యానిమల్ హిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తోన్న చిత్రం స్పిరిట్. ఈ మూవీ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ తొలిసారి పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌లో భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2027 మార్చి 5న రిలీజ్ కానుంది.
తాజాగా ఈ మూవీ టైటిల్‌పై వివాదం నెలకొంది. ఇప్పటికే ఈ పేరుతో ఓ మూవీని తెరకెక్కించారు. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ పేరుతో ఓ రైతు కూలీ మూవీని నిర్మించారు. తాజాగా ఈ టైటిల్ పేరుతో హిందీ వర్షన్ రిలీజ్ చేయవద్దని నిర్మాతలకు టీ సిరీస్ నోటీసులు పంపించింది. హిందీ వెర్షన్ రిలీజ్ చేయడానికి లేదా హిందీ రైట్స్ అమ్ముకోవడానికి వీల్లేదని నోటీసుల్లో పేర్కొంది. కేవలం తెలుగు వర్షన్ మాత్రమే థియేటర్లలో, ఓటీటీ (OTT), యూట్యూబ్‌లో రిలీజ్ చేసుకోవడానికి ఒప్పుకుంటేనే లీగల్ నోటీసులు వెనక్కి తీసుకుంటామని తెలిపింది.
తాజాగా టి- సిరీస్ నోటీసులపై స్పిరిట్ ఈజ్ నాట్ వన్ చిత్ర నిర్మాతలు చిన్నబోయిన నరసమ్మ, శ్రీ వెంకటేశ్వర్లు స్పందించారు. టీ సిరీస్ నోటీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా సినిమా ఎక్కడ రిలీజ్ చేసుకోవాలో చెప్పడానికి మీరెవరు? అంటూ ప్రశ్నించారు. మా సినిమా ఎక్కడ, ఏ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేసుకోవాలనేది మా వ్యక్తిగత విషయం.. మాపై నిబంధనలు పెట్టడానికి టీ సిరీస్‌కు ఎలాంటి హక్కు ఉందని నిర్మాతలు ప్రశ్నించారు.
మా సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ చేసుకుంటాము.. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తోన్న స్పిరిట్ హిందీలో హ్యాపీగా రిలీజ్ చేసుకోండి.. దానికి మాకేం అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. సినిమా హక్కుల విషయంలో కార్పొరేట్ సంస్థల బెదిరింపులకు భయపడేది లేదని, ఈ ఏకపక్ష షరతులకు తాము అంగీకరించడం లేదని చిత్ర బృందం తెగేసి చెప్పింది. ఈ చిత్రాన్ని త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాతలు స్పష్టం చేశారు.


