లేబర్ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక
వచ్చే వారం బాధ్యతలు చేపట్టే అవకాశం
లండన్: యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ వారసుడిగా ముందుగా ఊహించినట్టే ఆండీ బర్న్‌హమ్(56) ఖరారయ్యారు. అధికార లేబర్ పార్టీ నేతగా బర్న్‌హమ్ ఎన్నికయ్యారు. వచ్చే వారం ప్రధాని అధికార నివాసం లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్మర్ అధికారికంగా కింగ్ చార్లెస్‌కు రాజీనామా సమర్పించిన అనంతరం సోమవారం నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఆండీ బర్న్‌హమ్‌ను ఆహ్వానించే అవకాశముంది. బర్న్‌హమ్ ఇటీవలే ఉత్తర ఇంగ్లండ్‌లోని మేకర్‌ఫీల్డ్ ఎంపీగా ఎన్నికయ్యారు.
కీర్ స్టార్మర్‌కు ప్రధాన పోటీ దారుగా నిలిచారు. బర్న్‌హమ్..యూకేకు పదేళ్ల కాలంలో ఏడో ప్రధాని కానున్నారు. గత నెలలో కీర్ స్టార్మర్ రాజీనామా చేసిన అనంతరం లేబర్ పార్టీ అధ్యక్ష రేసులో బర్న్‌హమ్ మాత్రమే నిలిచారు. శుక్రవారం లండన్‌లో రక్షణ మంత్రి షబానా మహ్మూద్ అధ్యక్షతన లేబర్ పార్టీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీలో ఆండీ బర్న్‌హమ్‌ను నూతన నేతగా ఎన్నుకున్నట్లు షబానా ప్రకటించారు. ఈ పదవికి ఆయనొక్కరే నామినేషన్ వేశారన్నారు. అనంతరం బర్న్‌హమ్ మాట్లాడుతూ..‘ప్రజల ఆశలను తిరిగి నిలబెట్టబోతున్నాం’అంటూ ప్రకటించారు.
‘2024 జూలైలో జరిగిన ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేసేందుకు లేబర్ పార్టీకి ఉన్న చిట్టచివరి అవకాశం ఇదే. కీర్ స్టార్మర్ నిర్మించిన పునాదులపై నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నా. బాధ్యతల నుంచి తప్పుకోనున్న కీర్ స్టార్మర్‌కు ధన్యవాదాలు’అని ఆయన తెలిపారు. బర్న్‌హమ్ పుట్టింది లివర్‌పూల్‌లోనే అయినా మాంచెస్టర్‌లోనే ఆయన రాజకీయంగా ఎదిగారు. ఈయన తండ్రి టెలికం ఇంజినీర్ కాగా, తల్లి రిసెప్షనిస్ట్‌గా పనిచేశారు. ఈ కుటుంబంలో యూనివర్సిటీ వరకు మొదటగా వెళ్లింది బర్న్‌హమ్, ఆయన సోదరులే.
అందునా, బర్న్‌హమ్ ప్రఖ్యాత కేంబ్రిడ్జిలో చదువుకున్నారు. డిగ్రీ చదువుతుండగానే నెదర్లాండ్‌కు చెందిన సహ విద్యారి్థని మేరీ ఫ్రాన్స్ వాన్ హీల్‌తో పరిచయమేర్పడింది. వీరు 2000వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఈయన లేబర్ పార్టీ నేతలకు సలహాదారుగా వ్యవహరించారు. 2001లో మాంచెస్టర్ ప్రాంతంలోని లీ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.
లేబర్ పార్టీ ప్రధానులు, టోనీ బ్లయిర్, గోర్డన్ బ్రౌన్ల సహకారంతో పైకెదిగారు. బ్రౌన్ కేబినెట్‌లో 2007–2010 మధ్యన వివిధ శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 2017లో పార్లమెంట్‌కు రాజీనామా చేసి, గ్రేటర్ మాంచెస్టర్ మేయర్‌గా పోటీ చేసి గెలిచారు. మాంచెస్టర్‌లో రవాణా, గృహ నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు ఎంతగానో పాటు పడిన ఆయన ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. కోవిడ్ సమయంలో అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్ అనుసరించిన ‘లండన్ సెంట్రిక్’విధానాలను తీవ్రంగా తప్పుబట్టిన బర్న్‌హమ్ ‘కింగ్ ఆఫ్ నార్త్’గా పేరు తెచ్చుకున్నారు.


