ఇటీవలే విడాకుల ప్రకటనతో వార్తల్లో నిలిచిన బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్. నాగిని సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ.. బాలీవుడ్‌లో పలు చిత్రాలు చేసింది. ఈ ఏడాది మే నెలలో తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చింది. తన భర్త సూరజ్ నంబియార్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే విడాకుల ప్రకటించిన రెండు నెలల్లోనే మౌనీ రాయ్‌పై రూమర్స్ మొదలయ్యాయి. నటుడు అర్జున్ బిజ్లానీతో ఆమె డేటింగ్‌లో ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. వీరిద్దరు జంటగా ఓ హోటల్ నుంచి బయటికి వస్తున్న వీడియో వైరలైంది. దీంతో మౌనీ రాయ్, అర్జున్ రిలేషన్‌లో ఉన్నారంటూ బాలీవుడ్‌లో టాక్ వినిపించింది.
తాజాగా ఈ వార్తలపై నటుడు అర్జున్ బిజ్‌లానీ స్పందించారు. ఇవన్నీ నిరాధార ఆరోపణలని పేర్కొన్నారు. ఇలాంటి వార్తలు రాస్తోన్న వారిని విమర్శించారు. ఇలాంటి కథనాలను ప్రచురించే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని ఆయన మీడియా సంస్థలను కోరారు. మా మధ్య 15 ఏళ్లకు పైగా ఉన్న స్నేహాన్ని ప్రేమగా చిత్రీకరించడం నిరాశపరిచిందన్నారు. ముఖ్యంగా కష్టకాలంలో ఉన్న నా స్నేహితురాలికి అండగా నిలబడినప్పుడు ఇలా జరగడం మరింత బాధాకరమని అర్జున్ అన్నారు. మా ఇద్దరి చుట్టూ అల్లుతున్న కథనాలు అవాస్తవమని అర్జున్ వెల్లడించారు. ఈ విషయంపై ఓ ప్రత్యేక నోట్ విడుదల చేశారు.
అర్జున్ తన నోట్‌లో రాస్తూ..' "ప్రియమైన క్లిక్‌బైట్ మిత్రులారా.. 15 ఏళ్లకు పైగా స్నేహంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒక గాసిప్ పేజీ శీర్షికలో వచ్చినంచ మాత్రాన ఒక్కసారిగా జంటగా మారిపోరు. కొన్నిసార్లు మన స్నేహితుడు కష్టకాలంలో ఉన్నప్పుడు ఒకరికొకరు అండగా నిలబడతారు. మీ వ్యూస్ కోసం ప్రతి స్నేహాన్ని ప్రేమ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ప్రచురించే ముందు వాస్తవాలను సరిచూసుకోవడం మంచింది. మనం సృష్టించే కథనాల విషయంలో బాధ్యతగా ఉందాం." అంటూ రాసుకొచ్చారు.
ప్రజల వ్యక్తిగత జీవితాలకు నష్టం కలిగించేలా సంచలనాత్మక శీర్షికలను వాడకూడదని మీడియాకు విజ్ఞప్తి చేశాడు. ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి అనవసరంగా చొరబడి.. గందరగోళం సృష్టించే తప్పుదోవ పట్టించే కథనాలను వ్యాప్తి చేసే ముందు వాస్తవాలను సరిచూసుకోవాలని మీడియాను కోరారు. బాధ్యతాయుతమైన జర్నలిజం విశ్వసనీయతను పెంచుతుందని.. క్లిక్‌బైట్ పెంచదని సూచించారు. అర్జున్, మౌని ప్రేమలో ఉన్నారన్న వార్తలను క్రిస్టల్ డిసౌజా కూడా ఖండించింది. ఇదేం పిచ్చి. కేవలం వ్యూస్ కోసం ఏమైనా పోస్ట్ చేస్తారా అని ప్రశ్నించింది.
కాగా.. నటుడు అర్జున్, మౌనీ రాయ్ 15 ఏళ్లకు పైగా స్నేహితులుగా ఉన్నారు. 2015లో, ఏక్తా కపూర్ నిర్మించిన 'నాగిన్' సీరియల్‌లో వారు రితిక్, శివన్య పాత్రలలో నటించారు. వీరి జోడీ అత్యంత ప్రజాదరణ పొందిన వారిలో ఒకటిగా నిలిచింది. గతంలో జనవరి 27, 2022న సూరజ్‌ను పెళ్లాడిన మౌనీ రాయ్.. ఈ ఏడాది మే 14న విడిపోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది.
ఇక కెరీర్ విషయానికొస్తే మౌని రాయ్ ఇటీవల 'ది భూత్నీ','సలాకార్' చిత్రాలలో కనిపించారు. ఆమె అబ్ హోగా హిసాబ్ వెబ్ సిరీస్, హై జవానీ తో ఇష్క్ హోనా హై చిత్రంలో కూడా నటించారు. అర్జున్ బిజ్లానీ ఇటీవల అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్‌లో 'రైజ్ అండ్ ఫాల్' గెలుచుకున్నారు. అతను ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కామెడీ డ్రామాతో ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్నారు.


