కేంద్రానికి ఎస్‌బీఐ భారీ డివిడెండ్ | SBI Hands Rs 8813 Crore Dividend to Govt Records Historic Profit SurgeSBI | Sakshi
Sakshi News home page

కేంద్రానికి ఎస్‌బీఐ భారీ డివిడెండ్

Jun 8 2026 6:14 PM | Updated on Jun 8 2026 6:15 PM

SBI Hands Rs 8813 Crore Dividend to Govt Records Historic Profit SurgeSBI

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం, ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికార్డులతో దూసుకుపోతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.8,813 కోట్ల భారీ డివిడెండ్‌ను ఎస్‌బీఐ చెల్లించింది. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఎస్‌బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి ఈ డివిడెండ్ చెక్కును కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్‌కు అధికారికంగా అందజేశారు. 

ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ ద్వారా వెల్లడించింది. ఎస్‌బీఐ సాధించిన ఈ ఆర్థిక వృద్ధి, ప్రభుత్వ పన్నుయేతర ఆదాయ వనరులకు మరింత బలాన్ని చేకూర్చడంతోపాటు బ్యాంక్ పటిష్టమైన ఆర్థిక స్థితిని ప్రతిబింబిస్తోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

రికార్డు స్థాయి లాభాలతో..

ఇటీవలే ముగిసిన జనవరి-మార్చి 2026 త్రైమాసికంలో ఎస్‌బీఐ మెరుగైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. ఈ బలమైన ఆదాయాలే ప్రభుత్వానికి ఈ స్థాయిలో భారీ డివిడెండ్ చెల్లించడానికి ప్రధాన కారణమయ్యాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.18,643 కోట్లతో పోలిస్తే ఈసారి నికర లాభం 6 శాతం వృద్ధితో రూ.19,684 కోట్లకు చేరింది. బ్యాంక్ ప్రధాన ఆదాయ వనరు అయిన నికర వడ్డీ ఆదాయం (రుణాలపై వచ్చే వడ్డీకి, డిపాజిట్లపై చెల్లించే వడ్డీకి మధ్య వ్యత్యాసం) ఏకంగా 4 శాతం వృద్ధితో రూ.44,380 కోట్లుగా నమోదైంది.

దలాల్ స్ట్రీట్‌లో జోరు

స్టాక్ మార్కెట్లో ఎస్‌బీఐ షేరు దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు కాసుల వర్షం కురిపించింది. గత నెల రోజుల్లో స్వల్పంగా 4 శాతం మేర ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ గత వారంలోనే ఈ స్టాక్ 3 శాతానికి పైగా పుంజుకుంది. ప్రస్తుతం ఎస్‌బీఐ మార్కెట్ విలువ సుమారు రూ.9.08 లక్షల కోట్లకు చేరింది. దేశంలోనే అత్యంత విలువైన బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటిగా ఎస్‌బీఐ తన అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.

ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం!

Advertisement
 
Advertisement
Advertisement