ఆసిఫాబాద్: జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల అమలు, అట్రాసి టీ కేసులు, భూ సమస్యలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల పనితీరు, విద్యార్థులకు అంది స్తున్న భోజనం, ఎస్సీ, ఎస్టీ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై కలెక్టర్ హరిత, ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్ డేవిడ్, డీఎఫ్‌వో బాలా మణి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కమిషన్ సభ్యులు రేణుకుంట్ల ప్రవీణ్, రాంబాబు నాయక్, కుసుం నీలాదేవితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1,33,627 మంది ఎస్టీలు, 81,596 మంది ఎస్సీలు ఉన్నారని తెలిపారు. వారందరికీ రా జ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం సంక్షేమ పథకాలు వర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోటు బుక్కులు, ఏకరూప దుస్తులు అందించాలన్నారు. వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేలా నాణ్యమైన విద్యనందించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలు నివసిస్తున్న ప్రాంతాల్లో రహదారి, తాగునీటితోపాటు వసతులు కల్పించాలని, రహదారి నిర్మాణాలకు అటవీశాఖ అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల్లో ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహించాలని, ఉపాధి కల్పనలో ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. ప్రతినెలా 30న నిర్వహించే పౌరహక్కుల దినోత్సవానికి మండలస్థాయి అధికారులు హాజరై చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరుపై శాఖల వారీగా సమీక్షించారు.
సంక్షేమ పథకాల అమలుకు చర్యలు
కలెక్టర్ కె.హరిత మాట్లాడుతూ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమ పథకాల పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వారి ప్రాంతాల్లో ఖర్చు చేస్తామన్నారు. గిరిజనేతరులు సాగు చేసే పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందు కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే కమిషన్ చైర్మన్‌కు పూలమొక్క అందించి స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. సమావేశంలో కాగజ్‌నగర్ ఆర్డీవో కృష్ణయ్య, డీఎస్పీలు అశోక్, వహీదుద్దీన్, జిల్లా అధికారులు, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


