జపాన్‌కు దక్షిణాన పసిఫిక్ మహాసముద్రంలోని అగ్నిపర్వత సముద్రగర్భ ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యధిక సాంద్రత కలిగిన "అదృశ్య బంగారం" (Invisible Gold)ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆవిష్కరణ సముద్ర గర్భంలోని ఖనిజ సంపదపై ప్రపంచ దృష్టిని మళ్లీ ఆకర్షిస్తోంది. అయితే ఈ బంగారాన్ని తవ్వడం అంత సులభం కాదని, పర్యావరణ పరిరక్షణ కూడా పెద్ద సవాలేనని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
ఎక్కడ లభించింది?
ఈ బంగారు నిల్వలు టోక్యోకు దక్షిణంగా సుమారు 350–360 కిలోమీటర్ల దూరంలో జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలిలోని ‘హిగాషి-అయోగాషిమా నోల్ కాల్డెరా (Higashi-Aogashima Knoll Caldera)’ హైడ్రోథర్మల్ ఫీల్డ్‌లో గుర్తించారు. ఇది సముద్ర అడుగున ఉన్న క్రియాశీల అగ్నిపర్వత ప్రాంతం. ఇక్కడ 'బ్లాక్ స్మోకర్స్'గా పిలిచే హైడ్రోథర్మల్ వెంట్ల నుంచి అత్యంత వేడిగా ఉండే, ఖనిజాలతో నిండిన ద్రవాలు వెలువడుతుంటాయి. చల్లటి సముద్రజలాన్ని తాకగానే అవి ఘనీభవించి సల్ఫైడ్ నిక్షేపాలు, చిమ్నీ ఆకారపు నిర్మాణాలను ఏర్పరుస్తాయి. ఈ ప్రక్రియలో రాగి, జింక్, వెండి, బంగారం వంటి లోహాలు సహజంగానే కేంద్రీకృతమవుతాయి.
కనిపించని బంగారాన్ని ఎలా గుర్తించారు?
ఇప్పటి వరకు బంగారం సాధారణంగా చిన్న కణాలు లేదా రేణువుల రూపంలో ఉంటుందని భావించేవారు. కానీ ఈసారి శాస్త్రవేత్తలు ‘సెకండరీ అయాన్ మాస్ స్పెక్ట్రోమెట్రీ ’(SIMS) అనే అత్యాధునిక సాంకేతికతతో పరిశీలించగా, బంగారం ఎక్కువ భాగం ‘పైరైట్’ (Pyrite) అనే ఐరన్ సల్ఫైడ్ ఖనిజం స్ఫటిక నిర్మాణంలోనే అణు స్థాయిలో కలిసిపోయి ఉందని గుర్తించారు. అందువల్ల ఇది సాధారణ సూక్ష్మదర్శినితో కూడా కనిపించదు. దీనినే "ఇన్విజిబుల్ గోల్డ్"గా పేర్కొంటారు.
రికార్డు స్థాయి సాంద్రత
సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఈ ప్రాంతంలోని పైరైట్‌లో బంగారం సాంద్రత గరిష్ఠంగా 1.9 శాతం (19,000 పీపీఎంకు పైగా)నమోదైంది. ఇప్పటివరకు ప్రపంచంలోని సముద్రగర్భ హైడ్రోథర్మల్ నిక్షేపాల్లో నమోదైన అత్యధిక స్థాయిల్లో ఇదొకటిగా పరిశోధకులు పేర్కొన్నారు.
తవ్వకాలు సాధ్యమేనా?
ఈ ప్రాంతం లోతు ఇతర సముద్రగర్భ ఖనిజ ప్రాంతాలతో పోలిస్తే తక్కువగా ఉండటం, ఖనిజ నిక్షేపాలు సమృద్ధిగా ఉండటం వల్ల భవిష్యత్తులో వాణిజ్యపరంగా మైనింగ్‌కు అనుకూల ప్రాంతంగా భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం పైరైట్‌లో అణు స్థాయిలో దాగి ఉన్న బంగారాన్ని భారీ స్థాయిలో, ఆర్థికంగా లాభదాయకంగా వెలికితీసే సాంకేతికత ఇంకా అందుబాటులో లేదు. అందువల్ల తక్షణ మైనింగ్ అవకాశాలు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పర్యావరణంపై ఆందోళనలు
హైడ్రోథర్మల్ వెంట్ల చుట్టూ భూమిపై మరెక్కడా కనిపించని ప్రత్యేక సముద్ర జీవవ్యవస్థలు ఉంటాయి. అరుదైన పురుగులు, క్రస్టేషియన్లు, స్పాంజ్‌లు, పగడాలు, చేపలు వంటి జీవులు ఈ తీవ్ర పరిస్థితుల్లోనే జీవిస్తాయి. ఇలాంటి ప్రాంతాల్లో మైనింగ్ ప్రారంభిస్తే ఈ సున్నితమైన జీవవ్యవస్థలు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని సముద్ర శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే వాణిజ్య తవ్వకాల కంటే ముందుగా సమగ్ర పర్యావరణ అధ్యయనాలు, కఠినమైన రక్షణ చర్యలు అవసరమని వారు సూచిస్తున్నారు.


