తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చిట్టచివరి సినిమా 'జన నాయగన్' సెన్సార్ పూర్తయినట్లు ఇటీవలే ప్రకటించారు. అందుకు తగ్గట్లే వచ్చే శుక్రవారం (జూలై 24) థియేటర్లలో మూవీని రిలీజ్ చేయనున్నారనే టాక్ నడుస్తోంది. దాదాపు ఈ తేదీ కన్ఫర్మ్ అయినప్పటికీ నిర్మాణ సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు తండ్రి విజయ్ కోసం కొడుకు జేసన్ సంజయ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: జైలులోనే స్టార్ హీరో.. ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి సినిమా)
విజయ్ తన భార్య సంగీతతో విడాకులు తీసుకుబోతున్నాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది. దీంతో కొడుకు జేసన్, తండ్రి నుంచి దూరంగా తల్లితో కలిసి ఉంటున్నాడు. అయితే జేసన్.. తండ్రిలా హీరో అవుతాడని అంతా అనుకున్నారు కానీ దర్శకుడిగా మారి 'సిగ్మా' అనే మూవీ తీశాడు. సందీప్ కిషన్ హీరోగా నటించాడు. దీన్ని జూలై 31న రిలీజ్ చేస్తామని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. కానీ 'జన నాయగన్'.. ఆ తేదీకి సరిగ్గా వారం ముందే వస్తున్న నేపథ్యంలో రిలీజ్ వాయిదా వేయాలని 'సిగ్మా' టీమ్ అనుకుంటోందట.
ప్రస్తుతం 'సిగ్మా' వాయిదా రూమర్స్ కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే తండ్రి విజయ్ కోసం కొడుకు జేసన్ సంజయ్ వెనక్కి తగ్గినట్లు అవుతుంది. ఇకపోతే 'భగవంత్ కేసరి' రీమేక్ అయిన 'జన నాయగన్'లో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్ర చేసింది. హెచ్.వినోద్ దర్శకుడు.
(ఇదీ చదవండి: నాగచైతన్య, సమంత, అఖిల్.. నెక్స్ట్ ఎవరు?)


