‘నేను రైటర్ గా వంద చిత్రాలు రాశాను. నటుడిగా వందలాది చిత్రాల్లో నటించాను. దర్శక నిర్మాతగా సినిమాలు తెరకెక్కించాను. నేను చేసిన అన్ని చిత్రాల్లో ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ కు బెస్ట్ స్క్రీన్ ప్లే ఇచ్చానని చెప్పగలను. ఈ సినిమా రూపొందించిందుకు గర్వంగా ఉంది. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా ఏం జరుగుతుందో ఊహించలేరు’ అని అన్నారు నటుడు, దర్శక నిర్మాత పోసాని కృష్ణమురళి.ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వ వహించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ అరుణారెడ్డి’. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ బాధ్యతలతో పాటు నిర్మాతగానూ ఆయనే వ్యవహరించాడు. హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్, బీజేపీ నేత రఘునందన్ రావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 17న "ఆపరేషన్ అరుణారెడ్డి" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ.. ‘మా సినిమా ఇంత త్వరగా షూటింగ్ చేసుకుని రిలీజ్ కు వస్తోందంటే కారణం నా మిత్రుడు శ్రీనివాస్. ఆయన అందించిన సహకారం వల్లే అనుకున్న టైమ్ కు సినిమాను రిలీజ్ చేస్తున్నా.ఈ సినిమాలో ఒక్క బూతు గానీ, ఒక్క అసభ్యమైన సన్నివేశం గానీ ఉండదు. ఎంతో సిన్సియర్ గా ఈ సినిమాను రూపొందించాను. "ఆపరేషన్ అరుణారెడ్డి" సినిమా ప్రేక్షకులందరికీ బాగా నచ్చుతుందని నమ్ముతున్నా. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ మహదేవ్ ఏలేందర్ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని పోసాని ఎంతో ప్లానింగ్ తో రూపొందించారు. ఎన్నో వెర్షన్స్ స్క్రిప్ట్ రాసుకున్నారు. ఆ స్క్రిప్ట్ లో డైలాగ్స్ తో పాటు లిరిక్స్ కూడా రాసుకున్నారంటే ఆయన ఎంత పక్కాగా ఈ స్క్రిప్ట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. కథ విన్నప్పుడే ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అనిపించింది. ఇది పోసాని గారికి 2.ఓ గా మారుతుందని చెప్పగలను. అన్నారు.
‘ఈ సినిమా మీ అందరికీ నచ్చేలా ఉంటుంది. నవ్విస్తుంది, ఆలోచింపజేస్తుంది, మన సొసైటీని రిఫ్లెక్ట్ చేసేలా ఉంటుంది’ అని హీరోయిన్ హిందోళ చక్రవర్తి అన్నారు. ‘ఈ సినిమా రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కరూ మా మూవీ గురించే మాట్లాడుకుంటారు. అలాంటి సెన్సేషన్ ను మా మూవీ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నాను’అని నటి కాజల్ శర్మ అన్నారు. నిర్మాత శ్రీనివాస్, డీవోపీ సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.


