పెట్రోల్ వెనుక ఉన్న అసలు నిజాలు | Black Gold Secret How Petrol Reaches Your Tank Hidden E20 Revolution | Sakshi
Sakshi News home page

పెట్రోల్ వెనుక ఉన్న అసలు నిజాలు

Aug 7 2026 1:43 PM | Updated on Aug 7 2026 1:49 PM

Black Gold Secret How Petrol Reaches Your Tank Hidden E20 Revolution

ఉదయాన్నే బండి స్టార్ట్ చేయగానే మీ జేబులోంచి రూపాయి కరిగించే పెట్రోల్... కేవలం వాహనం నడిపే ఇంధనం మాత్రమే కాదు! అది ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను శాసించే అదృశ్య శక్తి. భూగర్భంలోని వేల అడుగుల లోతులో నల్లటి ద్రవంగా పుట్టి.. దుబాయ్, సౌదీ ఎడారుల నుంచి ముంబై సముద్ర తీరాల మీదుగా ప్రయాణించి.. రిఫైనరీల భారీ కొలిముల్లో రూపాంతరం చెంది మన వాహనం ట్యాంకులోకి చేరే వరకు ‘నల్ల బంగారం’ వెనుక అతిపెద్ద సాంకేతిక, ఆర్థిక విప్లవమే దాగి ఉంది. అసలు ఈ ఇంధనాన్ని ఎలా తీస్తారు? అరబ్ దేశాల వెలికితీతకు, భారత విధానానికి తేడా ఏంటి? ఒక్క లీటర్ ముడిచమురు నుంచి పెట్రోల్‌తో పాటు లభించే ఆ లగ్జరీ బై-ప్రొడక్ట్‌లు ఏవి? ఇక మన దేశంలో సైలెంట్‌గా సాగిపోతున్న ఈ20 ఇంధన విప్లవం గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

పెట్రోల్ ఎలా తయారు చేస్తారు?

సాంకేతిక భాషలో పెట్రోల్‌ను ‘గ్యాసోలిన్’ అని పిలుస్తారు. ఇది ప్రధానంగా హైడ్రోకార్బన్ల (హైడ్రోజన్, కార్బన్ మూలకాల సమ్మేళనం) మిశ్రమం. భూగర్భంలో మిలియన్ల సంవత్సరాల పాటు అధిక ఉష్ణోగ్రత, పీడనాలకు గురైన వృక్ష, జంతు అవశేషాల నుంచి ఏర్పడిన క్రూడ్ ఆయిల్ (చమురు)ను ప్రాసెస్ చేయడం ద్వారా పెట్రోల్ తయారవుతుంది.

ప్రాసెసింగ్ విధానం

చమురు శుద్ధి కర్మాగారాల్లో క్రూడ్ ఆయిల్‌ను ప్రత్యేక పరిస్థితుల్లో వేడి చేస్తారు. వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద వేర్వేరు హైడ్రోకార్బన్లు ఆవిరిగా మారి విడిపోతాయి. 30 డిగ్రీ-200 డిగ్రీ ఉష్ణోగ్రత వద్ద పెట్రోల్ (గ్యాసోలిన్) ఉత్పత్తుల ఆవిరులు వేరై చల్లబడి ద్రవ రూపంలో మారుతాయి. తదనంతరం ఈ ద్రవానికి ఆక్టేన్ రేటింగ్ పెంచేందుకు క్రాకింగ్, రిఫార్మింగ్(సాధారణంగా ముడిచమురును వేడి చేసినప్పుడు పెట్రోల్ కన్నా డీజిల్, భారమైన పదార్థాలు ఎక్కువ పరిమాణంలో వస్తాయి. కానీ మార్కెట్‌లో పెట్రోల్‌కు డిమాండ్ ఎక్కువ. అందుకే, ఆ భారమైన నూనెలను సైతం పెట్రోల్‌గా మార్చే పద్ధతులు ఇవి. వీటిలో ఎక్కువ కార్బన్ అణువులు ఉన్న పెద్ద, సంక్లిష్టమైన హైడ్రోకార్బన్ గొలుసులను అధిక ఉష్ణోగ్రత, పీడనం లేదా ఉత్ప్రేరకాల సహాయంతో చిన్న తేలికపాటి అణువులుగా (పెట్రోల్‌గా) మారుస్తారు) వంటి ప్రక్రియలు నిర్వహిస్తారు.

అరబ్ దేశాలు.. భారత్: వెలికితీత విధానాలు

అరేబీయా ద్వీపకల్పంలో చమురు నిల్వలు భూమి పొరల్లో, తీరప్రాంతాల్లో పుష్కలంగా ఉన్నాయి. సాంప్రదాయ రిగ్గుల ద్వారా భూమి లోపలికి రంధ్రాలు చేసి సహజ సిద్ధంగా ఉండే అధిక పీడనం సహాయంతో ఆయిల్‌ను పైకి రప్పిస్తారు. ఉత్పత్తి వ్యయం ప్రపంచంలోనే ఇక్కడ అత్యంత తక్కువ.

భారత్‌లో వెలికితీత

భారతదేశంలో అంతర్గత చమురు ఉత్పత్తి అవసరాలలో 15-20% మాత్రమే తీరుస్తుంది. ముంబై హై ప్రాజెక్ట్‌లో భాగంగా సముద్రంలో భారీ ఫ్లోటింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ఏర్పాటు చేసి అడుగు భాగాన్ని డ్రిల్ చేస్తారు. అందులో నుంచి వచ్చే చమురును ప్రాసెస​్‌ చేస్తారు. అస్సాం (దిగ్‌బోయ్, నహర్‌కటియా), గుజరాత్ (అంకలేశ్వర్), కృష్ణా-గోదావరి (కేజీ బేసిన్‌), రాజస్థాన్ (బార్మర్)లలో ఆన్‌షోర్ డ్రిల్లింగ్ (భూమిపై) ల్యాండ్ రిగ్గుల ద్వారా చమురు తీస్తున్నారు.

ఉప ఉత్పత్తులు ఇవే..

క్రూడ్ ఆయిల్‌ను రిఫైన్ చేసినప్పుడు పెట్రోల్ ఒక్కటే రాదు. దానితో పాటు లభించే ఉప ఉత్పత్తులు ఆధునిక రసాయన పరిశ్రమకు ముడిసరుకుగా మారుతున్నాయి.

ఎల్‌పీజీ (ద్రవీకృత పెట్రోలియం గ్యాస్): వంటగ్యాస్, పారిశ్రామిక ఇంధనం

డీజిల్: రవాణా రంగానికి ఉపయోగిస్తున్నారు.

కిరోసిన్, ఏవియేషన్ ఫ్యూయల్: విమానాల ఇంధనం, గృహ అవసరాలు.

నాఫ్తా: పెట్రోకెమికల్స్, ప్లాస్టిక్స్, ఎరువుల తయారీ.

బిటుమెన్, తార్‌: రోడ్ల నిర్మాణం, వాటర్ ప్రూఫింగ్.

పారాఫిన్ వ్యాక్స్: కొవ్వొత్తులు, కాస్మొటిక్స్, ఫార్మా రంగాలు.

చమురు మార్కెటింగ్.. కంపెనీల సరళి

చమురు వ్యాపారంలో రెండు ప్రధాన రంగాలు ఉంటాయి. ఒకటి అప్‌స్ట్రీమ్. అంటే చమురు అన్వేషణ, వెలికితీత (ఉదా: ఓఎన్‌జీసీ, ఓఐఎల్‌).
రెండు డౌన్‌స్ట్రీమ్ కంపెనీలు. ఇందులో  శుద్ధి, మార్కెటింగ్, పంపిణీ (ఉదా: ఐఓసీఎల్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌) వంటివి వస్తాయి.

క్రూడ్ ఆయిల్ సేకరణ➔ రిఫైనింగ్ (శుద్ధి)➔ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల ద్వారా పంపిణీ ➔ రిటైల్ అవుట్‌లెట్లు (బంకులు)

కంపెనీల లాభనష్టాల మాటేమిటి?

ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్‌ను ప్రాసెస్ చేసినప్పుడు వచ్చే ఉత్పత్తుల విలువకు క్రూడ్ ఆయిల్ అసలు ధర మధ్య ఉండే వ్యత్యాసమే రిఫైనరీల లాభం. అంతర్జాతీయ మార్కెట్‌లో రష్యా-ఉక్రెయిన్, ఇరాన్‌-యూఎస్‌ మధ్య అశాంతి మూలంగా బ్యారెల్ క్రూడ్ ధర పెరిగితే ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై ధరల నియంత్రణ విధించినప్పుడు కంపెనీలు నష్టాలు చవిచూస్తాయి. భారత్‌లో పెట్రోల్ రిటైల్ ధరలో దాదాపు 40-50% వరకు కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాల వ్యాట్ పన్నులే ఉంటాయి.

భారత్‌లో ఈ20 విప్లవం

భారతదేశం విదేశీ చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, ఉద్గారాలను అరికట్టడానికి ఈ20 (20% ఇథనాల్ + 80% పెట్రోల్) బ్లెండింగ్‌ ప్రోగ్రామ్‌ను వేగవంతం చేసింది. 2030 నాటికి నిర్దేశించుకున్న 20 శాతం ఇథనాల్ మిశ్రమం లక్ష్యాన్ని భారత్ ముందుగానే సాధించి దేశవ్యాప్తంగా ఈ20 ఇంధన లభ్యతను అందుబాటులోకి తెచ్చింది. చెరకు చెక్కెర పాకం, మొక్కజొన్న, ధాన్యం వ్యర్థాల నుంచి ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఫారెన్‌ ఎక్స్చేంజ్‌ రిజర్వులు వేల కోట్లు దీని వల్ల ఆదా అవుతున్నాయి. దాంతోపాటు రైతుల ఆదాయం పెరుగుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కర్బన ఉద్గారాలు తగ్గడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సైతం చేకూరుతోందని అంటోంది.

ఇదీ చదవండి: మీ EPF డబ్బు సురక్షితంగా ఉండాలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement