సాయిపల్లవి పేరు చెప్పగానే ఫిదా, ప్రేమమ్, అమరన్ లాంటి సినిమాలు, అందులో ఆమె చేసిన అద్భుతమైన యాక్టింగ్ గుర్తొస్తుంది. ఇప్పటివరకు దక్షిణాదిలోని పలు భాషల్లో నటించిన ఈమె.. ఈ ఏడాది హిందీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ హీరోగా చేసిన మూవీతో పరిచయమైంది. రెండున్నర నెలల క్రితం థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ చూడొచ్చు.
(ఇదీ చదవండి: సోనమ్ వాంగ్‌చుక్‌కు '3 ఇడియట్స్'తో సంబంధం లేదు: ఆమిర్ ఖాన్)
సాయిపల్లవి, జునైద్ ఖాన్ జంటగా నటించిన సినిమా 'ఏక్ దిన్'. థాయ్ భాషకు చెందిన 'వన్ డే'కి ఇది అఫీషియల్ రీమేక్. పెద్దగా బజ్ లేకుండానే ఈ ఏడాది మే 01న థియేటర్లలో రిలీజైంది. సాయిపల్లవి తప్పితే ఇందులో చెప్పుకోదగ్గ మరో ప్లస్ పాయింట్ లేదు. ఆమిర్ కొడుకు జునైద్ యాక్టింగ్ అయితే మరీ దారుణంగా ఉందని విమర్శలు వచ్చాయి. దీంతో ఈ మూవీని జనాలు మర్చిపోయారు. తెలుగు డబ్బింగ్ రిలీజ్ చేసినప్పటికీ ఇదొచ్చిన సంగతి కూడా ఎవరికీ తెలియనంతలా వచ్చి వెళ్లిపోయింది.
ఇకపోతే రెండు రోజుల క్రితం ఈ సినిమాని విదేశాల్లో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మన దేశంలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఉచితంగానే అందుబాటులోకి తెచ్చారు. హిందీతో పాటు తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది.
'ఏక్ దిన్' విషయానికొస్తే.. ఐటీ ప్రొఫెషనల్ అయిన దినేశ్ (జునైద్ ఖాన్) తనతో పనిచేసే మీరా(సాయిపల్లవి)ని రహస్యంగా ప్రేమిస్తుంటాడు. కానీ ఈ విషయం ఆమెతో చెప్పే ధైర్యముండదు. ఆఫీస్ పనిమీద జపాన్ వెళ్లినప్పుడు కనీసం ఒక్కరోజైనా ఆమెతో గడపాలని కోరుకుంటాడు. కట్ చేస్తే మీరాకు 'ట్రాన్సియంట్ గ్లోబల్ అమ్నీషియా' అనే అరుదైన వ్యాధి వస్తుంది. అంటే ఒకరోజుపాటు ఆమె తన జ్ఞాపకశక్తిని కోల్పోతుంది. మరి ఆ రోజు ఏం జరిగింది? దినేశ్ తన ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పగలిగాడా లేదా? అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగు రివ్యూ)


