క్రిస్టోఫర్ నోలన్ 'ద ఒడిస్సీ'.. ఎందుకు చూడాలి? | Christopher Nolan The Odyssey Movie Telugu Analysis | Sakshi
Sakshi News home page

The Odyssey: ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్.. నోలన్ ఈసారి ఏం చేస్తాడు?

Jul 15 2026 11:21 AM | Updated on Jul 15 2026 11:57 AM

Christopher Nolan The Odyssey Movie Telugu Analysis

ఒడిస్సీ.. ఒడిస్సీ.. ఒడిస్సీ.. ప్రపంచవ్యాప్తంగా గత కొన్నిరోజుల నుంచి డిస్కషన్ అంతా ఈ సినిమా గురించే. హాలీవుడ్‌లోనే పలు అద్భుతాలు తీసిన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ఇది. ద డార్క్ నైట్, ఇంటర్ స్టెల్లార్, ఇన్సెప్షన్, టెనెట్ లాంటి మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్ చిత్రాలతో మెప్పించిన నోలన్.. కెరీర్‌లోనే తొలిసారి పురాణాల ఆధారంగా 'ద ఒడిస్సీ' తీశాడు. మరి ఈ చిత్రానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఎందుకు చూడాలి?

(ఇదీ చదవండి: సెన్సేషనల్ సినిమా 'అబ్సెషన్' తెలుగు రివ్యూ)

2004లో వచ్చిన 'ట్రాయ్' సినిమా గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. డబ్బింగ్ రూపంలోనూ చూసే ఉంటారు. తొలుత దీనికి దర్శకుడిగా క్రిస్టోఫర్ నోలన్‌నే అనుకున్నారు. కానీ 'బ్యాట్ మ్యాన్' అవకాశం రావడంతో నోలన్ అటువైపు వెళ్లాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అదే ట్రాయ్ గుర్రం నేపథ్యం చిన్న భాగమైన 'ద ఒడిస్సీ' తీశాడు.

మన దేశంలో పురాణాలు, ఇతిహాసాలు ఉన్నట్లే గ్రీకు పురాణాలు కూడా ఎంతో ఫేమస్. దీని ఆధారంగా ఇప్పటికే హాలీవుడ్‌లో పలు సినిమాలు వచ్చాయి. ‍అయితే ఫిజిక్స్, టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ కథలతో ఆటాడుకునే క్రిస్టోఫర్ నోలన్.. గ్రీకు మైథాలజీలో భాగమైన ఒడిసియస్ రాజు గురించి సినిమాని తీస్తాడని ఎవరూ ఊహించలేదు. ఎప్పుడైతే 'ద ఒడిస్సీ' ప్రకటన వచ్చిందో మూవీపై మంచి హైప్ వచ్చింది.

ఓవైపు షూటింగ్ జరుగుతున్నప్పటికీ ఏడాది క్రితమే 'ద ఒడిస్సీ' మూవీ టికెట్స్ ఆన్‌లైన్‌లో పెడితే నిమిషాల్లో అవి అమ్ముడైపోయాయి. అది నోలన్‌కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్. ముందే చెప్పినట్లు జూలై 17న అంటే ఈ శుక్రవారమే థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమా మొత్తాన్ని క్రిస్టోఫర్ నోలన్.. గ్రీస్, స్కాట్లాండ్, ఐస్ ల్యాండ్ లాంటి తొమ్మిది దేశాల్లోని లైవ్ లొకేషన్స్‌లో ఐమ్యాక్స్ కెమెరాతో షూటింగ్ చేశాడు. ఈ కెమెరాకి ఓ స్పెషాలిటీ ఉంది. వేరే ఏ కెమెరాలకు అయినా లెంగ్త్ విషయంలో ఎక్కువ, తక్కువ నిడివితో షూటింగ్ చేసుకోవచ్చు. కానీ ఐమ్యాక్స్ కెమెరాలో మూడు నిమిషాల సీన్ మాత్రమే క్యాప్చర్ చేయడానికి కుదురుతుంది.

(ఇదీ చదవండి: అమ్మకానికి 'ఐమాక్స్'?)

నోలన్ తనకు 16 ఏళ్లున్నప్పుడు ఐమ్యాక్స్ కెమెరాలో ఓ సినిమా తీయాలని అనుకున్నాడు. అది ఇన్నాళ్లకు అంటే 55 ఏళ్ల వయసులో నెరవేరింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 40 ఐమ్యాక్స్ స్క్రీన్స్ మాత్రమే ఉ‍న్నాయి. నోలన్ 'ద ఒడిస్సీ' చిత్రాన్ని ఎలా తీశాడు? ఏం చూపించాలనుకున్నాడు? అనేది వీటిలో మాత్రమే కరెక్ట్‌గా కనబడుతుంది. మిగిలిన వాటిలో సినిమా విజువల్స్ పైన, కింద, మూలల్లో కట్ అయ్యే అవకాశముంటుంది.

 సాధారణంగా హాలీవుడ్ సినిమాలని మన దేశంలో పెద్దగా ప్రమోట్ చేయరు. కానీ నోలన్, తన టీమ్‌తో కలిసి కొన్నిరోజుల క్రితం భారతదేశంలో ల్యాండ్ అయ్యాడు. ముంబైలో జరిగిన ప్రీమియర్ పాల్గొన్నాడు. భరద్వాజ్ రంగన్, అనుపమ్ చోప్రా లాంటి ఫిల్మ్ అనలిస్ట్‌లకు నోలన్ ఇంటర్వ్యూలు ఇవ్వడం అందరికీ ఆశ్చర్యపరిచింది. మన దేశ మార్కెట్‌పై ఇంతలా నోలన్ దృష్టిపెట్టడం ఆసక్తికర విషయం.

(ఇదీ చదవండి: చిన్న రోబో అడిగిన ప్రశ్న.. ఏఐ జమానాలోనూ జవాబు లేదు!)

'ద ఒడిస్సీ' కథ విషయానికొస్తే.. ఇథికా అనే రాజ్యానికి చెందిన ఒడిసియస్ అనే రాజు చాలా బలవంతుడు, తెలివైనవాడు. తన రాజ్యాన్ని వదిలి పదేళ్ల పాటు పోరాడి ఓ యుద్ధాన్ని గెలుస్తాడు. వెంటనే తిరిగి తన రాజ్యానికి వెళ్లిపోయి భార్య పెనలోపి, కొడుకు టెలీమాకస్‌ని కలవాలనుకుంటాడు. కానీ విధి ఇతడికి సహకరించదు. సముద్రదేవుడు, గాలి దేవుడు, అగ్ని దేవుడు, ఇలా చాలామంది ఒడిసియస్ రాజుపై పగబడతారు. ఒంటి కన్ను రాక్షసుడు, మంత్రగత్తెలు తదితరుల కారణంగా పదేళ్లు పాటు రకరకాల రాజ్యాల్లో తిరుగుతూ చిట్టచివరికి ముసలివాడైన ఓ బిచ్చగాడిలా తన రాజ్యంలో అడుగుపెడతాడు. స్వయంవరంలో గెలిచి మళ్లీ తన భార్య పెనలోపిని దక్కించుకుంటాడు.

ఎమోషన్స్, విజువల్స్ ఎఫెక్ట్స్, అడ్వెంచర్, సర్వైవల్ డ్రామాగా తీసిన ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 'ద ఒడిస్సీ'పై హైప్ ఉన్నప్పటికీ నెగిటివిటీ కూడా కొంత ఏర్పడింది. ట్రైలర్‌కి యూట్యూబ్‌లో డిస్ లైక్స్ లాంటివి వచ్చాయి. ఇలా ప్లస్సులు, మైనస్సులు ఉన్నప్పటికీ మూవీ లవర్స్ మాత్రం ఒక్కసారైనా 'ద ఒడిస్సీ'ని చూడాల్సిందే అని ఫిక్సయ్యారు. మరి ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో ఏంటో? తెలుగులోనూ ఇది రిలీజ్ అవుతుండటం విశేషం.

(ఇదీ చదవండి: ది ఒడిస్సీ క్రేజ్.. ఒక్కో టికెట్ ధర అన్ని వేలా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement