మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ చెల్లింపులు, ఆన్‌లైన్ స్టేట్‌మెంట్లు ఇలా అన్నీ వేగంగా పెరుగుతున్నాయి, దీంతో బ్యాంకింగ్ రంగం పూర్తిగా డిజిటల్ అయిపోయిందని భావిస్తాం. కానీ.. వాస్తవానికి బ్యాంకుల లోపల ఇంకా భారీగా పేపర్ ఆధారిత వ్యవస్థ కొనసాగుతోంది. ఈ విషయం FY25 గణాంకాల్లో స్పష్టంగా కనిపించింది.
భారతదేశంలోని ప్రముఖ బ్యాంకులు ప్రింటింగ్, స్టేషనరీ, చెక్‌బుక్స్, పాస్‌బుక్స్, ఫార్మ్స్ వంటి అవసరాల కోసం ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ప్రింటింగ్ అండ్ స్టేషనరీపై గ్రోవ్ సంస్థ నివేదికలు చెబుతున్నాయి. డిజిటల్ సేవలు పెరిగినా, సంప్రదాయ పేపర్ వర్క్ పూర్తిగా తగ్గలేదని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. FY25లో ఈ బ్యాంక్ సుమారు రూ.986.4 కోట్లు ప్రింటింగ్, స్టేషనరీ కోసం ఖర్చు చేసింది. ఇదే సమయంలో ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా దాదాపు రూ.922.5 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం.
ఇతర ప్రధాన బ్యాంకుల విషయానికి వస్తే.. ఐసీఐసీఐ బ్యాంక్ సుమారు రూ.318.5 కోట్లు ఖర్చు చేసింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ దాదాపు రూ.373.8 కోట్లు వెచ్చించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వంటి సంస్థలు కూడా 1 శాతం పరిధిలోనే ఈ ఖర్చులను కొనసాగిస్తున్నాయి.
అయితే నిజమైన భారం కొన్ని మధ్యస్థాయి బ్యాంకులపై ఎక్కువగా పడుతోంది. ఉదాహరణకు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ తన లాభాల్లో దాదాపు 8 శాతం కంటే ఎక్కువ స్టేషనరీ ఖర్చులకే వెచ్చించడం గమనార్హం. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి బ్యాంకుల్లో కూడా ఈ ఖర్చు శాతం గణనీయంగా కనిపిస్తోంది.
భారత బ్యాంకింగ్ రంగం డిజిటల్ వైపు వేగంగా అడుగులు వేస్తున్నప్పటికీ, పాత పద్ధతులైన పేపర్ వర్క్ ఇంకా పూర్తిగా వెనక్కి వెళ్లలేదు. భవిష్యత్తులో డిజిటలైజేషన్ మరింత పెరిగితే ఈ ఖర్చులు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతం మాత్రం ''డిజిటల్ బ్యాంకింగ్ + పేపర్ బ్యాంకింగ్'' కలిసి నడుస్తున్న వాస్తవాన్ని ఈ గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.
How much do Banks spend on Pen & Paper?
(Costs for FY25) pic.twitter.com/OViC5vd8Bl— Groww (@_groww) June 17, 2026


