కొన్ని కథలు పాతబడవు. కాలంతో పాటు.. తరాలు మారినా మనసులను తాకుతూనే ఉంటాయి. వేల ఏళ్ల క్రితం పుట్టిన అలాంటి కథల్లో గ్రీకు మహాకావ్యం ‘ది ఒడిస్సీ’ ఒకటి. యుద్ధం, వనవాసం, ప్రమాదకర ప్రయాణం, దేవతల జోక్యం, కుటుంబం కోసం సాగిన ఎదురుచూపు.. ఇలా ఎన్నో అంశాలతో నిండిన ఈ గాథ నేటికీ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఎక్కడో విన్నట్టుగా.. ఎక్కడో చూసినట్టుగా..
ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ‘ది ఒడిస్సీ’ విడుదలతో మరోసారి ఈ పురాతన గాథ చర్చనీయాంశమైంది. అయితే భారతీయ ప్రేక్షకులకు ఈ కథలోని కొన్ని భావోద్వేగాలు పూర్తిగా కొత్తగా అనిపించకపోవచ్చు. ఎక్కడో విన్నట్టుగా.. ఎక్కడో చూసినట్టుగా అనిపించవచ్చు. కారణం.. మనకు సుపరిచితమైన రామాయణం, మహాభారతాల్లో కనిపించే కొన్ని మూల భావనలు ఈ గ్రీకు గాథలోనూ ప్రతిధ్వనించడం.
కొన్ని అనుభూతులు.. ప్రపంచం..
అలాగని ఈ మూడు మహాకావ్యాలు ఒకటే కథ అని చెప్పడం సరైంది కాదు. ఇవి వేర్వేరు నాగరికతలు, సంప్రదాయాలు, ఆలోచనా విధానాల్లో పుట్టినవి. గ్రీకు పురాణ ప్రపంచం నుంచి వచ్చిన ‘ది ఒడిస్సీ’కి, భారతీయ ధార్మిక–సాంస్కృతిక సంప్రదాయాల్లో భాగమైన రామాయణం, మహాభారతాలకు తమకంటూ ప్రత్యేకమైన స్థానం ఉంది. కానీ మానవ జీవితంలోని కొన్ని అనుభూతులు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఒకేలా కనిపిస్తాయి. అందులో ప్రధానమైనది.. ఇంటికి తిరిగి చేరుకోవాలనే మనిషి తపన.

భావోద్వేగం మాత్రం ఒకటే..
‘ది ఒడిస్సీ’లో ఇథాకా రాజు ఒడిస్సియస్ ట్రాయ్ యుద్ధం అనంతరం స్వదేశానికి తిరుగు ప్రయాణం మొదలుపెడతాడు. యుద్ధం ముగిసినా అతని కష్టాలు ముగియవు. సముద్ర తుఫాన్లు, వింత జీవులు, దేవతల ఆగ్రహం, ప్రలోభాలు.. ఇలా ఎన్నో పరీక్షలను దాటుకుంటూ దాదాపు 20 ఏళ్ల తర్వాత తన భార్య పెనెలోప్, కుమారుడు టెలిమాకస్ వద్దకు చేరుకుంటాడు. రామాయణంలోనూ రాముడి కథ ఇంటి నుంచి దూరమవడంతోనే మొదలవుతుంది.
అయోధ్యను విడిచి 14 ఏళ్ల వనవాసానికి వెళ్లిన రాముడు అనేక కష్టాలను ఎదుర్కొంటాడు. సీత అపహరణ తర్వాత రావణుడితో యుద్ధం చేసి చివరకు తిరిగి స్వస్థలానికి చేరుకుంటాడు. మహాభారతంలో పాండవుల ప్రయాణం కూడా ఇలాంటి విడిపోవడం, పోరాటం, పునరాగమనంతోనే సాగుతుంది. జూదంలో రాజ్యాన్ని కోల్పోయిన వారు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసి తిరిగి తమ హక్కుల కోసం పోరాడతారు. ఆ ప్రయాణం కురుక్షేత్ర సంగ్రామానికి దారి తీస్తుంది.

ఇక్కడ కథలు వేరు.. పాత్రలు వేరు.. కానీ భావోద్వేగం మాత్రం ఒకటే. ఈ భావోద్వేగాలే భారతీయ ప్రేక్షకులకు ‘ది ఒడిస్సీ’ని మరింత చేరువ చేస్తాయి. అంతేకాదు.. రామాయణం, మహాభారతంలోని వనవాసం, కుటుంబ బంధాలు, ధర్మం–అధర్మం, రాజ్యాన్ని తిరిగి సాధించుకునే పోరాటం వంటి అంశాలు దశాబ్దాలుగా భారతీయ సినిమాల్లోనూ ఎన్నో రూపాల్లో(కథ, కథనం.. రిఫరెన్స్‌ల రూపంలో..) కనిపిస్తున్నాయి. పౌరాణిక చిత్రాల నుంచి ఆధునిక కమర్షియల్ సినిమాల వరకు అనేక కథలు ఈ ఇతిహాసాల భావనల నుంచే ప్రేరణ పొందాయి. అందుకే ‘ది ఒడిస్సీ’లోని కొన్ని ఘట్టాలు తెరపై కనిపించినప్పుడు.. అవి పూర్తిగా కొత్తగా కాకుండా ఎక్కడో చూసిన భావాల్లా అనిపించడం సహజం.
ఇది కథల మధ్య ప్రత్యక్ష సంబంధం కంటే.. ప్రపంచవ్యాప్తంగా మానవ అనుభవాలు, భావోద్వేగాలు ఒకే విధంగా వ్యక్తమవుతాయనే విషయాన్ని గుర్తు చేస్తుంది. ఈ మూడు మహాకావ్యాల్లోనూ నాయకులకు ఎదురయ్యే సవాళ్లు సాధారణమైనవి కావు. ఒడిస్సియస్ ప్రయాణంలో సైక్లోప్స్, సైరన్స్, సిర్సీ వంటి గ్రీకు పురాణ పాత్రలు కనిపిస్తాయి. అవి అతడి శారీరక బలాన్ని మాత్రమే కాదు.. ఆలోచనా శక్తిని, నిర్ణయ సామర్థ్యాన్ని కూడా పరీక్షిస్తాయి. రామాయణంలో మారీచుడి బంగారు జింక రూపం కథలో కీలక మలుపుకు కారణమవుతుంది.
మహాభారతంలో పాండవులు అరణ్యవాస సమయంలో అనేక అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటారు. ఇక్కడ అతీత శక్తులు కేవలం అద్భుతాల కోసం కాకుండా.. నాయకుల వ్యక్తిత్వాన్ని పరీక్షించే సాధనాలుగా మారతాయి. ప్రలోభాలు కూడా ఈ మూడు కథల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఒడిస్సియస్‌ను దారి తప్పించే సైరన్స్ నుంచి.. రామాయణంలోని మాయా ఘటనలు, మహాభారతంలోని అధికారం–ఆకాంక్ష–గర్వం చుట్టూ తిరిగే సంఘర్షణల వరకు.. ప్రతి కథలోనూ ఒకే ప్రశ్న కనిపిస్తుంది.
కష్ట సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలమా?
దేవతల పాత్ర కూడా ఈ కథల్లో ఆసక్తికరమైన అంశం. ‘ది ఒడిస్సీ’లో అథీనా ఒడిస్సియస్‌కు అండగా నిలిస్తే.. పోసైడన్ అతడి ప్రయాణానికి అడ్డంకిగా మారతాడు. రామాయణంలో దైవ శక్తులు రాముడి జీవనయాత్రలో భాగమవుతాయి. మహాభారతంలో శ్రీకృష్ణుడి గీతోపదేశం యుద్ధరంగాన్ని దాటి జీవిత తత్వాన్ని వివరిస్తుంది. అయితే, దైవ సహాయం ఉన్నప్పటికీ చివరి పోరాటం మాత్రం నాయకులదే. ఒడిస్సియస్ తన తెలివితో ముందుకు సాగాలి. రాముడు తన ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. పాండవులు తమ నిర్ణయాల ఫలితాలను అనుభవించాలి.
గెలుపు కాదు.. ఆశలకు సమాధానం కూడా..
ఈ కథల్లో మరో బలమైన అంశం.. ఎదురుచూపు. ఒడిస్సియస్ కోసం పెనెలోప్ సంవత్సరాల తరబడి వేచి చూస్తుంది. రాముడి కోసం అయోధ్య ఎదురుచూస్తుంది. పాండవుల కథలో కుటుంబ బంధాలు, విడిపోవడం, సంఘర్షణలు కీలక పాత్ర పోషిస్తాయి. నాయకుడి విజయం కేవలం అతడి వ్యక్తిగత గెలుపు కాదు.. అతడి కోసం ఎదురుచూసిన వారి ఆశలకు సమాధానం కూడా.
మనిషి తపన మాత్రం ఎప్పటికీ మారదు..
‘ది ఒడిస్సీ’, రామాయణం, మహాభారతం మూడు వేర్వేరు ప్రపంచాల కథలు. వీటిలో హీరోల స్వభావాలు కూడా భిన్నమైనవే. ఒడిస్సియస్ తెలివి, వ్యూహాలతో విజయం సాధించే నాయకుడు. రాముడు ధర్మం, బాధ్యతకు ప్రతీక. పాండవులు నైతిక సంఘర్షణల మధ్య ప్రయాణించే పాత్రలు. కానీ ఈ మూడింటినీ కలిపే ఒకే భావన ఉంది.. విడిపోవడం.. పోరాడటం.. చివరకు తిరిగి చేరుకోవడం. అందుకే మూడు వేల ఏళ్ల నాటి ‘ది ఒడిస్సీ’ నేటి ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసినా.. దాని గుండెకాయలో ఉన్న భావోద్వేగాలు మాత్రం ఎక్కడో మనకు తెలిసినవే అనిపిస్తాయి. బహుశా గొప్ప కథల శాశ్వత శక్తి అదే కావచ్చు. కాలం మారుతుంది.. సంస్కృతులు మారుతాయి.. కానీ ఇంటికి చేరుకోవాలనే మనిషి తపన మాత్రం ఎప్పటికీ మారదు.


