‘‘సినిమా అనేది సముద్రం. నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో హీరోయిన్ లైఫ్ స్పాన్ నాలుగేళ్లు మాత్రమే ఉంటుందని, అందుకే వీలైనంత సంపాదించుకుని సెటిలైపోవాలని, ఎవరైనా వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోవాలని ఇలా ఏదేదో చెప్పారు. నిజమని నమ్మి, వెంట వెంటనే సినిమాలు చేశాను. ఆ భయంతోనే ఇప్పటికే దాదాపు 50 సినిమాలు చేశాను.
ఆ భయం మంచిదైంది (సరదాగా..)’’ అని ఐశ్వర్యా రాజేష్ అన్నారు. తిరువీర్, ఐశ్వర్యా రాజేష్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఓ..! సుకుమారి’. భరత్ దర్శన్ దర్శకత్వంలో మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకరులతో ఐశ్వర్యా రాజేష్ చెప్పిన సంగతులు...
⇒ ‘ఓ..! సుకుమారి’ క్యూట్ లవ్‌స్టోరీ. ఈ సినిమాలో తిరువీర్, గవిరెడ్డి అన్నదమ్ములుగా నటించారు. ఈ ఇద్దరు అన్నదమ్ముల్లో ఎవరికి ముందు అబ్బాయి పుడితే వారికి కుటుంబ ఆస్తి వస్తుంది. ఈ సమయంలో నాకు, తిరువీర్‌కు వివాహం జరుగుతుంది. కానీ హీరో నన్ను ముట్టుకుంటే ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే ఈ చిత్రకథ
⇒ ఈ సినిమాలో నేను దామిని క్యారెక్టర్ చేశాను. ఒక వ్యక్తిపై ఉన్న నెగెటివ్ ఇంప్రెషన్ ఎలా పాజిటివ్‌గా మారింది? అన్నదే ఈ సినిమా స్టోరీ లైన్.
⇒ సినిమాలు... ఓటీటీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. ఓటీటీలో చేయడం వల్ల వేల్యూ తగ్గిపోదు. తమిళంలో ‘సుళల్’ వెబ్ సిరీస్ చేశాను. ఈ సిరీస్‌ను దాదాపు 40 భాషల్లో డబ్ చేశారు. ‘ఇసకపట్నం’ సిరీస్‌ను 16 భాషల్లో డబ్ చేశారు. నా కెరీర్‌లో ఇప్పటివరకు నెగెటివ్ క్యారెక్టర్స్ చేయలేదు. ‘ఇసకపట్నం’ సిరీస్‌లో నా క్యారెక్టర్‌లో కాస్త గ్రే షేడ్ ఉంటుంది. నాకు ఫుల్ నెగెటివ్ షేడ్ రోల్స్ చేయాలని ఉంది. రమ్యకృష్ణగారు చేసిన ‘నీలాంబరి’, ఇంగ్లిష్ సినిమా ‘అబ్సెషన్’’లో హీరోయిన్ చేసిన క్యారెక్టర్స్ చేయాలని ఉంది.


