త్రైమాసిక ఫలితాల్లో ఆహా అనిపించిన ఎస్‌బీఐ | SBI Q1 Results Net Profit Surges to Rs 24113 Cr Crosses Historic Milestone | Sakshi
Sakshi News home page

త్రైమాసిక ఫలితాల్లో ఆహా అనిపించిన ఎస్‌బీఐ

Aug 8 2026 8:25 AM | Updated on Aug 8 2026 8:36 AM

SBI Q1 Results Net Profit Surges to Rs 24113 Cr Crosses Historic Milestone

క్యూ1లో 14 శాతం అప్‌

వడ్డీ ఆదాయం రూ.46,992 కోట్లు

బ్యాంకింగ్‌ రంగ ప్రభుత్వ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ (ఎస్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 14 శాతం ఎగసి రూ. 24,113 కోట్లను తాకింది. స్టాండెలోన్‌ నికర లాభం సైతం 10 శాతం వృద్ధితో రూ. 21,121 కోట్లను అధిగమించింది. గతేడాది(2025–26) ఇదే కాలంలో రూ. 19,160 కోట్లు ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 15 శాతం జంప్‌చేసి రూ. 46,992 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు దేశీయంగా 3 శాతంగా నమోదయ్యాయి.

ఫారెక్స్‌ డెరివేటివ్స్‌ ఆదాయం తగ్గడంతో వడ్డీయేతర ఆదాయం 9 శాతం నీరసించి రూ. 15,293 కోట్లకు పరిమితమైంది. ఈ ఆర్థిక సంవత్సరం 14–15 రుణ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంక్‌ చైర్మన్‌ సీఎస్‌ శెట్టి తెలియజేశారు. ఇందుకు డిపాజిట్లలో 10–11 శాతం వృద్ధి సహకరించనున్నట్లు పేర్కొన్నారు. ఎఫ్‌సీఎన్‌ఆర్‌(బీ) మార్గంలో 6 బిలియన్‌ డాలర్లు మొబిలైజ్‌ చేసినట్లు వెల్లడించారు. ఈ పథకం గడువు ముగియనున్న సెపె్టంబర్‌కల్లా ఇది 10 బిలియన్‌ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేశారు.

స్లిప్పేజీలు తగ్గాయ్‌

తాజా సమీక్షా కాలంలో ఎస్‌బీఐ స్లిప్పేజీలు గతేడాది క్యూ1(రూ. 7,945 కోట్లు)తో పోలిస్తే రూ. 7,046 కోట్లకు తగ్గాయి. వార్షికంగా స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) సైతం 1.83 శాతం నుంచి 1.47 శాతానికి దిగివచ్చాయి. మొండి రుణాలకు కేటాయింపులు రూ. 4,934 కోట్ల నుంచి రూ. 3,359 కోట్లకు వెనకడుగు వేశాయి. కనీస మూలధన నిష్పత్తి 15.67 శాతంగా నమోదైంది.

100 లక్షల కోట్ల వ్యాపారం..

ఎస్‌బీఐ మొత్తం వ్యాపారం రూ. 100 లక్షల కోట్ల మార్కును అధిగమించింది. తద్వారా దేశీయంగా ఈ ఘనతను సాధించిన తొలి బ్యాంకుగా నిలిచింది. డిపాజిట్లు రూ. 60 లక్షల కోట్లు, రుణాలు రూ. 50 లక్షల కోట్లుగా ఉన్నట్లు బ్యాంకు తెలిపింది. దాదాపు రూ. 3.6 లక్షల కోట్ల కార్పొరేట్‌ రుణాలపై కసరత్తు జరుగుతోందని ఎండీ అశ్విని కుమార్‌ తెలిపారు.

ఇదీ చదవండి: పెట్రోల్ వెనుక ఉన్న అసలు నిజాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement