ఐటీ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 1,465 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన రూ. 1,140తో పోలిస్తే సుమారు 28 శాతం పెరిగింది. మరోవైపు ఆదాయం సుమారు 18 శాతం వృద్ధితో రూ. 13,351 కోట్ల నుంచి రూ. 15,712 కోట్లకు చేరింది.
త్రైమాసికాలవారీగా చూస్తే క్యూ1లో మొత్తం సిబ్బంది సంఖ్య 863 మేర తగ్గి 1,46,760కి పరిమితమైంది. గడిచిన పన్నెండు నెలల వ్యవధిలో ఐటీ అట్రిషన్ రేటు సుమారు 11.8 శాతంగా ఉంది. అటు డాలరు మారకంలో చూస్తే ఆదాయం వార్షికంగా 6.1 శాతం, సీక్వెన్షియల్‌గా 2.2 శాతం వృద్ధి చెంది 1,660 మిలియన్ డాలర్లుగా నమోదైంది. వరుసగా మూడో త్రైమాసికంలోను బిలియన్ డాలర్ల పైగా డీల్స్‌ను సాధించినట్లు కంపెనీ సీఈవో మోహిత్ జోషి తెలిపారు.
50 మిలియన్ డాలర్ల పైగా కాంట్రాక్టులు ఇచ్చిన సంస్థల సంఖ్య ఏడు మేర పెరిగినట్లు వివరించారు. ఐటీ సేవల విభాగం ఆదాయం రూ. 11,264 కోట్ల నుంచి రూ. 13,245 కోట్లకు, బీపీఎస్ సెగ్మెంట్ ఆదాయం రూ. 2,087 కోట్ల నుంచి రూ. 2,467 కోట్లకు పెరిగాయి. త్రైమాసికం ఆఖరు నాటికి కంపెనీ వద్ద నగదు నిల్వలు సుమారు రూ. 9,695 కోట్లు ఉన్నాయి.


