సెన్సేషనల్ సినిమా 'అబ్సెషన్' తెలుగు రివ్యూ | Obsession Movie 2026 Review Telugu | Sakshi
Sakshi News home page

Obsession 2026 Review: రూ.7 కోట్ల బడ్జెట్ రూ.1600 కోట్ల కలెక్షన్.. మూవీ రివ్యూ

Jun 5 2026 3:23 PM | Updated on Jun 5 2026 3:32 PM

Obsession Movie 2026 Review Telugu

రీసెంట్ టైంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా 'అబ్సెషన్'. ఇదో హాలీవుడ్ సినిమా. తీసింది కూడా ఓ యూట్యూబర్. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్ పెడితే ఇప్పటివరకు రూ.1600 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుని రికార్డుల మీద రికార్డుల సృష్టిస్తోంది. మూడు వారాల క్రితం అమెరికాలో రిలీజై, గతవారం మన దేశంలోని థియేటర్లలోకి వచ్చింది. ఈ సెన్సేషనల్ మూవీలో అంతలా ఏముందనేది రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: ఓటీటీలో ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్‌టైనర్ 'మధువిధు' తెలుగు రివ్యూ)

కథేంటి?
బేర్ (మైకేల్ జాన్స్‌టన్) కాలేజీ కుర్రాడు. ఓ మ్యూజిక్ షాపులో పనిచేస్తుంటాడు. ఇతడికి ముగ్గురు ఫ్రెండ్స్. వాళ్లలో ఒకరైన నిక్కీని(ఇండే నవరెట్టే) ఇతడు ప్రేమిస్తుంటాడు. కానీ ఆమెకు ఆ విషయం చెప్పేందుకు చాలా భయపడిపోతుంటాడు. ఓ రోజు 'వన్ విష్' పేరుతో ఉన్న చిన్న వస్తువుని కొంటాడు. దాన్ని విరగ్గొట్టి నిక్కీ తనని చాలా ప్రేమించేయాలని బలంగా కోరుకుంటాడు. ఊహించని విధంగా ఆ కోరిక నిజమైపోతుంది. నిక్కీ, బేర్‌ని ప్రేమించడం మొదలుపెడుతుంది. అప్పటివరకు అంతా ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. తర్వాత ఏం జరిగింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే? 
అబ్సెషన్ అంటే తెలుగులో పిచ్చి లేదా యావ అనే అర్థం. అంటే ఒక వ్యక్తిపై లేదా ఒక వస్తువు గురించి విపరీతంగా ఆలోచించడం, ఇష్టపడటం అనే అర్థంలో దీన్ని ఉపయోగిస్తారు. ఈ సినిమా విషయానికొస్తే సింపుల్ స్టోరీ లైన్. అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు. అయితే వాళ్లలో ఒకరు, ఎదుటి వ్యక్తిని పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తే ఏమవుతుందనేది మిగతా స్టోరీ.

కేవలం గంట 45 నిమిషాల నిడివితో ఉండే ఈ సినిమా ప్రస్తుతం ఇంగ్లీష్‌లో, థియేటర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇదో సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ. హారర్ సీన్స్ ఏం ఉండవు గానీ కొన్నిచోట్ల అంతకు మించి భయపెడుతుంది. కూర్చున్న సీటు నుంచి కదిలిపోయేలా చేస్తుంది. చాలా నిదానంగా స్టోరీ మొదలవుతుంది. ఎప్పుడైతే హీరో.. హీరోయిన్‌ని తనని ప్రేమించాలని కోరుకుంటాడో అప్పటినుంచి అసలు కథ మొదలవుతుంది. చివరివరకు అదే టెంపో మెంటైన్ చేస్తారు.

సాధారణంగా ఇంగ్లీష్ సినిమాల్లో ఇంటర్వెల్ లాంటివి ఉండవు. మన దేశంలో స్క్రీనింగ్ అయ్యే వాటికి సడన్‌గా కట్ చేసి ఇంటర్వెల్ కార్డ్ వేస్తారు. కానీ 'అబ్సెషన్'లో మాత్రం ఫెర్ఫెక్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. ఒక మూవీ వస్తుందంటే దీనిలో సీన్లు గతంలో ఎ‍క్కడో చూశామే అని కచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇందులో అలా ఏం అనిపించదు. స్టోరీ నుంచి సీన్స్ వరకు అన్ని ఫ్రెష్‌గా ఉంటాయి.

ఒక సీన్‌లో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతుంటారు. అంతా ప్రశాంతంగా ఉందేంటి? సమ్‌థింగ్ ఈజ్ ఫిషీ అని అనుకునేలోపు అదిరిపోయే బ్యాంగర్ పడుతుంది. క్లైమాక్స్ కూడా అస్సలు ఊహించలేం. ఈ మూవీలో హీరోహీరోయిన్‌తో పాటు మరో రెండు ఫ్రెండ్ పాత్రలు, అదనంగా మరో నలుగురైదుగురు మాత్రమే కనిపిస్తారు. ఈ సినిమా తీసిన కర్రీ బార్కర్ స్వతహాగా యూట్యూబర్. దీనికంటే ముందు ఓ మూవీ తీశాడు గానీ అది తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసుకున్నాడు. ఇదే తొలి ఫీచర్ ఫిల్మ్. అయినా సరే కంటెంట్, కలెక్షన్లతో కేక పుట్టించాడు.

ప్రధాన పాత్రలు చేసిన మైకేల్ జాన్స్‌టన్, ఇండే నవరెట్టే జీవించేశారని చెప్పొచ్చు. ఓ సీన్‌లో హీరోయిన్ కళ్లు మాత్రమే హైలైట్ అయ్యేలా లైటింగ్ ఉంటుంది. ఆ సీన్ చూస్తున్నప్పుడు హీరోయిన్ పాత్ర దెయ్యంలా అనిపిస్తుంది. ఎలాంటి మేకప్, విజువల్ ఎఫెక్ట్స్ అవసరం లేకుండా అలా చూపించడం క్రేజీగా అనిపిస్తుంది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కావొచ్చని అంటున్నారు. కానీ ఇంగ్లీష్ సినిమాలు చూసే ఆసక్తి ఉంటే మాత్రం 'అబ్సెషన్'ని థియేటర్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేయండి. టికెట్ డబ్బులకు కచ్చితంగా న్యాయం జరుగుతుంది. అభ్యంతర సీన్స్ చాలానే ఉన్నాయి. కాబట్టి కుటుంబంతో కలిసి చూసే ప్రయత్నాల్లాంటివి చేయొద్దు.

- చందు డొంకాన

(ఇదీ చదవండి: కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ)

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement