ఇరాన్‌పై నిప్పుల వర్షం | USA and Iran trade strikes as traffic through the Strait of Hormuz | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై నిప్పుల వర్షం

Jul 18 2026 5:32 AM | Updated on Jul 18 2026 5:32 AM

 USA and Iran trade strikes as traffic through the Strait of Hormuz

కీలక వంతెనలు, విద్యుత్‌ వ్యవస్థలపై అమెరికా భీకర దాడులు  

చాబహార్‌ ఓడరేవు వద్ద నిఘా టవర్‌ కూల్చివేత  

ప్రతీకార చర్యలకు దిగిన ఇరాన్‌... గల్ఫ్‌ దేశాలపై వైమానిక దాడులు  

అమెరికా యుద్ధ విమానాలను నేలమట్టం చేశామన్న ఐఆర్‌జీసీ

దుబాయ్‌: పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్‌ మధ్య దాడులు నానాటికీ తీవ్రతరం అవుతున్నాయి. తాత్కాలిక శాంతి ఒప్పందం అకస్మాత్తుగా ముగిసిన తర్వాత రెండు దేశాలు పరస్పరం కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ప్రధానంగా హార్మూజ్‌ జలసంధిపై ఆధిపత్యం కోసం క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగుతున్నాయి. హార్మూజ్‌పై టెహ్రాన్‌ పట్టును సడలించేలా ఒత్తిడి పెంచడానికి బలప్రయోగం తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేశారు. 

ఇందులో భాగంగా గురువారం అర్ధరాత్రి తర్వాత అమెరికా తన వైమానిక దాడుల పరంపరను మరింత ఉధృతంచేసింది. ఇరాన్‌లో కీలక వంతెనలు, విద్యుత్‌ వ్యవస్థలపై దాడి చేయడంతోపాటు గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లో చాబహార్‌ ఓడరేవు వద్ద ముఖ్యమైన నిఘా టవర్‌ను కూల్చివేసింది. ఇరాన్‌ సైతం వెంటనే ప్రతిదాడికి దిగింది. ఖతార్, కువైట్, జోర్డాన్‌పై క్షిపణులు ప్రయోగించింది. 

బహ్రెయిన్, ఒమన్, సిరియాలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. కువైట్‌లో విద్యుత్, నీటి శుద్ధి ప్లాంట్‌ తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెద్ద సంఖ్యలో విద్యుత్‌ ఉత్పాదన యూనిట్లకు నష్టం వాటిల్లిందని కువైట్‌ ఆందోళన వ్యక్తంచేసింది. గల్ఫ్‌లో అమెరికా యుద్ధ విమానాలను ధ్వంసం చేసినట్లు ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌(ఐఆర్‌జీసీ) ప్రకటించింది. 

జోర్డాన్‌లో మోహరించిన అమెరికా యుద్ధ విమానాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి, డ్రోన్‌ దాడులు జరిపినట్లు స్పష్టంచేసింది. ఈ దాడుల్లో పలు అమెరికన్‌ యుద్ధ విమానాలు, గగనతల ఇంధన సరఫరా విమానాలు ధ్వంసం కాగా, మరికొన్ని తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. అయితే, తమ భూభాగం మీదుగా వచ్చిన మూడు క్షిపణులను అడ్డుకొని, కూల్చివేసినట్లు జోర్డాన్‌ సైన్యం తేల్చిచెప్పింది.  

విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి  
ఇరాన్‌లోని దక్షిణ హార్మూజ్‌గాన్‌ ప్రావిన్స్‌లో వంతెనలపై అమెరికా సైన్యం వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో కనీసం ఏడుగురు మరణించినట్లు ఇరాన్‌ ప్రభుత్వ టీవీ వెల్లడించింది. హార్మూజ్‌ జలసంధిలో ఇరాన్‌ తీర నగరమైన బందర్‌ ఖమీర్‌పైనా దాడులు జరిగాయి. ప్రధాన రహదారులు, రైల్వే వంతెనలను కూడా విడిచిపెట్టలేదు.

 ప్రధాన రేవు పట్టణమైన బందర్‌ అబ్బాస్, రాజధాని టెహ్రాన్‌ మధ్య అనుసంధానం లేకుండా చేయడమే అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది. తమ దేశంలో విద్యుత్‌ మౌలిక సదుపాయాలపై దాడులు జరిగినట్లు ఇరాన్‌ అంగీకరించింది. దక్షిణ ప్రావిన్స్‌లలో ప్రజలు విద్యుత్‌ను చాలా పొదుపుగా వాడుకోవాలని ఇరాన్‌ ఇంధన మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. 

టార్గెట్‌ చాబహార్‌ పోర్టు!  
ఇరాన్‌లో పదుల సంఖ్యలో లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు అమెరికా సైనిక దళాల సెంట్రల్‌ కమాండ్‌ ప్రకటించింది. వరుసగా ఆరో రోజు ఇరాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్లు వెల్లడించింది. అమెరికా వైమానిక దాడిలో చాబహార్‌ ఓడరేవు వద్ద ఒక టవర్‌ కూలిపోయినట్లు ఇరాన్‌ ప్రభుత్వ వార్తా సంస్థ తెలియజేసింది. ఓడరేవులోకి వచ్చే నౌకలను ఈ టవర్‌ నుంచే పర్యవేక్షిస్తారు. 

నిఘా టవర్‌ కూలిపోతున్న ఫొటోను అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. భారత ప్రభుత్వ సహకారంతో ఇరాన్‌ నిర్వహిస్తున్న చాబహార్‌ ఓడరేవు అమెరికా దాడులకు పదేపదే లక్ష్యంగా మారుతోంది. ఇక్కడ దాడులు జరిగినట్లు ఇరాన్‌ ప్రభుత్వ మీడియా సైతం ధ్రువీకరించింది. శుక్రవారం ఉదయం 6 గంటల కల్లా అమెరికా దాడుల కారణంగా ఇరాన్‌లో కనీసం 38 మంది మరణించారని, 400 మందికి పైగా గాయపడ్డారని ఆరోగ్య శాఖ ప్రతినిధి హొస్సేన్‌ కెర్మన్‌పూర్‌ వెల్లడించింది.  

కుర్దిష్‌ రెబెల్‌ గ్రూప్‌పై ఇరాన్‌ దాడులు  
ఇరాన్‌ దాడుల నేపథ్యంలో గల్ఫ్‌ దేశాల్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలంటూ ఖతార్‌ ప్రభుత్వం తమ పౌరులను రెండుసార్లు హెచ్చరించింది. ఇరాన్‌ క్షిపణులను అడ్డుకోవడానికి గగనతల రక్షణ వ్యవస్థలను సన్నద్ధం చేశారు. అమెరికా, ఇరాన్‌ మధ్య చర్చలకు ఖతార్‌ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

ఇరాన్‌ ప్రయోగించిన మూడు క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నట్లు జోర్డాన్‌ సైన్యం ప్రకటించింది. మరోవైపు ఉత్తర ఇరాన్‌లోని కుర్దిష్‌ రెబెల్‌ గ్రూప్‌ ‘కొమాలా’పై దాడులు జరిగాయి. ఈ ఘటనలో కనీసం తొమ్మిది మంది మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఇరాన్‌ సైన్యమే ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. హార్మూజ్‌ జలసంధి గుండా ప్రయాణిస్తున్న ఒక ట్యాంకర్‌ దాడికి గురైందని బ్రిటిష్‌ సైన్యం 
తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement