సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న సైబర్ వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రముఖ మలయాళ హీరోయిన్ అన్నా రేష్మా రాజన్ సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న సైబర్ దాడిపై తీవ్రంగా స్పందించారు. తన ప్రమేయం లేకుండా, తన ఫోటోను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారం చేసిన ఓ వ్యక్తిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వివరాలను బహిర్గతం చేస్తూ కేరళ పోలీసులు, సైబర్ సెల్‌కు ఆమె ఫిర్యాదు చేశారు.
‘ఈ నీచమైన చర్య నా గౌరవానికి, వ్యక్తిగత ప్రైవసీకి తీవ్ర భంగం కలిగించింది. ఇలాంటి అసభ్యకర కంటెంట్‌ను సృష్టించేవారైనా, దాన్ని ఇతరులతో పంచుకునే వారైనా సరే చట్టానికి సమాధానం చెప్పుకోవాల్సిందే. ఈ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై అధికారికంగా ఫిర్యాదు చేశాను. నాకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ఆపను, చట్టపరంగా ముందడుగు వేస్తాను’ అని ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చింది.
అన్నా రాజన్‌కు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురుకావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా వివిధ వేదికలపై ఆమె ధరించిన దుస్తులను లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. పలు సందర్భాల్లో ఆమె బాడీ షేమింగ్‌కు, అసభ్యకర వ్యాఖ్యలకు గురయ్యారు. అయినప్పటికీ ధైర్యంగా నిలబడి వాటన్నింటినీ ఆమె తిప్పికొట్టారు.
అన్నా రాజన్ సినీ కెరీర్ విషయాలకొస్తే.. 2017లో లీజో జోస్ పెల్లిస్సేరి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా 'అంగమాలి డైరీస్' ద్వారా అన్నా రాజన్ వెండితెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో ఆమె పోషించిన 'లిచ్చి' పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో, ఆమెను అంతా 'లిచ్చి' అని పిలవడం ప్రారంభించారు. 'వెలిపడింతే పుస్తకం', 'మధుర రాజా', 'అయ్యప్పనుమ్ కోషియుమ్' వంటి చిత్రాలకు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన 'జైలర్ 2' లో నటిస్తున్నారు. ఈ సినిమాతో ఆమె కోలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.


