‘‘వారణాసి’ చిత్రానికి యాక్షన్ సన్నివేశాలు ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు ప్రియాంకా చోప్రా . మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలజీ సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడుగా రెండు పాత్రల్లో నటిస్తున్నారు మహేశ్‌బాబు. మందాకిని పాత్రలో ప్రియాంకా చోప్రా , కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేశ్‌బాబు పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.
తాజాగా ఈ సినిమా గురించి ప్రియాంకా చోప్రా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ‘‘వారణాసి’ కోసం 14 నెలలుగా నిరంతరాయంగా పని చేస్తున్నాను. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయి. అలాగే ఈ సినిమాకి ఓ హైలైట్‌గా నిలుస్తాయి. ఈ చిత్రం కోసం కొన్ని స్లో మోషన్ జంప్స్‌తో కూడిన సన్నివేశాల్లో నటించాను’’ అని ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ‘వారణాసి’ సినిమా గురించిన విశేషాలను చెప్పారు ప్రియాంకా చోప్రా . కేఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది.


