నేడు వరల్డ్ ఎమోజీ డే
‘ఎమోజీ, ఎమోజీ ఏం చేస్తుంటావు?’ అని అడిగితే...
‘ఇద్దరు శత్రువుల మధ్య స్నేహదీపాన్ని వెలిగిస్తాను’
‘ఇద్దరు మిత్రులను శత్రువులను చేసి
పచ్చగడ్డి వేసి భగ్గుమనిపిస్తాను’ అన్నదట!
ఇంతకీ ఎమోజీ క్యారెక్టర్ ఏమిటి?
మనకు కరెక్ట్ ఫ్రెండా? ఖల్ నాయకా?
ఎమోజీలు చిన్నవే కావచ్చు. అయితే వాటి ప్రభావం మాత్రం పెద్దది. ఆత్మీయతల నుంచి అపార్థాల వరకు, వెలుగు పంచడం నుంచి డార్క్ వెబ్ మార్కెట్ వరకు ఆ ప్రభావం ఒక్కోచోట ఒక్కోరకంగా కనిపిస్తోంది...
ప్రతిరోజూ కోట్లాదిమంది ఆన్‌లైన్ సంభాషణలలో, వివిధ సందర్భాలలో ఎమోజీలను ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు సరదా సరదాగా కనిపించిన ఎమోజీలు ఇప్పుడు డిజిటల్ యుగానికి దృశ్యసంకేతాలుగా మారాయి.
అలా కాదు... ఇలా కూడా!
ఒకప్పుడు ఎమోజీ అంటే సరదా స్పందన మాత్రమే. అయితే ఇప్పుడు అవతలి వ్యక్తిని వేధించడానికి కూడా ఎమోజీలను ఉపయోగిస్తున్నారు. అవి కొన్నిసార్లు క్రూరంగా ఉంటున్నాయి. ఉదా: ఒకరి రూపాన్ని అవమానించడానికి పందిముఖం ఎమోజీని, ఒకరి బాడీ గురించి జోక్‌లు వేయడానికి పీచ్ ఎమోజీని, వేధించడానికి దెయ్యం ముఖం ఎమోజీని, బెదిరించడానికి మంట, బాంబు, తుపాకీ... మొదలైన ఎమోజీలను ఉపయోగిస్తున్నారు. ఆన్‌లైన్ వేధింపులపై దృష్టి సారించే సైబర్ బుల్లింగ్ రీసెర్చ్ సెంటర్ పరిశోధన ప్రకారం డిజిటల్ బెదిరింపులలో ‘పీచ్’లాంటి ఎమోజీలను ఉపయోగిస్తున్నారు.
గుర్తుపట్టలేవు!
ఎమోజీ ఆధారిత వేధింపులు అందరికీ తెలిసేలా ఉండకపోవడానికి ఒక కారణం..
ఒకే ఎమోజీలో... పంపిన వారికి, అందుకున్న వారికి మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి అనేక అర్థాలు ఉంటాయి. విద్వేషపూరిత పదాల కోసం స్కాన్ చేసే ఆటోమేటెడ్ సిస్టమ్స్ వ్యంగ్యపు చిరునవ్వు లేదా ఆటపట్టించే పీచ్ ఎమోజీలను విస్మరించవచ్చు. ఒకవేళ గుర్తించినప్పటికీ అందులోని అంతరార్థాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు.
ఎమోజీ మర్డర్!
ఒక ఎమోజీకి సంబంధించిన గొడవలో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన ఇరవై ఏళ్ల ప్రిన్స్ కుమార్ హత్యకు గురయ్యాడు. చనిపోయిన తన తాత రూప్‌నారాయణ్‌ను గుర్తు చేసుకుంటూ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టాడు ప్రిన్స్. అందరూ ‘అయ్యో!’ అని సానుభూతి చూపితే, రాజీందర్ గోండ్ అనే అతడి ఫ్రెండ్ మాత్రం నవ్వుతున్న ఎమోజీతో స్పందించాడు. దీంతో ఇద్దరిమధ్య గొడవైంది. ఫోన్‌లో మొదలైన మాటల యుద్ధం కాస్తా ఘర్షణ స్థాయికి చేరింది. ఈ క్రమంలో ప్రిన్స్‌పై గోండ్ దాడి చేసి హత్య చేశాడు.
కోర్టు మెట్లు ఎక్కిన ఎమోజీ!
తన భార్య ఒకరికి ‘కిస్’ ఎమోజీ పంపిందని, కాబట్టి విడాకులు మంజూరు చేయాలని జమ్మూ కశ్మీర్‌లో ఒక డాక్టర్ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిని సవాలు చేస్తూ ఆయన భార్య హైకోర్ట్‌ను ఆశ్రయించింది!
అంతటా... అవగాహన కలిగించాలి
ఎమోజీలను నిషేధించడం లేదా ప్రతి పోస్ట్‌ను పర్యవేక్షించడం కంటే విద్యావేత్తలు, యువతతో డిజిటల్ దృశ్యభాషపై అవగాహనను పెంపొందించాలి అని నిపుణులు సిఫారసు చేస్తున్నారు. అందులో కొన్ని...
→ ఎమోజీల అర్థాలు, వివిధ వయసుల వారికి సందర్భాలకు అనుగుణంగా అర్థం ఎలా మారుతుందో తెలియజేయాలి.
→ ఎమోజీలను హానికరంగా ఎలా ఉపయోగిస్తున్నారనే దానిపై ఇళ్లలో, పాఠశాలల్లో చర్చలు నిర్వహించాలి.
→ హానికరమైన ఎమోజీలను గుర్తించడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మోడరేషన్ సాధనాలను అప్‌డేట్ చేయాలి.
డిజిటల్ బాడీ లాంగ్వేజ్
పనిచేసేచోట వ్యక్తులు మాట్లాడుకునే విధానంలో అంతరం పెరుగుతోందని, అది ఎమోజీల రూపంలో వ్యక్తమవుతోందని సాఫ్ట్‌వేర్ కంపెనీ ‘అట్లాసియన్’ సర్వే చెబుతోంది. జెన్ జెడ్ ఉద్యోగులలో తొంభైశాతంమంది ‘కమ్యూనికేషన్‌పై ఎమోజీల ప్రభావం ఉంటుంది’ అని చెప్పారు. ఎమోజీలకు ‘డిజిటల్ బాడీ లాంగ్వేజ్’ అని పేరు పెట్టింది నివేదిక.
‘ఎమోజీలు వినోదం కోసం మాత్రమే కాదు... మోటివేషన్ విషయంలోనూ సహాయపడతాయి’ అంటున్నారు జెన్ జెడ్‌లో చాలామంది. యువతలో మూడింట రెండు వంతుల మంది ఎమోజీలు ఉన్న మెసేజ్‌లను చదవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు.
డార్క్ వెబ్ ఎమోజీ
సినిమాలలో ముసుగులు ధరించిన నేరస్థులు, ఎదుటి వ్యక్తికి అనుమానం రాకుండా తమను తాము గుర్తించుకోవడానికి సంకేత పదాలు, రహస్య సంజ్ఞలు ఉపయోగించడం మనకు తెలిసిందే. ఎమోజీలను డిజిటల్ ప్రపంచపు సంకేత పదాలుగా పరిగణిస్తున్నారు. మత్తు పదార్థాల పేర్లను దాచడానికి డార్క్ వెబ్ మార్కెట్లు ఎమోజీలను ఉపయోగించుకుంటున్నాయి. సైబర్ దాడులు, మోసాలు, మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా వంటి నేరాలకు సంబంధించి నేరగాళ్లు కోడ్ సందేశాలుగా ఎమోజీలను ఉపయోగిస్తున్నారు.
ఎమోజీ కాంటాక్డ్ డైరెక్టరీ!
కోల్‌కత్తాలోని ఒక ఇంట్లో పని చేసే ఝుర్నా నిరక్షరాస్యురాలు. తన సెల్‌ఫోన్‌లో పేర్లను ఫీడ్ చేసుకోలేదు. ఎవరైనా ఫీడ్ చేసినా చదువుకోలేదు కదా! అప్పుడు ఎమోజీలే ఆమెకు సహాయపడ్డాయి. పేర్లకు బదులుగా ఆమె సెల్ స్క్రీన్‌పై వరుసగా ఎమోజీలు కనబడతాయి. వ్యక్తిని లేదా ప్రదేశాన్ని ఈ ఎమోజీలు సూచిస్తాయి. ఉదాహణకు వర్మ అనే వ్యక్తి కాంటాక్ట్ ను హంస ఎమోజీతో సేవ్ చేసింది. మరోవ్యక్తి కాంటాక్ట్‌ను గుడి ఎమోజీతో సేవ్ చేసింది. ఎందుకంటే ఆ వ్యక్తి గుడికి దగ్గరగా ఉంటాడు... ఇలా రకరకాల సంకేతాలతో తనదైన పర్సనల్ ఎమోజీ కాంటాక్డ్ డైరెక్టరీని రూపొందించుకుంది ఝుర్నా.


