మైథాలజీ సినిమాలు చేస్తున్న స్టార్ హీరోలు
భారతీయ పురాణాలు, ఇతిహాసాల నేపథ్యంలో ఇప్పటికే సిల్వర్ స్క్రీన్‌పై ఎన్నో సినిమాలు వచ్చాయి. భవిష్యత్‌లోనూ వస్తాయి. కానీ పురాణాలతో కూడిన ఈ కథలను దర్శకులు సిల్వర్ స్క్రీన్‌పై ఆడియన్స్‌కు ఎంత అద్భుతంగా చూపించారు? కథలను వారికి అర్థమయ్యేలా ఎలాంటి స్క్రీన్‌ప్లేతో చెప్పారు? అన్నది ముఖ్యం. ఈ తరహా చిత్రాలను పర్ఫెక్ట్‌గా తెరకెక్కిస్తే సూపర్ హిట్ ఖాయం. ప్రస్తుతం పురాణాలు, ఇతిహాసాల స్ఫూర్తితో కొన్ని మైథాలజీ అంశాలతో కూడిన సినిమాలు సిద్ధం వుతున్నాయి. ఈ సినిమాల కోసం దర్శకులు సరికొత్త లోకాలను సృష్టిస్తున్నారు. ఈ సినిమాలపై మీరూ ఓ లుక్ వేయండి.
శ్రీరాముడు
సిల్వర్ స్క్రీన్‌పై శ్రీరాముడిగా మహేశ్‌బాబు కనిపించనున్నారు. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న అడ్వెంచరస్ టైమ్ ట్రావెల్ అండ్ మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘వారణాసి’. ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడు.. ఇలా రెండు పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు మహేశ్‌బాబు. ఇప్పటివరకు మహేశ్‌బాబు సిల్వర్ స్క్రీన్‌పై పూర్తి స్థాయిలో శ్రీరాముడు గెటప్‌లో కనిపించింది లేదు. ‘వారణాసి’ సినిమా కోసం శ్రీరాముడిగా మహేశ్‌బాబు మేకోవర్ అయ్యారు. ఈ చిత్రంలో శ్రీరాముడిగా మహేశ్‌బాబు దాదాపు 30 నిమిషాలు కనిపిస్తారని, ఈ ఎపిసోడ్ అత్యద్భుతంగా ఉంటుందని ఆల్రెడీ ఈ చిత్రదర్శకుడు రాజమౌళి చెప్పారు.
ఆగస్టు 9న మహేశ్‌బాబు బర్త్ డే. ఈ సందర్భంగా ‘వారణాసి’ సినిమాలో శ్రీరాముడు గెటప్‌లో ఉన్న మహేశ్‌బాబు లుక్ బయటకు రావొచ్చనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అంతేకాదు... విభిన్న కాలమానాల్లో ఈ సినిమా కథనం సాగుతుందని, లార్డ్ శివగానూ మహేశ్‌బాబు కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇంకా 80 రోజుల షూటింగ్ జరిగితే ‘వారణాసి’ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది.
ఇప్పటికే ఈ సినిమాలోని మేజర్ యాక్షన్ సీక్వెన్స్, ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. కేవలం కథను అనుసంధానించే సన్నివేశాల చిత్రీకరణే జరుగుతోందని ఇటీవల పారిస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాజమౌళి తెలిపారు. ఈ సినిమాలోని మందాకిని పాత్రలో ప్రియాంకా చోప్రా, కుంభ పాత్రలో పృద్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. శివభక్తుడి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపిస్తారు. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ సాహసోపేతమైన జర్నీ సినిమాను కేఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ సినిమా విడుదల కానుంది.
సత్యలోకం
చిరంజీవి హీరోగా నటించిన అడ్వెంచరస్ యాక్షన్ అండ్ మైథాలజీ సినిమా ‘విశ్వంభర’. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించగా మరో లీడ్ రోల్‌లో ఆషికా రంగనాథ్ నటించారు. వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్ రెడ్డి సమర్పణలో వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. ఈ సినిమా ఈపాటికే విడుదల కావాల్సింది. కానీ వీఎఫ్‌ఎక్స్ వర్క్స్, క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ లేకుండా, సిల్వర్ స్క్రీన్‌పై ఈ సినిమాను ప్రేక్షకులకు అద్భుతంగా చూపించాలని ‘విశ్వంభర’ టీమ్ ప్రయత్నిస్తోంది. అందుకే ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతోంది.
అయితే ఈ చిత్రానికి సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ వర్క్స్, పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కావొచ్చాయి. దీంతో ఈ సినిమాను అక్టోబరు 16న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ‘పైన 7, కింద 7... మొత్తం 14 లోకాలు ఉన్నాయి. యమలోకం, స్వర్గం, పాతాళం... ఇలా ఎవరికి తోచిన విధంగా వారు ఈ 14 లోకాలను చూపించారు.
కానీ 14 లోకాలను దాటి, బ్రహ్మదేవుడు ఉండే సత్య లోకాన్ని ‘విశ్వంభర’ సినిమాలో చూపించాను. హీరో డైరెక్ట్‌గా ఈ సత్య లోకానికి ఎలా వెళ్తాడు? హీరోయిన్‌ను ఎలా తిరిగి తెచ్చుకుంటాడు? అన్నదే ‘విశ్వంభర’ సినిమా కథనం’’ అని దర్శకుడు వశిష్ఠ ఓ సందర్భంలో పేర్కొన్నారు. మరి... సత్య లోకం నుంచి హీరోయిన్‌ను హీరో ఎలా తీసుకురాగలిగాడు? అన్న అంశాలను థియేటర్స్‌లో విజువల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే దసరా పండగ వరకు ప్రేక్షకులు వేచి చూడాల్సిందే.
గాడ్ ఆఫ్ వార్
‘యమదొంగ’ సినిమాలో యముడు పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తే ఆయన అభిమానులు మురిసిపోయారు. ఓ పూర్తి స్థాయి మైథాలజీ సినిమాలో సిల్వర్ స్క్రీన్‌పై ఎన్టీఆర్ కనిపిస్తే చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఆ సమయం వచ్చేసింది. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మైథాలజీ సినిమా గురించిన అనౌన్స్‌మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కళ్యాణ్‌రామ్ ఈ సినిమాను నిర్మించనున్నారు.
ఈ సినిమాకు ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్‌ను మేకర్స్ అనుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ చిత్రంలో దేవతల సర్వ సైన్యాధ్యక్షుడు, లార్డ్ కుమార స్వామిగా ఎన్టీఆర్ నటించనున్నారని తెలిసింది. కొంత కాలం క్రితం లార్డ్ మురుగన్ అనే బుక్ ఎన్టీఆర్ చేతిలో కనిపించింది. దీంతో ఈ సినిమాపై ఎన్టీఆర్ ప్రిపరేషన్ ఆల్రెడీ మొదలైందనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది.
అయితే ప్రస్తుతం ‘డ్రాగన్’ సినిమాతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం సాగుతోంది. అలాగే తమిళ దర్శకుడు నెల్సన్‌తో ఎన్టీఆర్ ఓ సినిమా చేయాల్సి ఉంది. దీంతో ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి కొంత సమయం పడుతుందని ఊహించవచ్చు.
⇒ ‘కేజీఎఫ్, సలార్’ వంటి చిత్రాలను తీసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ మైథాలజీ కథను సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమాకు ‘రావణం’ అనే టైటిల్‌ను ఆయన అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మైథాలజీ సినిమాలో ప్రభాస్ లేదా అజిత్ హీరోగా నటించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. కాగా ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘డ్రాగన్’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ప్రభాస్‌తో ‘సలార్ 2’, యశ్‌తో ‘కేజీఎఫ్ 3’ సినిమాలు చేయాల్సి ఉంది. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత ‘రావణం’ సినిమాను ప్రశాంత్ నీల్ సెట్స్‌కు తీసుకుని వెళ్తారని ఊహించవచ్చు.
మరోవైపు ప్రభాస్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదొక మైథాలజీ సినిమా సబ్జెక్ట్ అని తెలిసింది. ఈ సినిమాకు ‘బ్రహ్మరాక్షస’ అనే టైటిల్‌ను మేకర్స్ అనుకుంటున్నారని, ప్రభాస్ ప్రస్తుత కమిట్‌మెంట్స్ పూర్తయిన తర్వాత ఈ సినిమా గురించిన పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ప్రశాంత్ వర్మ ఒకవైపు ‘జై హనుమాన్’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నప్పటికీ వీలైనప్పుడు ‘బ్రహ్మరాక్షస’ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్‌పై కూడా దృష్టి పెడుతున్నారని తెలిసింది.
కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించనుందట. ఈ రెండు సినిమాల సంగతి ఇలా ఉంచితే... ప్రస్తుతం నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లోని ‘కల్కి సినిమాటిక్ వర్క్స్’లో భాగంగా రూపొందిన తొలి సినిమా ‘కల్కి 2898 ఏడీ’. ఈ మైథాలజీ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాలో భైరవగా, కర్ణుడిగా ప్రభాస్ కనిపించిన సంగతి తెలిసిందే. ఈ మైథాలజీ కమ్ సైన్స్ ఫిక్షన్ డ్రామాను వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ‘కల్కి 2’ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
⇒ ఇటీవలే ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రామ్‌చరణ్. ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో రామ్‌చరణ్ హీరోగా నటించాల్సిన మూవీ సెట్స్‌కు వెళ్తుంది. అయితే బాలీవుడ్‌లో ‘కిల్’ అనే యాక్షన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ ఓ మైథాలజీ స్టోరీని రెడీ చేశారట. ఈ కథలో రామ్‌చరణ్ హీరోగా నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
శాపం ఎందుకు?
మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ‘మహేంద్రగిరి వారాహి’. ఈ మైథాలజీ అండ్ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌లో సుమంత్ హీరోగా నటించారు. మాళవిక నాయర్, ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి గోస్వామి, బ్రహ్మనందం ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్ నిర్మించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
ఇటీవల ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మైథాలజీ అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహేంద్రభూపతి మహారాజు వంశానికి ఉన్న శాపం, మహేంద్రగిరి అమ్మవారి ఆలయం చుట్టూ నెలకొన్న మిస్టరీ, ఈ మిస్టరీని చేధించేందుకు హీరో చేసే ప్రయత్నాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని టీజర్ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత రానుంది.
తొలిసారిగా...!
ఇరవైకి పైగా సినిమాలు చేశారు అల్లు అర్జున్. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న ‘రాకా’ ఆయన కెరీర్‌లోని 22వ చిత్రం. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాదే పూర్తవుతుంది. మేజర్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. కాగా, అల్లు అర్జున్ తర్వాతి చిత్రం తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో ఖరారైంది. ఈ ఏడాదే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు.
అయితే ఈ సినిమాలో కొన్ని మైథలాజికల్ ఎలిమెంట్స్ ఉన్నాయని, ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని, ఇటీవలే అల్లు అర్జున్‌కు కథ పరంగా ఓ నరేషన్ ఇచ్చారని తెలిసింది. ముంబైలో లుక్ టెస్ట్ కూడా పూర్తయింది. అల్లు అర్జున్ ఎప్పుడైతే ‘రాకా’ సినిమా చిత్రీకరణను పూర్తి చేస్తారో అప్పుడు లోకేష్ కనగరాజ్‌తో సినిమాను సెట్స్‌పైకి తీసుకువెళతారు. కెరీర్‌లో అల్లు అర్జున్ తొలిసారి మైథాలజీ అంశాలున్న సినిమా చేయనున్నారు. మరి... అల్లు అర్జున్ కోసం లోకేష్ కనగరాజ్ ఏ తరహా మైథలాజికల్ ఎలిమెంట్స్‌తో కథను సిద్ధం చేస్తున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఈ సినిమా 2028 ద్వితీయార్ధంలో విడుదల కావొచ్చు.
దశావతార ఆలయం
శతాబ్దాల క్రితం నాటి పవిత్రమైన దశావతార ఆలయం నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ‘హైందవ’. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తున్నారు. సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్నారు. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో మూన్ షైన్ పిక్చర్స్ పతాకంపై మహేశ్ చందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా, దేవుడి విగ్రహాలను, దేవాలయాలను తమ స్వార్థం కోసం వాడుకునే దుష్ట శక్తులను దైవం ఏ రూపంలో శిక్షిస్తుంది? ఎవరి ద్వారా ధర్మరక్షణకు సంకల్పిస్తుంది? అన్న అంశాలతో పాటు కొన్ని మైథాలజీ ఎలిమెంట్స్‌తో ఈ రూపొందుతోందని తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ సగానికి పైగా పూర్తయింది. గత ఏడాది జనవరిలోనే టీజర్‌ను రిలీజ్ చేశారు. అయితే భారీ స్థాయిలో వీఎఫ్‌ఎక్స్ వర్క్స్‌తో కూడుకున్న సినిమా ఇది. దీంతో ఈ సినిమా మేకింగ్ కాస్త స్లోగా సాగుతోందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాను గురించిన కొత్త అప్‌డేట్ రానుందట.
జై హనుమాన్
‘ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా రూపొందిన సినిమా ‘హను–మాన్’. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హను–మాన్’ సినిమా రానుంది. ‘హను–మాన్’ చిత్రంలో తేజ సజ్జ హీరోగా నటిస్తుండగా, ‘జై హను–మాన్’ చిత్రంలో కన్నడ ప్రముఖ దర్శక–నిర్మాత, నటుడు, ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో నటుడు–నిర్మాత రానా కూడా భాగమయ్యారని, ప్రస్తుతం రిషబ్–రానాల మధ్య వచ్చే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ షూటింగ్ జరుగుతోందని తెలిసింది. అలాగే ‘హను–మాన్’ హీరో తేజ సజ్జ కూడా ఈ చిత్రంలో భాగమయ్యారు. ఈ చిత్రంలో తేజ సజ్జ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కావొచ్చు.
⇒ ఇటు కోలీవుడ్‌లోనూ మైథాలజీ సినిమాలు తెరకెక్కుతున్నాయి. లార్డ్ కుమారస్వామి జీవితం ఆధారంగా ‘తమిళ్ మురుగన్’ అనే సినిమాను ప్రకటించారు ధనుష్ . ఈ చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహించనున్నారు. ధనుష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అలాగే శివకార్తికేయన్ ‘సీయోన్’ చిత్రం కూడా మైథాలజీ అంశాలతోనే రూపొందుతోందని తెలిసింది. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ రూరల్ యాక్షన్ డ్రామాను కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది
అక్టోబరులో ఈ సినిమా విడుదల కానుంది.
⇒ భారతీయ సినీ పరిశ్రమలో యానిమేషన్ సినిమాలు ఊపందుకుంటున్నాయి. అ శ్విన్ కుమార్ దర్శకత్వంలోని ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ నుంచి వచ్చిన తొలి భాగం ‘మహావతార్ నరసింహా’. 2025లో విడుదలైన ఈ యానిమేషన్ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో భారతీయ పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా యానిమేషన్ సినిమాలను తెరకెక్కించేందుకు దర్శక–నిర్మాతలు చాలా ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ క్రమంలో ‘కార్తికేయ, కార్తికేయ 2’ చిత్రాల ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో వాయుపుత్ర అనే సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే అరుణ్‌కుమార్ రాపోలు దర్శకత్వంలో ‘హనుమత్ సుందరకాండ’ అనే యానిమేషన్ సినిమా ప్రకటన వచి్చంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో నిశి్చత సేతు, హరినాథ్ దేవర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అలాగే కాళికాదేవి కథలను యానిమేషన్ సినిమాల రూపంలో తీసుకువచ్చేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సన్నాహాలు చేస్తోందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
ఇంకా ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ నుంచి ‘మహావతార్ పరశురామ్, మహావతార్ రఘునందన్, మహావతార్ ద్వారాకాదీష్ , మహావతార్ గోకులనంద, మహావతార్ కల్కి పార్ట్ 1, మహావతార్ కల్కి పార్ట్ 2’ సినిమాల ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రోడక్షన్స్ సంస్థలు ఈ యానిమేషన్ సినిమాలను నిర్మించనున్నాయి. ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ నుంచి రెండు సంవత్సరాలొక సినిమా చొప్పున విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నామని ‘మహాతార్ సినిమాటిక్ యూనివర్స్’ దర్శకుడు అశ్విన్ కుమార్ ఓ సందర్భంలో పేర్కొన్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ కోవలో మరికొన్ని యానిమేషన్ సినిమాలు ఉన్నాయి.
– ముసిమి శివాంజనేయులు


