టోక్యో: జపాన్‌లో ఉద్యోగం చేస్తున్న ఒక భారతీయుడు అక్కడి పని సంస్కృతిని వివరిస్తూ చేసిన వ్యంగ్య వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అజయ్ పాండే అనే వ్యక్తి గత 11 ఏళ్లుగా జపాన్‌లో పనిచేస్తున్నారు. అక్కడి అద్భుతమైన పని వాతావరణాన్ని, సౌకర్యాలను ‘సమస్యలు’గా పేర్కొంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
హైబ్రిడ్ వర్క్ విధానం గురించి మాట్లాడుతూ, ‘వారానికి మూడు రోజులు మాత్రమే కార్యాలయానికి వెళ్లాల్సి ఉండటం, మిగిలిన రెండు రోజులు ఇంటి నుంచే పనిచేయడం చాలా కష్టంగా ఉంది’ అని ఆయన ఎద్దేవా చేశారు. వారాంతాల్లో మేనేజర్ నుంచి ఫోన్ కాల్స్ రాకపోవడాన్ని తప్పుబడుతూ, తనను ఎవరూ గుర్తుంచుకోవడం లేదని, వారాంతాలను క్యాంపింగ్, బైక్ రైడింగ్‌లతో వృథా చేసుకోవాల్సి వస్తోందని ఆయన వ్యంగ్యంగా చెప్పారు.
అంతేకాకుండా, ఓవర్ టైం (అదనపు పని) చేసిన ప్రతి 15 నిమిషాలకు కంపెనీ డబ్బులు చెల్లిస్తుందని, దీనివల్ల తనకు ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. దీపావళికి లడ్డూలు, పెన్నులు ఇచ్చే బదులు, జీతంలో రెండు, మూడు నెలల అదనపు మొత్తాన్ని బోనస్‌గా ఇవ్వడం వల్ల తాను విసిగిపోయానని ఆయన నవ్వుతూ చెప్పారు. జపాన్ పని పరిస్థితులపై ఆయన చేసిన ఈ సరదా వ్యాఖ్యలకు నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. చాలా మంది ఇది ‘విజయం వల్ల కలిగే బాధ’ అని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ప్రధాని ఇందిర దిగివచ్చేలా.. వాంగ్‌చుక్ తండ్రి పోరాటం!


