సాక్షి సినిమా : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, నటి త్రిష కృష్ణన్ బంధంపై తరచూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. మలయాళ నటుడు ధ్యాన్ శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. తన తాజా చిత్రం 'విజిటర్' ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడిన ధ్యాన్.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకను పరోక్షంగా ప్రస్తావిస్తూ వేసిన సరదా పంచ్‌లు ప్రేక్షకులను నవ్వించాయి. అయితే ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారడంతో పాటు విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమోషన్ ఈవెంట్‌లో తన సహనటి నవ్యా నాయర్‌ను ఉద్దేశించి ధ్యాన్ మాట్లాడుతూ.. "చాలా రోజుల తర్వాత మనిద్దరం కలిసి సినిమా చేస్తున్నాం. నవ్యాకు పెళ్లై, ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయినా నేను ఒకరోజు కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే.. నువ్వు తెల్లచీర కట్టుకుని ముందు వరుసలో కూర్చొని, కళ్లలో నీళ్లతో నన్ను చూస్తూ ఉండాలి" అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ మాటలతో సభలో నవ్వులు పూశాయి.
Trisha emotions were on high during Vijay oath ceremony. An emotional moment ❤️ pic.twitter.com/GrJcW88bwg
— Devanshu Mani Tripathi (@devanshu_mani) May 10, 2026
ఆ తర్వాత మైక్ అందుకున్న నవ్యా నాయర్ కూడా అదే స్థాయిలో స్పందించింది. "నువ్వు సీఎం అయితే.. నువ్వు చెప్పినట్టే తెల్లచీరకు ఆకుపచ్చ అంచు, డైమండ్ నెక్లెస్ వేసుకుని ముందు వరుసలో కూర్చుంటా. కళ్లలో ఆనందబాష్పాలతో నీకు జైకొడతా. కానీ ముందు వరుసలో నాకు సీటు మాత్రం రిజర్వ్ చేయాలి" అంటూ చమత్కరించింది. దీంతో సభలో మరోసారి నవ్వుల వెల్లువ ఎగిసింది.
ఇదంతా సరదా సంభాషణలా అయినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం తప్పు బడుతున్నారు. ఈ వ్యాఖ్యలను విజయ్ ప్రమాణ స్వీకార వేడుకతో పోలుస్తున్నారు. వాళ్లిద్దరిపైనా మండిపడుతున్నారు.
The day I take the oath as CM... I think Navya will be there in the front row wearing a saree...!!
- Dhyan Sreenivasan 😂 pic.twitter.com/UT5GvyK8Fq— Trollywood 𝕏 (@TrollywoodX) July 16, 2026
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు త్రిష.. ఆయన తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభతో కలిసి ముందు వరుసలో కూర్చోవడం, విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆమె భావోద్వేగానికి గురికావడం అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ ఘటననే ధ్యాన్ తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా ప్రస్తావించాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ కార్యక్రమంలో ధ్యాన్ మరో సరదా వ్యాఖ్య కూడా చేశాడు. విజయ్ ముఖ్యమంత్రి అయినట్లే.. తానూ రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ల తర్వాత కేరళ ముఖ్యమంత్రి అవుతానని జోక్ చేశాడు. అలాగే తన స్నేహితుడు, నటుడు అజు వర్గీస్‌ను ఈ సంభాషణలోకి లాగుతూ.. తనకి గవర్నర్ పదవి బాగుంటుందని నవ్వించాడు. వెంటనే అజు వర్గీస్ మీ అమ్మగారికి రాష్ట్రపతి పదవి దక్కుతుందని జోక్ చేశాడు.
అయితే ఈ ఎపిసోడ్ ఎటు దారి తీస్తుందని అనుకున్నాడో ఏమో.. అజు వర్గీస్ వేదిక మీదకు వచ్చి "విజయ్ సార్, నా ఫ్రెండ్ కొంచెం పిచ్చోడు.. దయచేసి క్షమించండి" అంటూ వ్యాఖ్యానించాడు. ఆ మాటతో అక్కుడున్నవాళ్లంతా కడుపుబ్బా నవ్వుకున్నారు.
ఎవరీ ధ్యాన్-నవ్యా?
ధ్యాన్ శ్రీనివాసన్(Dhyan Sreenivasan) మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత అయిన శ్రీనివాసన్ కుమారుడు. ప్రముఖ నటుడు, దర్శకుడు, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అయిన వినీత్ శ్రీనివాసన్‌కు సోదరుడు. 2013లో వచ్చిన తీరా సినిమాతో నటుడిగా పరిచయమైన ధ్యాన్, 2013లో 'తీరా' చిత్రంతో నటుడిగా పరిచయమైన ధ్యాన్ శ్రీనివాసన్.. 'ఆది కాప్యారే కూటమణి', 'కుంజిరామాయణం', 'గూడలోచన', 'వర్షంగళ్క్కు శేషం' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా కూడా మలయాళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.
ఇక.. నవ్యా నాయర్ మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటి. 'నందనం', 'ఇష్టం', 'కళ్యాణరామన్', 'పందిప్పాడ' వంటి విజయవంతమైన చిత్రాలతో గుర్తింపు పొందిన ఆమె, మలయాళంతో పాటు తమిళం, కన్నడ భాషల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ధ్యాన్ శ్రీనివాసన్ 2017లో అర్పితా సెబాస్టియన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నవ్యా నాయర్ 2010లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త సంతోష్ మీనన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.


