సాగుకు ముందే ఆన్‌లైన్‌ | - | Sakshi
Sakshi News home page

సాగుకు ముందే ఆన్‌లైన్‌

Jul 18 2026 12:06 AM | Updated on Jul 18 2026 12:06 AM

● కొనుగోలు సమయంలో వరి వంగడం, రైతుల వివరాల నమోదు ● ఈ నెల 16 నుంచి జిల్లాలో మొదలైన ప్రక్రియ ● సన్నవడ్ల బోనస్‌ చెల్లింపులకు కొత్త నిబంధనలు

ఆసిఫాబాద్‌: సన్న రకాల వరిసాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ‘సన్నబియ్యం ప్రోత్సాహక పథకం’అమలు చేస్తోంది. సన్నరకం వరిసాగు చేసే రైతులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున ప్రోత్సాహకం అందిస్తోంది. అంతేకాక సాగు తర్వాత రైతుల వివరాలు సేకరించకుండా విత్తనాలు కొనుగోలు చేసే సమయంలోనే ఆన్‌లైన్‌ అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 16 నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. జిల్లాలోనూ ‘సన్నబియ్యం ప్రోత్సాహక పథకం’ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. జిల్లాలో ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో 47 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రైతుల ఖాతాల్లో రూ. 2.35 కోట్లు జమ కానున్నాయి.

ఆన్‌లైన్‌ ప్రక్రియ ఇలా..

గతంలో ఈ పథకం ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉండడంతో రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పంట కోత తర్వాత రైతులు మీసేవ, వ్యవసాయాధికారి కార్యాలయానికి వెళ్తుండేవారు. ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తేనే లబ్ధి పొందే అవకాశం ఉండేది. తాజా నిబంధనల ప్రకారం రైతు తన పొ లానికి కావాల్సిన సన్నరకం వడ్లు లైసెన్సు ఉన్న ఎరువుల దుకాణంలో కొనుగోలు చేయాలి. ఆర్‌ఎన్‌ఆర్‌– 15048, కేఎన్‌ఎం– 1638, బీపీటీ 5204, హె చ్‌ఎంటీ సోనా, జైశ్రీరాం, డబ్ల్యూజీఎల్‌ 44, కేఎన్‌ఎం 7715 వంగడాలను వాడాలని ప్రభుత్వం రైతులకు సూచించింది. షాపు యజమాని రైతు ఆధార్‌ కార్డు, పట్టా పాస్‌బుక్‌, బ్యాంక్‌ పాస్‌బుక్‌ జిరాక్స్‌ తీసుకుని వెంటనే వివరాలను ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేస్తారు. నమో దు పూర్తయిన వెంటనే రైతులకు రశీదు ఇస్తారు. పంట కోత పూర్తయిన తర్వాత ప్రభుత్వం వెరిఫికేషన్‌ చేసి నేరుగా రైతు ఖాతాలో డీబీటీ ద్వారా ఎకరాకు రూ.500 చొప్పున జమ చేస్తుంది. ఒక్కో రైతుకు క్వింటాల్‌కు రూ.500, గరిష్టంగా ఐదెకరాల వరకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

కొత్త విధానంతో సులువు

గతంలో రైతులకు నగదు జమయ్యేందుకు 3 నుంచి 6 నెలల సమయం పట్టేది. ఫొటోలు, సర్టిఫికెట్లు సక్రమంగా లేకపోతే తిరస్కరించేవారు. సిబ్బంది కొరతతో వెరిఫికేషన్‌కు సైతం చాలా సమయం పట్టేది. కొత్త విధానంతో రైతులకు సులువుగా మారనుంది. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలోనే ఫర్టిలైజర్‌ దుకాణంలో ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తి చేస్తారు. సీజన్‌ పూర్తికాగానే రెండు నెలల లోపు ఖాతాల్లో డబ్బులు జమవుతాయని అధికారులు చెబుతున్నారు.

నీటి వసతి ఉంటేనే వరి సాగు చేయాలి

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. సాధారణ వర్షపాతం కంటే లోటు ఉంటుంది. బోరుబావులు, నీటి వసతి ఉంటేనే వరి సాగు చేయాలి. నీటి వసతి లేని ప్రాంతాల్లో కంది, జొన్న, పెసర వంటి ఆరుతడి పంటలు పండించాలి. – మిలింద్‌, ఏడీఏ, ఆసిఫాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement