సీనియర్ నటుడు శరత్ కుమార్ చేయని పాత్రంటూ లేదు. తెలుగు, తమిళంలో హీరో, విలన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన మంగళవారం తన 62వ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు కూడా చెప్పారు. కాగా ఈ సందర్భంగా కొద్దిరోజుల క్రితం ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో శరత్ కుమార్ గురించి ఆయన భార్య, నటి రాధిక శరత్ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో శరత్ కుమార్ జోక్స్ గురించి రాధిక మాట్లాడిన విధానం అందరినీ నవ్వించింది.
(ఇదీ చదవండి: సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?)
శరత్ కుమార్‌ని నేను తొలిసారిగా కలిసినప్పుడు లాగి చెంప పగలగొట్టాలనిపించింది. దానికి కారణం ఆయన ఓ జోక్ చెప్పి తనే నవ్వుకుంటున్నారు. నాకు అస్సలు నవ్వే రాలేదు. అంతకంటే మంచి జోక్ మీకు తెలియదా? అని అడిగాను. అప్పటి నుంచి ఆయన ఆ అలవాటు ఇప్పటికీ మార్చుకోలేదు. అలాంటి చెత్త జోక్స్‌కి శరత్ కుమార్ ఓ యూనివర్సిటీ లాంటివారు' అని రాధిక చెప్పుకొచ్చింది.
అలానే ఒక తండ్రిగా శరత్ కుమార్ ఎలా ఉంటారు అనే దానికి కూడా రాధిక సమాధానమిచ్చింది. నా కూతురు రాయన్‌ని నేను సింగిల్ పేరెంట్‌గానే పెంచాను. మంచి, చెడు అంటూ జీవిత అనుభవాన్ని నేనే నేర్పించాను. మా కొడుకు విషయంలో అలా కాదు. అతనికి నేను ఏదైనా చెప్పే ప్రయత్నం చేయగానే వదిలేయ్ నేను చెబుతాను అంటూ శరత్ కుమార్ వచ్చేస్తారు. అతనికి సంబంధించిన అన్ని విషయాలు ఆయనే చూసుకుంటారు. అందుకు ఫలితం ఎలా ఉంటుంది అనేది మా అబ్బాయి పెద్దయిన తర్వాతే తెలుస్తుంది' అని రాధిక పేర్కొంది.
(ఇదీ చదవండి: ఆగిపోలేదు.. ఆ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా)


