కోల్‌కతా: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ బంధన్ బ్యాంక్ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రూ. 502 కోట్ల లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 372 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 35 శాతం అధికం. నికర వడ్డీ ఆదాయం 5.9 శాతం పెరిగి రూ. 2,757 కోట్ల నుంచి రూ. 2,921 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 1.2 శాతం వృద్ధితో రూ. 3,483 కోట్ల నుంచి రూ. 3,524 కోట్లకు పెరిగింది.
రుణాలు 16.4 శాతం పెరిగి రూ. 1,33,625 కోట్లకి చేరాయి. మొండి బాకీల విషయానికొస్తే స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) 182 బేసిస్ పాయింట్లు, నికర ఎన్‌పీఏలు 43 బేసిస్ పాయింట్ల మేర తగ్గాయి. వరుసగా 3.1 శాతం, 0.9 శాతంగా నమోదయ్యాయి. మధ్యంతర చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా విజయ్ జైన్ నియామకానికి బోర్డు ఆమోదం తెలిపిందని బ్యాంకు వివరించింది.


