ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగు రివ్యూ | Parimala And Co Movie Review Telugu | Sakshi
Sakshi News home page

Parimala And Co Review: 'దృశ్యం'ని కామెడీ స్టైల్లో తీస్తే.. ఓటీటీ మూవీ రివ్యూ

Jul 13 2026 1:56 PM | Updated on Jul 13 2026 1:59 PM

Parimala And Co Movie Review Telugu

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా మిగతా భాషల్లో ప్రేక్షకులని అలరించిన చిత్రాలు, డబ్బింగ్‌ల రూపంలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా గత వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ 'పరిమిళ అండ్ కో'. జీ5 ఓటీటీలో తెలుగులో అందుబాటులో ఉన్న ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)

కథేంటి?
మిడిల్ క్లాస్‌కి చెందిన పరిమిళ(జయరాం).. తన భార్య స్వరాజ్యం(ఊ‍ర్వశి), కూతుళ్లు పరాశక్తి, మధుమితతో కలిసి ఓ అద్దె ఇంట్లో బతికేస్తుంటాడు. ప్రశాంతంగా ఉన్న వీళ్ల జీవితంలోకి వర్గీస్ (శాండీ మాస్టర్) అనే లోకల్ రౌడీ ఎంట్రీ ఇస్తాడు. పరిమళ చిన్న కూతురు మధుమిత వెంటపడుతూ పెళ్లి చేసుకుంటానని ఇబ్బందిపెడుతుంటాడు. ఈ టార్చర్ భరించలేక అతడిని చంపేస్తే బాగుంటుందని కుటుంబమంతా ఓ రోజు అనుకుంటారు. సీన్ కట్ చేస్తే తర్వాత రోజు తెల్లారేసరికి వర్గీస్ హత్యకు గురవుతాడు. ఇంతకీ ఇతడిని చంపిందెవరు? పరిమళ కుటుంబానికి ఈ హత్యకు సంబంధముందా? లేదా? అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
'దృశ్యం' వచ్చిన తర్వాత ఈ తరహా కాన్సెప్ట్‌లతో చాలా సినిమాలు వస్తున్నాయి. ఇది కూడా అలాంటి ఓ మూవీనే. కాకపోతే అది సీరియస్, దీన్ని మాత్రం కామెడీగా తీశారు. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోకుండా ఓ హత్య కేసులో ఇరుక్కుంటే ఏమవుతుంది? అనే సింపుల్ కాన్సెప్ట్ ఈ చిత్రంలోనూ చూపించారు. ఇక ఎలా ఉందంటే ఓటీటీలో చూస్తున్నప్పుడు అయితే ఓకే ఓకే అనిపించింది.

మొదలైన అరగంట పాటు సినిమా చకచకా వెళ్తుంది. తర్వాత హత్య ఎవరు చేశారు? అనే దగ్గర పరిమిళ కుటుంబంలోని ఒక్కొక్కరిపై అనుమానం వచ్చేలా సీన్స్ వస్తుంటాయి. వీళ్లతో పాటు పరిమళ తమ్ముడు, బావమరిదిపై కూడా అనుమానం వస్తుంది. ఒకానొక దశలో ఎవరో చంపారనేది పరిమిళ కుటుంబానికి తెలిసిపోతుంది. కానీ పోలీసులకు మాత్రం అంతుచిక్కదు. మరోవైపు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న ఏడుకొండలు అనే సీఐ.. నిందితుడిని కనిపెట్టకుండా ఆలస్యం చేస్తుంటాడు. ఇలా ఎందుకు చేస్తున్నాడనే దానికి చివరలో వివరణ ఇస్తారు.

సినిమాలో కామెడీ.. పార్ట్స్ పార్ట్స్‌గానే వర్కౌట్ అయింది. హత్య ఎవరు చేశారనే విషయంలో చాలామందిపై అనుమానం వచ్చేలా సీన్స్ చూపిస్తారు కానీ చివరలో అసలు వర్గీస్‌ని ఎవరు? ఎందుకు చంపారనేది ఊహించని ట్విస్టు రూపంలో బయటపెడతారు. అయితే అది మూవీలో ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది తప్పితే సహజంగా అనిపించదు. సెకండాఫ్‌లో స్టోరీ అంతా అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపించడం ఓ మైనస్.

నటన విషయానికొస్తే.. పరిమళ, స్వరాజ్యం అనే భార్యభర్తలుగా చేసిన జయరాం, ఊర్వశి తమ అనుభవం చూపించి నవ్వించారు. వీళ్ల కూతుళ్లుగా చేసిన సంజన, అనంతిక కూడా బాగానే చేశారు. పోలీస్ అధికారిగా మిస్కిన్, వర్గీస్ అనే రౌడీగా శాండీ మాస్టర్.. పరిమిళ పెద్ద కూతురి ప్రియుడిగా తెలుగు హీరో సంతోశ్ శోభన్ ఆకట్టుకున్నారు. మిగిలిన వాళ్లు ఓకే.

టెక్నికల్ అంశాలకొస్తే మ్యూజిక్ గుర్తుంచుకునేంత గొప్పగా ఏం లేదు. సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు. దర్శకుడు పాండిరాజ్ ఓ పాయింట్ అనుకున్నారు కానీ దాన్ని తీసే క్రమంలో సాగదీసి వదిలారు. పేరుకే రెండున్న గంటల మూవీ గానీ మూడు గంటల నిడివిలా అనిపిస్తుంది. మీకు బాగా ఖాళీ ఉండి ఏదో టైమ్ పాస్ చేద్దామనుకుంటే ఈ చిత్రం చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలేం లేవు. కుటుంబంతోనూ వీక్షించొచ్చు.

- చందు డొంకాన

(ఇదీ చదవండి: అనాథకి అద్భుత దీపం దొరికితే.. ఫహాద్ ఫాజిల్ హీరోగా తెలుగు సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement