కొన్ని సినిమాలు థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజైపోతుంటాయి. సాధారణంగా ఇలాంటి వాటిపై చిన్నచూపు ఉంటుంది. ఎందుకంటే కంటెంట్ బాగోలేకపోవడం వల్లే ఇలా ఇచ్చేశారా అని సందేహం కలుగుతుంది. కొన్నిసార్లు మాత్రం దీనికి భిన్నంగా జరుగుతుంది. ఇప్పుడు అలానే వచ్చిన ఓ కోర్ట్ రూమ్ డ్రామా ఆకట్టుకుంటోంది. దాని పేరు 'సిస్టమ్'. జ్యోతిక, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రధారులు. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)
కథేంటి?
ఢిల్లీకి చెందిన సీనియర్ లాయర్ రవి రాజవంశీ(అశుతోష్ గోవారికర్) కూతురు నేహ(సోనాక్షి సిన్హా). తండ్రిలానే లాయర్ వృత్తిని ఎంచుకున్నప్పటికీ మరో సీనియర్ దగ్గర పనిచేస్తుంటుంది. కానీ ఒక్క కేసు కూడా గెలవలేకపోతూ ఉంటుంది. 10 కేసులు గెలిస్తేనే తన లా ఫార్మ్‌లో చేర్చుకుంటానని నేహాకి తండ్రి షరతు పెడతాడు. అనుకోని విధంగా నేహాకు.. కోర్టులో స్టెనోగ్రాఫర్‌గా పనిచేస్తున్న సారిక(జ్యోతిక) పరిచయమవుతుంది. సారిక చేసిన చిన్న చిన్న సాయాల వల్ల నేహా వరసగా కేసుల్లో విజయం సాధిస్తుంది. ఒకానొక టైంలో తండ్రీ కూతురు ఒకే కేసులో పరస్పరం తలపడాల్సి వస్తుంది. అప్పుడు ఏమైంది? ఇంతకీ ఆ కేసు ఏంటి? అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
పైపైన చూస్తే ఇదో రెగ్యులర్ కోర్ట్ రూమ్ డ్రామానే. అందరికీ నచ్చకపోవచ్చు కూడా. ఎందుకంటే అద్భుతమైన ట్విస్టులు ఇందులో ఏం లేవు. కానీ తరచి చూస్తే మన న్యాయవ్యవస్థ ఎలాంటి పరిస్థితుల్లో మగ్గుతుందో కనిపిస్తుంది. ధనం, అధికారం ఉన్నోడిదే న్యాయం అని అర్థమవుతుంది. గుండెల్లో ధైర్యం తప్పితే ఏమి లేని సామాన్యుడికి న్యాయం అందని ద్రాక్షలా ఎలా తయారైందనే విషయాన్ని పచ్చిగా చూపించారు.
చట్టంలో న్యాయం చేయడానికి సెక్షన్లు ఉన్నట్లే తప్పించుకోవడానికి అంతకు మించిన లొసుగులు చాలానే ఉన్నాయి. ఇలాంటి వాటిని ఉపయోగించుకుని కొందరు నేరస్తులు తప్పించుకుంటున్నారు. డబ్బుకు ఆశపడే కొందరు లాయర్లు ఇలాంటి వాళ్లకు సాయం చేస్తున్నారు. తమకు న్యాయం జరగదనే ఆలోచనతో బాధితులు ఎలా మారుతున్నారు? నిజం ఎప్పటికైనా నిరూపితం అవుతుందనే నమ్మకాన్ని వాళ్లలో కలిగించేదెవరు? అనే అంశాల చుట్టూ తిరిగే స్టోరీ ఇది.
డబ్బు కోసమే వాదించే ఓ సీనియర్ లాయర్. తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుని లాయర్‌గా స్థిరపడాలనే ఆయన కూతురు. కోర్టులో రోజూ పదుల సంఖ్యలో వాదప్రతివాదనలు వింటూ అద్భుతమైన జ్ఞానాన్ని పెంచుకునే ఓ స్టెనోగ్రాఫర్. ఈ మూడు పాత్రల చుట్టూ కోర్టు రూమ్‌లోనే కథంతా సాగుతుంది. ప్రారంభంలో స్టోరీ సెట్ అవ్వడానికి కాస్త టైమ్ పడుతుంది గానీ ఎప్పుడైతే నేహా,సారిక పాత్రలు కలుస్తాయో, తండ్రిని ఎదిరించి నేహా ఇల్లు వదిలి బయటకొచ్చేస్తుందో అప్పటినుంచి స్టోరీలో కదలిక వస్తుంది. విక్రమ్ బజాల్ కేసుకి సంబంధించిన ఆధారాలని సేకరించడం కోసం సాగే అన్వేషణ ఇంట్రెస్టింగ్‌గా అనిపించినప్పటికీ చివరి అరగంట చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది.
నేహా పాత్రతో విలాసవంతమైన జీవితం ఎలా ఉంటుందో చూపించిన డైరెక్టర్.. సారిక పాత్రతో మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుందో చక్కగా చూపించారు. కథ, కథనం పర్లేదనిపించినప్పటికీ జనాలకు మాత్రం కొన్ని ప్రశ్నలు అలానే మిగిలిపోతాయి. 'వ్యవస్థ' మనిషిని నడిపిస్తోందా? లేదంటే కొందరు 'పెద్దోళ్లు' వ్యవస్థని నడిపిస్తున్నారా అనే విషయాల్ని సామాన్యుడిగా అర్థమయ్యేలా చూపించారు.

ఈ మూవీలో హీరో, విలన్ అంటూ ఎవరూ ఉండరు. దానికంటే పరిస్థితులు మనుషులని ఎలా మార్చేస్తాయి అనే విషయాన్ని చూపించడంలో దర్శకురాలు అశ్విన్ అయ్యర్ పూర్తిగా సక్సెస్ అయ్యారు. 'మన భుజాల మీద నుంచి భారం దింపేసుకున్నాం అనుకుంటాం కానీ భుజాలు మాత్రమే మారతాయి భారం కాదు', 'న్యాయస్థానానికి నేరం ఎవరు చేశారు అనేది అనవసరం ఎవరిపై ఆధారాలు ఉన్నాయి అనేదే ముఖ్యం' లాంటి డైలాగ్స్ ఈ సినిమాపై గౌరవాన్ని పెంచుతాయి. పూర్తయిన తర్వాత మన బుర్రలోనే తిరుగుతాయి.
ఇందులోనే నేహా, సారిక పాత్రలతో ఫెమినిజంకు అసలైన అర్థం కూడా చూపించారు. భర్తకు కాలు చచ్చుబడి ఇంటికే పరిమితమైనప్పటికీ ఇంటిని చూసుకునే సారిక పాత్ర కావొచ్చు, తండ్రినే ఎదిరించి కేసు గెలిచే నేహా పాత్ర కావొచ్చు భలే అనిపిస్తాయి. ఆయా పాత్రల్లో జ్యోతిక, సోనాక్షి చాలా సహజంగా నటించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్కడ ఎంత ఉండాలో అంతే వినిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగా చేశారు. కుటుంబంతో కలిసి చూడొచ్చు.
-చందు డొంకాన
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. ఏడాదిన్నరకు స్ట్రీమింగ్)


