కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో మళ్లీ కూల్చివేతలు మొదలయ్యాయి. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా మున్సిపల్ అధికారులు తెలంగాణ తల్లి చౌరస్తా నుంచి పాత రైల్వే గేటు సమీపం వరకు రోడ్డుకిరువైపులా ఉన్న కట్టడాలను కూల్చివేసేందుకు ఏప్రిల్ 7న పనులు ప్రారంభించారు. దుకాణాల యజమానులు సామగ్రి సర్దుకోవడానికి రెండు నెలల గడువు కోరారు. అధికారులు అందుకు అంగీకరించి పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం గడువు ముగియడంతో మళ్లీ శుక్రవారం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది కూల్చివేతల కోసం మూడు జేసీబీలను రంగంలోకి దించారు. రాజీవ్‌గాంధీ చౌరాస్తా నుంచి ప్రధాన రహదారి వెంబడి ఉన్న దుకాణ సముదాయాలను కూల్చివేయడం ప్రారంభించారు.
ట్రాఫిక్ సమస్య తీరేనా..?
రాజీవ్ గాంధీ చౌరస్తా పట్టణానికి కీలకమైన జంక్ష న్. ఇక్కడి నుంచి నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. రోడ్డు ఇరుకుగా ఉండటంతో తరుచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. రోడ్డు విస్తరణ పూర్తయితే ట్రాఫిక్ సమస్య తీరుతుందని, అభివృద్ధికి ఊతమిస్తుందని వ్యాపారులు, స్థానికులు భావిస్తున్నారు. కూల్చివేతలు పూర్తి చేసి రోడ్డు పనులను వేగవంతం చేయాలని కోరుతున్నారు.


