టీ తాగేందుకు బస్టాండ్ వైపు వెళ్లిన సోమయ్య.. తిరిగి వస్తుండగా ఓ మందుబాబు సోమయ్యను వెంబడించాడు. దీంతో రోడ్డు పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి సోమయ్య వెళ్లడంతో ఒక్కసారిగా గొడ్డలితో మెడపై దాడి చేయగా తల, మొండెం వేరై సోమయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ తర్వాత నగేశ్ బయటకు వచ్చి చంపేశానని అరుస్తూ అందరూ చూస్తుండగానే పక్కనే ఉన్న నీటి మడుగులో గొడ్డలిని కడిగి రైల్వే కాలనీ గుండా పారిపోయాడు. అప్పటివరకు తమతో ఉన్న కుటుంబ పెద్ద నిమిషాల వ్యవధిలో హత్యకు గురి కావడంతో భార్య, కుమార్తెలు గుండెలవిసేలా రోదించారు.
డీఎస్పీ అశోక్, రెబ్బెన సీఐ సంజయ్, ఎస్సై వెంకటకృష్ణ ఘటనాస్థలిని పరిశీలించి ప్రత్యక్ష సాక్షుల ద్వారా వివరాలు సేకరించారు. నిందితుడిని తుంగెడ గ్రామ పంచాయతీ పరిధి కొత్తగూడకు చెందిన నగేశ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. తాగేందుకు డబ్బు ఇవ్వకపోవడంతోనే నగేశ్ తాగిన మైకంలో హత్య చేసి ఉంటాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాగుడుకు బానిసైన నగేశ్ రెండ్రోజులుగా రెబ్బెనలోనే తిరుగుతున్నట్లు ప్రత్యక్షంగా చూసిన వారు తెలిపారు.


