నేడు పాఠశాలల్లో పోషకులు, ఉపాధ్యాయుల సమావేశాలు
పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు
విద్యార్థుల ప్రగతిపై విశ్లేషణలు
తప్పనిసరిగా హాజరు కావాలని సూచన
మా పిల్లలను ప్రతిరోజూ బడికి పంపుతాను.
మా పిల్లలు పాఠశాలలకు రాలేకపోతే ఉపాధ్యాయులకు ముందుగానే తెలియజేస్తాను.
నేను ప్రతిరోజూ పిల్లవాడిని ఇంటి వద్ద చదివిస్తాను.
ఈ సంవత్సరం ప్రతి పీటీఎంకు హాజరై నా పిల్లల చదువు, ప్రవర్తనపై చర్చిస్తాను.
నేను నెలకోసారి పాఠశాలకు వెళ్లి నా పిల్లల ప్రగతిపై టీచర్లతో వ్యక్తిగతంగా చర్చిస్తాను.
కెరమెరి: విద్యార్థుల ప్రగతిలో ఉపాధ్యాయుల పాత్రతోపాటు తల్లిదండ్రులు కీలకం.. పాఠశాలలో పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాలు తెలుసుకోవడంతోపాటు ఇంటి వద్ద వారి చదువుకు ఆటంకం క లకుండా ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ ప్రతినెలా మూడో శనివారం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్(పీటీఎం) నిర్వహిస్తోంది. ఇది కొ న్నేళ్లుగా సత్ఫలితాలను ఇస్తోంది. అయితే ప్రతినెలా కేవలం మొక్కుబడిగా కాకుండా వందశాతం ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని విద్యాశాఖ డైరెక్టర్ ఇటీవల ఆదేశాలు జారీ చేయడంతో సమావేశాలకు మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. శనివారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే పీటీఎం సమావేశాలకు తల్లిదండ్రులు నిర్ణీత సమయానికి హాజరయ్యేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నారు. ఉదయం 10గంటలకు పీటీఎం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో ‘తల్లిదండ్రుల వాగ్దానం’ అనే అంశాన్ని ప్రధాన ఎజెండాగా చర్చించనున్నారు.
చదివించాలి.. రాయించాలి
జిల్లాలో 720 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 34,265 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పోషకులు, ఉపాధ్యాయుల సమావేశాల్లో తల్లిదండ్రుల ఎదుట విద్యార్థులతో చదివించడం, రాయించడం, లెక్కలు చేయించాలి. తద్వారా వారి అభ్యస న స్థాయిని, సామర్థ్యాలను, సృజనాత్మకతను ప్రదర్శించి సర్కారు బడులపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెంపొందుతుంది. దీనిని కచ్చితంగా అమలు చేయాలని ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గతంలో మొక్కుబడిగా సాగిన ఈ కార్యక్రమాలను ఈ ఏడాది నుంచి అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రధానోపాధ్యాయులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఎలా నిర్వహించాలంటే..
ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుండగా, తల్లిదండ్రులను సాదరంగా ఆహ్వానించి తరగతి గదిలో కూర్చోబెట్టాలి. హాజరు రిజిస్టర్‌లో సంతకాలు చేయించాలి. ‘మీ పిల్లవాడు ఇటీవల చేసిన ఏదైనా పనితో మీకు ఆనందం కలిగిందా?’అని వారితో 15 నిమిషాలు మాట్లాడించాలి. అనంతరం 20 నిమిషాల పాటు విద్యార్థుల నమోదుపై చర్చించాలి. తల్లిదండ్రుల ఎదుట విద్యార్థులు తరగతి గదిలో ఏర్పాటు చేసిన అంశాలను ప్రదర్శించాలి. విద్యార్థి తన పాఠ్యపుస్తకం నుంచి ఒక భాగాన్ని బిగ్గరగా చదవాలి. బోర్డుపై ఒక గణిత సమస్యను పరిష్కరించి చూపించాలి. విద్యార్థులు తాము స్వయంగా చేసిన చిత్రాలు, హస్తకళలు, సైన్స్ నమూనాలను ప్రదర్శించాలి. పాఠశాల గురించి ఆంగ్లంలో మాట్లాడించాలి. తర్వాత ఒక 20 నిమిషాల పాటు సమయానికి రావడంతో కలిగే ఉపయోగాలను వివరించాలి. పిల్లల అభ్యసనంలో ఉపాధ్యాయులు బాధ్యత వహిస్తారని, అలాగే తల్లిదండ్రుల భాగస్వామ్యం కూడా అవసరమని వివరించాలి.
గోయగాం ప్రాథమిక పాఠశాలలో పోషకులు, ఉపాధ్యాయుల సమావేశం(ఫైల్)
తల్లిదండ్రులతో వాగ్దానాలు
సమావేశాల్లో భాగంగా తల్లిదండ్రులతో ఆరు వాగ్దానాలలో ఒక దానిని ఎంచుకుని రిజిస్టర్‌లో సంతకం చేయించాలి.
అనంతరం ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో 3 నుంచి 5 నిమిషాలు విడివిడిగా మాట్లాడా లి. వారి పిల్లల పేర్లను ప్రస్తావిస్తూ, తరగతి గదిలో వారు చూపించిన ఒక బలం లేదా సా నుకూల ప్రవర్తన గురించి అభినందించాలి. పిల్లల అభివృద్ధి కోసం ఏదైనా ఒక ముఖ్యమై న అంశాన్ని పేర్కొంటూ దానిని ఇంట్లో కూడా అమలు చేయాలని సూచించాలి.
పకడ్బందీగా నిర్వహించాలి
ప్రతినెలా మూడో శనివారం పీటీఎం సమావేశాలు బాధ్యతగా, పకడ్బందీగా నిర్వహించాలి. ప్రతీ పాఠశాలలో తల్లిదండ్రులు వందశాతం హాజరయ్యేలా చూడాలి. రాష్ట్ర విద్యాశాఖ తెలిపిన నిబంధనలను తప్పకుండా పాటించాలి. నేడు తల్లిదండ్రులతో తప్పనిసరిగా వాగ్దానం చేయించాలి. విద్యార్థుల ప్రగతిని స్వయంగా తెలుసుకుంటే కన్నవారిలో మరింత ఉత్సాహం పెరుగుతుంది.
– సచ్చిదానంద చారి, జిల్లా విద్యాధికారి


