కీర్ స్టార్మర్
రాజకీయ అస్థిరత కారణంగా నేతలు పదవులు కోల్పోవడం, ప్రభుత్వాలు పడిపోవడం ప్రజా స్వామ్య వ్యవస్థలో సహజమైన పరిణామం. అయితే దేశంలో ఏర్ప డిన ఆర్థిక అస్థిరత కారణంగా ప్రజా దరణ కలిగిన నాయకులు ప్రధాని పదవి నుండి వైదొలగడం బ్రిటన్‌లో తరచుగా చోటు చేసుకుంటున్న పరిణామం కావడం గమనార్హం.
తాజాగా ప్రధాని కీర్ స్టార్మర్ రెండేళ్ళ పదవీకాలం ముగి యకుండానే పదవి నుంచి తప్పుకొన్నారు. సొంత లేబర్ పార్టీ ఎంపీల విశ్వాసం కోల్పోవడంతో స్టార్మర్‌కు రాజీనామా చేయడం మినహా గత్యంతరం లేకపోయింది. దీంతో గత ఏడేళ్ళలో ఆరవ ప్రధాని రాబోతున్నారు. బ్రిటన్‌లో నాయ కత్వ మార్పు తరచుగా ఎందుకు జరుగుతోంది? రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచి గత 81 ఏళ్లలో 65 ఏళ్ల పాటు 18 మంది ప్రధాన మంత్రులు అధికారంలో ఉండగా, చివరి 16 ఏళ్లలో ఏడుగురు ప్రధాన మంత్రులు మారడం విశేషం. ఇందులో భారత సంతతికి చెందిన రుషి సునాక్ ఎన్నికలలో ఓడిపోగా, బ్రెక్సిట్ ప్రజాభిప్రాయ సేక రణలో ఓటమి కారణంగా డేవిడ్ కామెరూన్ వైదొలిగారు.
గెలిచినా ఓడిపోయి...
ప్రధాని పదవి నుంచి తప్పుకున్న కీర్ స్టార్మర్ రెండేళ్ళ క్రితమే చరిత్రాత్మక మెజారిటీతో ఎన్నికయ్యారు. అంతర్జా తీయ సమాజంలో ఆయనకు మంచి గౌరవం ఉంది. అయితే మే నెలలో జరిగిన స్థానిక ఎన్నికలలో లేబర్ పార్టీకి ఘోర మైన ఫలితాలు వచ్చాయి. ప్రతిష్ఠాత్మకమైన స్థానిక ఎన్నిక లలో సొంత పార్టీని విజయ తీరాలకు చేర్చలేకపోవడం అనే వైఫల్యం కంటే... కొన్ని పాలనా విధానాల వైఫల్యాల కారణంగానే పదవినుండి తప్పుకోవాలని స్టార్మర్‌పై సొంత పార్టీ ఎంపీల నుండి తీవ్ర ఒత్తిడి వచ్చిందనుకోవాలి.
దశాబ్ద కాలంగా బ్రిటన్‌లో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు అనూహ్యంగా పెరిగి పోతున్నాయి. అందుకు అనుగుణంగా ప్రజల ఆదాయం పెర గడం లేదు. జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు ఒక శాతం మించడం లేదు. బ్రిటన్ ప్రభుత్వ ఋణ భారం జీడీపీలో 95 శాతం దాటింది. అప్పులు దాదాపు 2.8 లక్షల కోట్ల పౌండ్లకు చేరింది. దీనితో ప్రభుత్వానికి వచ్చే రాబడిలో అభివృద్ధి పనులకు ఖర్చు చేయడం కష్టమౌతోంది.
ఈ రెండేళ్ళ స్వల్ప కాలంలో స్టార్మర్ పలు విజయాలు నమోదు చేసిన మాట నిజం. ప్రభుత్వ దుబారాను తగ్గించారు. ప్రభుత్వ రంగంలోని కార్మికులు, ఉద్యోగులు సమ్మెలకు దిగి ఉత్పత్తిని దెబ్బతీయకుండా, వారి డిమాండ్లలో కొన్నింటిని నెరవేరుస్తూ, దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటించి, ఆ దేశం నుంచి విలువైన ఖనిజాల దిగుమతికి మార్గం సుగమం చేశారు. భారత్‌కు స్నేహ హస్తం చాచి ఇరుదేశాల నడుమ చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) అమలు కోసం కృషి చేశారు.
ఎన్ని సుగుణాలున్నా... రాజకీయాలలో బంధుప్రీతికి, ఆశ్రిత పక్షపాతానికి తావు ఉండరాదు. కానీ స్టార్మర్ తన స్నేహితుడైన పీడర్ మాండెల్సన్‌ను యూఎస్ రాయబారిగా నియమించడం సొంత పార్టీ నేతలకు కంటగింపుగా మారింది. అదే సమయంలో దేశ ఆర్థికాభివృద్ధి పడిపోవడం, మౌలిక సదుపాయాల విస్తరణ మందగించడం, గృహ నిర్మాణం చతికిల పడటం స్టార్మర్ మెడకు చుట్టుకున్నాయి.
ప్రధాని పదవికి స్టార్మర్ రాజీనామా తర్వాత ఆ పదవిని చేపట్టే గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ ఆండీ బర్న్‌హామ్ నేతృత్వంలో బ్రిటన్ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే... బ్రిటన్‌లో రెండు ప్రధాన రాజకీయ పార్టీలలో నాయకుల కంటే పార్టీయే సుప్రీమ్ అనే పంథా కొనసాగడమే ఇక్కడ చర్చనీయాంశం. రాజకీయ నాయకులు తమపై విమర్శలు వచ్చినపుడు హుందాగా ఆ పదవుల నుండి దిగిపోవడం ముదావహం. వారు మెజారిటీ ప్రజల మనోభీష్టాన్నీ, దేశ ప్రయోజనాలనూ దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం గొప్ప విషయం. - డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి


