Photo Credit: The Guardian
అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరుగనున్న ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరుకానున్నారు. ఈ సమాచారాన్ని వైట్‌హౌస్ అధికారికంగా ధృవీకరించింది.
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ట్రంప్ శుక్రవారం న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో ఫిఫా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని, ఆదివారం ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.
ఇప్పటికే ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్‌ఫాంటినో కూడా ఫైనల్ అనంతరం ట్రంప్‌తో కలిసి విజేత జట్టుకు ప్రపంచకప్ ట్రోఫీ అందజేస్తామని ప్రకటించారు.
అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన 102 మ్యాచ్‌లకు ట్రంప్ గానీ, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గానీ హాజరుకాలేదు. అయితే అమెరికా జట్టు ఆడిన కొన్ని మ్యాచ్‌లకు కేబినెట్ సభ్యులు హాజరయ్యారు.
అమెరికా చరిత్రలో అత్యధికంగా వీక్షించబడిన, అత్యంత భద్రతతో నిర్వహించిన, అత్యంత విజయవంతమైన ప్రపంచకప్‌కు ట్రంప్ హాజరుతో ఘన ముగింపు లభిస్తుందని లెవిట్ పేర్కొన్నారు.
ఫైనల్ మ్యాచ్ న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఆదివారం మధ్యరాత్రి (సోమవారం) 12:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్త క్రీడాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఇటీవల అమెరికా ఆటగాడు ఫోలారిన్ బాలోగన్ రెడ్‌కార్డు సస్పెన్షన్ వ్యవహారంలో ట్రంప్ ఫిఫా అధ్యక్షుడు ఇన్‌ఫాంటినోతో మాట్లాడిన విషయం వివాదాస్పదమైంది. ట్రంప్ విజ్ఞప్తి చేసినప్పటికీ నిర్ణయ ప్రక్రియలో తాను జోక్యం చేసుకోలేదని ఇన్‌ఫాంటినో స్పష్టం చేశారు.
అనంతరం బాలోగన్‌పై విధించిన ఒక మ్యాచ్ నిషేధాన్ని ఫిఫా తాత్కాలికంగా ఎత్తివేయడం విమర్శలకు దారితీసింది. అయినప్పటికీ, ప్రీక్వార్టర్‌లో బెల్జియం చేతిలో అమెరికా 1-4 తేడాతో ఓటమి పాలైంది.


