ఓటీటీలో ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్‌టైనర్.. తెలుగు రివ్యూ | MadhuVidhu Movie Telugu Review And OTT Details | Sakshi
Sakshi News home page

MadhuVidhu Review: పాత కాన్సెప్ట్ కొత్త ట్రీట్‌మెంట్.. ఓటీటీ మూవీ రివ్యూ

Jun 1 2026 3:50 PM | Updated on Jun 1 2026 3:56 PM

MadhuVidhu Movie Telugu Review And OTT Details

తెలుగులో ఫ్యామిలీ మొత్తం కూర్చుని చూసే సినిమాలు ఈ మధ్య కాలంలో బాగా తగ్గిపోయాయి. ఆ లోటుని పరభాషా చిత్రాలు ఇప్పుడు భర్తీ చేస్తున్నాయి. అలాంటి ఓ మూవీనే 'మధువిధు'. మలయాళంలో రిలీజై డీసెంట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. రీసెంట్‌గా సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఇది ఎలా ఉంది? చూడొచ్చా లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్)

కథేంటి?
కొచ్చాంబళం అనే ఊరిలో ఒక కుటుంబం ఉంటుంది. అందులో ఐదుగురు మగాళ్లే ఉంటారు. ఆడవాళ్లు లేని కుటుంబం అని, నాగదోషం ఉందని.. కోడలిగా వచ్చేందుకు ఏ అమ్మాయి ఇష్టపడదు. దీంతో ఇదే ఇంట్లో ఉండే అమృత్ రాజ్(షరాఫుద్దీన్)కి 28 సార్లు పెళ్లి సంబంధాలు చెడిపోతాయి. చివరకు స్నేహ (కల్యాణి పణిక్కర్) ఇతడి జీవితంలోకి వస్తుంది. తర్వాత ఏం జరిగింది? అమృత్ రాజ్ పెళ్లయిందా లేదా అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
'మధువిధు' అంటే మలయాళంలో హనీమూన్ అని అర్థం. ఆడది లేక బోసిపోయిన ఇంట్లో ఉండే హీరో.. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని, ఒంటరిగా కాకుండా భార్యతో కలిసి నిద్రపోవాలని అనుకుంటూ ఉంటాడు. అందుకు తగ్గట్లే పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉంటాడు. 28 సంబంధాలు చూస్తాడు కానీ అందరూ రిజెక్ట్ చేసేస్తారు. అలాంటి ఇతడి జీవితంలోకి అనుకోకుండా ఓ అమ్మాయి రావడంతో ఊహించని మలుపులు ఎదురవుతాయి. ఇంతకీ అవేంటి? చివరకు కథ సుఖాంతం అయిందా లేదా అనేది అసలు కథ.

టాలీవుడ్‌లో ఇప్పుడు డిష్యుం డిష్యుం సినిమాలే ఎక్కువైపోయాయి. ఫ్యామిలీలో ఉండే బంధాలు, భావోద్వేగాలు చూపించే చిత్రాలు రోజురోజుకి తగ్గిపోతున్నాయి. అలాంటి వాటిని చక్కగా చూపించిన మూవీ ఇది. ఇది పాత కాన్సెప్టే కానీ ట్రీట్‌మెంట్ ఫ్రెష్‌గా ఉంది. ఒక ఊరిలో మగాళ్ల మాత్రమే ఉండే కుటుంబం, అదే ఊరిలో ఆడవాళ్లు మాత్రమే ఉండే మరో కుటుంబానికి ఎలాంటి కనెక్షన్ ఏర్పడింది. 'పెళ్లి' అనేది ఈ రెండు ఇళ్లల్లో ఎలాంటి సమస్యలు సృష్టిస్తుందని చూపించిన విధానం బాగుంది.

నాగదోషం ఉందని హీరో ఉంటున్న ఇంటికి ఎవరూ పిల్లనివ్వరు. అలాంటి పరిస్థితుల్లో హీరోతో పాటు ఇతడి తండ్రి, బాబాయ్ ఎలా ప్రేమలో పడ్డారు? చివరకు ఎవరెవరిని పెళ్లి చేసుకున్నారు? అనేది కామెడీగా చూపించారు. పెళ్లీడు వచ్చిన కొడుకు ఇంట్లోనే ఉండగానే తండ్రి పెళ్లి చేసుకోవడం, అప్పటికే కూతురు కూడా ఉన్న కొత్త భార్యని ప్రెగ్నెంట్ చేయడం అనేది వినడానికి చాలా బోల్డ్‌గా అనిపిస్తుంది కానీ ఇందులో అదే కాన్సెప్ట్‌ని ఫన్నీగా డీల్ చేశారు. అది బాగా వర్కౌట్ అయింది కూడా.

అలకలు, బుజ్జగింపులు, వేడుకలు, వేదన.. ఇలా అన్ని అంశాలని కలుపుకొని ఈ సినిమాని చూపించిన విధానం మెప్పించింది. మరీ ముఖ్యంగా పట్టె మంచం గురించి వచ్చే సీన్స్ అయితే మంచిగా నవ్విస్తాయి. తరచూ ఒకే దగ్గర కేబుల్ వైర్ తెగిపోవడం లాంటి సీన్స్ కూడా నవ్వు తెప్పిస్తాయి. హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ ఎక్కడా రాసినట్లు కాకుండా మన పక్కనే జరిగినట్లు అనిపిస్తుంది. అదే ఆ ట్రాక్ బలం.

ఈ సినిమాలో సిట్యుయేషనల్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. హీరో జీవితం ఓ ట్రాజెడీలా ఉంటుంది కానీ దాన్ని ఎక్కడా మెలోడ్రామా చేయకుండా ఫన్నీగా చూపించిన విధానం అందరికీ కనెక్ట్ అవుతుంది. పెళ్లి అనేది ఒక పంజరం లాంటిదని చాలామంది భావిస్తుంటారు. కానీ పెళ్లి అనేది ఓ అందమైన బంధం అనే మెసేజ్ ఇచ్చే సినిమా ఇది. సమస్యలు అన్ని ఇళ్లలో ఉంటాయి. అర్ధం చేసుకుని, మాట్లాడుకుని మమకారాలు పెంచుకుని కలిసుండాలని చెబుతుంది. బోర్ కొట్టకుండా సింపుల్ కంటెంట్‌తో సరదాగా సాగిపోతుంది.

హీరోహీరోయిన్లుగా చేసిన షరాఫుద్దీన్, కల్యాణి పణికర్‌తో పాటు మిగతా అందరూ యాక్టింగ్‌తో అదరగొట్టేశారు. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు ఒక్కటి ఉండవు గానీ మూవీ పూర్తయ్యేసరికి చాలా పాత్రలతో ప్రేమలో పడిపోతాం. అంతలా నచ్చేస్తాయి. సెకండాఫ్‌లో సాగదీత, ఫోర్డ్స్‌గా అనిపించే కొన్ని సీన్స్ తప్పితే ఓవరాల్‌గా మూవీ బాగుంది. డైరెక్టర్ విష్ణు ఆనంద్, మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ గానీ తమ పనికి పూర్తి న్యాయం చేశారు. కుటుంబం అంతా కలిసి చూడొచ్చు.

- చందు డొంకాన

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement