ట్రోల్స్‌పై తీవ్రంగా మండిపడ్డ హాలీవుడ్ నటి మిల్లీ బాబీ బ్రౌన్
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్లీ బాబీ బ్రౌన్ తన రూపం, వయస్సుపై నెట్టింట వస్తున్న ట్రోల్స్‌పై తీవ్రంగా మండిపడ్డారు. 'స్ట్రేంజర్ థింగ్స్' (Stranger Things) సిరీస్‌లో కేవలం 11 ఏళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ప్రస్తుతం గ్లోబల్ నటిగా, బిజినెస్ ఉమెన్‌గా రాణిస్తున్న ఆమె.. ఇటీవల జే షెట్టి 'ఆన్ పర్పస్' పాడ్‌కాస్ట్‌లో పాల్గొని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పాడ్‌కాస్ట్‌లో మిల్లీ బాబీ బ్రౌన్ మాట్లాడుతూ, పరిశ్రమలో బాలనటిగా ఎదుగుతున్న క్రమంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. ‘ఇతరుల అభిప్రాయాలు, విమర్శలు నా ఎదుగుదలకి ఎంతమాత్రం సహాయపడలేదు. నేను ఎలా కనిపిస్తున్నానో అనే దానిపై జనాలు ఎప్పుడూ నెగెటివ్‌గా మాట్లాడటం వింటూనే పెరిగాను. నేను కేవలం 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు.. 60 ఏళ్ల మహిళలా కనిపిస్తున్నానంటూ కొందరు దారుణంగా విమర్శించారు’అని బ్రౌన్ ఆవేదన వ్యక్తం చేశారు.
స్టైలింగ్ విషయంలో నెటిజన్ల ద్వంద్వ ప్రమాణాలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ‘నేను హై హీల్స్ వేసుకుంటే ఒకలా విమర్శిస్తారు. అదే ఒక సూట్ వేసుకుంటే, నా వయస్సు కంటే పెద్దగా కనిపిస్తున్నానని అంటారు. ఇలాంటి కామెంట్స్ చేసేవాళ్లకు సొంత అభిప్రాయమంటూ ఏది ఉండదు. నా దృష్టిలో వాళ్లంతా రోబోలు’ అని బ్రౌన్ అన్నారు.
చిన్న వయసులోనే పరిశ్రమలోకి అడుగుపెట్టడం వల్ల ఎదురైన అనుభవాలు తనకు జీవితపాఠాలు నేర్పాయని, బాలనటులను అన్ని విధాలుగా రక్షించడమే తన జీవిత లక్ష్యంగా మార్చుకున్నానని ఆమె స్పష్టం చేశారు. పద్నాలుగేళ్ల వయసులోనే యూనిసెఫ్ అత్యంత పిన్న వయస్కురాలైన గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితులైన బ్రౌన్, పిల్లల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.
ప్రస్తుతం 'ఎనోలా హోమ్స్ 3' చిత్రంలో నటిస్తున్న బ్రౌన్, తన కెరీర్‌లో కొత్త మలుపులు చవిచూస్తున్నారు. తనపై వచ్చే విమర్శలను ధైర్యంగా ఎదుర్కొంటూనే, భవిష్యత్ తరాల బాలనటుల భద్రత కోసం గళమెత్తడం కొనసాగిస్తానని బ్రౌన్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు


