తిరువీర్, ఐశ్వర్యా రాజేష్ జంటగా నటించిన చిత్రం ‘ఓ..! సుకుమారి’. భరత్ దర్శన్ దర్శకత్వంలో మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో తిరువీర్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో నేనొక అప్‌కమింగ్ పొలిటీషియన్ పాత్రలో నటించాను. ఒక అమ్మాయి గుండె వేగం సాధారణ స్థాయిని దాటితే ఆమె శరీరం నుంచి ఎలక్ట్రిక్ షాక్ జనరేట్ అవుతుంది.
అలాంటి అమ్మాయి జీవితంలోకి ప్రేమించిన అబ్బాయి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అన్నదే ఈ సినిమా కథాంశం. ఈ సినిమా కథ కొత్తగా, ఆసక్తిగా ఉంటుంది. ప్రేక్షకులను నవ్వించడంతో పాటు భావోద్వేగానికి గురి చేస్తుంది. నేను నటించిన సినిమాలకు నిర్మాతలకు డబ్బులు వచ్చి, దర్శకుడికి పేరు వస్తే చాలనుకుంటాను. ఒకప్పుడు సినిమాల్లో నటించేందుకు నా ఫొటోలు తీసుకుని, ఆఫీసుల చుట్టూ తిరిగాను.
అలాంటిది ఇప్పుడు నాతో సినిమాలు చేస్తే బిజినెస్ జరుగుతోందని భావించి, దర్శక–నిర్మాతలు నాతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ లెక్కన నేను కంఫర్టబుల్ ప్లేస్‌లోనే ఉన్నానని అనుకుంటున్నాను. ఇక నెలకు దాదాపు 20 కథలు వింటాను. వీటిలో నాకు నచ్చిన కథలు చేస్తున్నాను. నా తర్వాతి చిత్రం ‘భగవంతుడు’ కొత్తగా ఉంటుంది. అలాగే అమెజాన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను’’ అని అన్నారు.


